మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతుపాను కదలికలపై సిఎం ఆరా

39 నిమిషాల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 10:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అక్వాన్ తుపాను కదలికలపై అధికారులను వివరాలు అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి పలు సూచనలు చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మంగళవారం నాడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్షించారు. తుపాను కదలికలు, తీవ్రత, రాష్ట్రంపై చూపే ప్రభావం, ముందస్తు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు నేరుగా సమాచారం అందించాలని సిఎం సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుపాను గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, తుపాను తీరం దాటే సమయంలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుపాను ప్రభావితం చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విపత్తులొస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా ప్రభుత్వం, అధికారులు అండగా ఉంటారనే భరోసాను ప్రజల్లో కల్పించాలని సూచించారు. తుపాను కారణంగా చెట్లు కూలినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా వెంటనే తొలగించి విద్యుత్, రవాణా వ్యవస్థలను పునరుద్ధరించాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ అవసరమైన చోట రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. తుపాను ప్రభావంతో చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిఎం చంద్రబాబు సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్