భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంకకు భారత బౌలర్లు ఊహించిని షాకిచ్చారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ (3 వికెట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (3 వికెట్లు) ధాటికి లంక టాప్ పెవిలియన్‌కు చేరింది. పసిందు సూరియబండార (80), సోనాల్ దినూష (85 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో శ్రీలంకను ఆదుకున్నారు. కమిందు మెండిస్ (32) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయగా మిగాతా బ్యాటర్లలంతా లాహిరు ఉదార (1), కమిల్ మిషార (19), ప్రబాత్ జయసూర్య (2), , ధనంజయ డి సిల్వా (8), నిరోషన్ డిక్వెల్లా (0), కేశర నువంత (18), లహిరు కుమార (8) తక్కువ పరుగులకే ఔటయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
అంతకు ముందుకు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (117) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీతో మెరవగా, వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ (115 నాటౌట్) అద్భుతమైన అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ ఇద్దరితో పాటు రిషబ్ పంత్ (63), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (50) అర్ధశతకాలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టాడు.







కామెంట్‌లు (0)