న్యూఢిల్లీ:
భారతదేశంలో వ్యాపిస్తున్న శ్వాసకోశ వైరస్‌లలో 'ఇన్ఫ్లూయెంజా ఎ'కి చెందిన 'హెచ్1ఎన్1' (H1N1) స్ట్రెయిన్ అత్యంత తీవ్రంగా విస్తరిస్తోందని, పరీక్షించిన ఇన్ఫ్లూయెంజా-ఎ కేసులలో ఇది దాదాపు 98 శాతం వరకు ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బాల్ మంగళవారం వెల్లడించారు.
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైరల్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా బహుళ స్థాయి (multi-tiered), రియల్-టైమ్ సర్వైలెన్స్ నెట్‌వర్క్‌ను భారత్ ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రాల సమాచారాన్ని 'ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫారమ్' (IHIP), 'నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్' (NCDC) ద్వారా అనుసంధానిస్తూ, ఐసీఎంఆర్ నేరుగా ఆసుపత్రుల ఆధారిత శాంప్లింగ్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. దీని ద్వారా హెచ్1ఎన్1 వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తక్షణమే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతోందని వివరించారు.
"మనదేశంలో ఏయే వైరస్‌లు వ్యాపిస్తున్నాయనేది ఎప్పటికప్పుడు గుర్తించే సామర్థ్యం, ముఖ్యంగా కొవిడ్ తర్వాత గణనీయంగా పెరిగింది. మేము బహుళ స్థాయిల్లో పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం. మొదటిది, IHIP మరియు NCDC ద్వారా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా ల్యాబ్ సమాచారాన్ని నమోదు చేస్తున్నాం. ఇది కాకుండా, శ్వాసకోశ సంబంధిత వైరస్‌ల పర్యవేక్షణకు దేశవ్యాప్తంగా 73 ల్యాబ్‌లు లేదా ఆసుపత్రులతో ఐసీఎంఆర్ 'సెంటినెల్ సర్వైలెన్స్' నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఇది ఎన్‌సీడీసీ నెట్‌వర్క్‌కు అదనపు పొరలా పనిచేస్తుంది" అని రాజీవ్ బాల్ తెలిపారు.
దేశవ్యాప్త పర్యవేక్షణ గణాంకాల ప్రకారం.. ఇతర శ్వాసకోశ వైరస్‌లతో పోలిస్తే హెచ్1ఎన్1 కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అదే సమయంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య మాత్రం నిరంతరం తగ్గుముఖం పడుతోందని ఆయన స్పష్టం చేశారు.
"ప్రస్తుతం ఇన్ఫ్లూయెంజా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇన్ఫ్లూయెంజాలో 'ఎ', 'బి' అనే రెండు రకాలు మానవుల్లో కనిపిస్తాయి. 'ఇన్ఫ్లూయెంజా ఎ' లో ఎక్కువగా హెచ్1ఎన్1 వైరెసే కనిపిస్తోంది. సేకరించిన నమూనాలలో హెచ్1ఎన్1 దాదాపు 97 నుండి 98 శాతం వరకు ఉండగా, 'హెచ్3ఎన్2' (H3N2) రకం కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉంది. వీటికి తోడు 'ఇన్ఫ్లూయెంజా బి' (విక్టోరియా లినేజ్) కూడా కొంతవరకు వ్యాప్తిలో ఉన్నప్పటికీ, అది తీవ్రంగా లేదు; ప్రస్తుతం హెచ్1ఎన్1 వైరసే అత్యధికంగా వ్యాపిస్తోంది. ఇక కొవిడ్-19 (SARS-CoV-2) కేసులు గతంలో కొద్దిగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం క్రమంగా తగ్గుతున్నాయి" అని ఆయన చెప్పారు.
హెచ్1ఎన్1 తో సహా సాధారణ సీజనల్ ఇన్ఫ్లూయెంజాలు "ఎక్కువగా తీవ్రమైన ప్రభావం చూపవు" (Self-limiting) అని ఐసీఎంఆర్ వివరించింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, సరైన జాగ్రత్తలు, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా చాలామంది దీని నుండి సులభంగా కోలుకుంటారని పేర్కొంది.







కామెంట్‌లు (0)