లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉంది.
ప్రెస్ మీట్ లో ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్.
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉందని ఏలూరు రేంజ్ డిఐజి జి.వి.జి.అశోక్ కుమార్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన పెట్రో ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించడానికి విచ్చేసిన ఆయన ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ముందుగా జిల్లాలో పోలీస్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో పెట్రో ఫిల్లింగ్ స్టేషన్ మొదటిసారిగా ఆలమూరులో ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సిబ్బందికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక నియోజకవర్గంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే యాత్రికులు రావులపాలెం సెంటర్లో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి దానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రానున్న పుష్కరాలకు సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అలాగే సిబ్బందిని ఉద్దేశించి డిఐజి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వస్తున్న ఫిర్యాదులను రిసెప్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న రికార్డులో నమోదు చేసి, ఈ విషయాన్ని గురించి ఉన్నత అధికారులకు సత్వరమే తెలియజేసి న్యాయం అందేలాగా పోలీస్ ఉద్యోగ నిర్వహణ ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధిత ఫిర్యాదుల పట్ల మర్యాదపూర్వకంగా సిబ్బంది నడుచుకోవాలన్నారు. మహిళలకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే తప్ప పోలీస్ స్టేషన్కు రారని అటువంటి మహిళలకు మేమున్నామని భరోసా కల్పించాలన్నారు. ముఖ్యంగా మహిళ పోలీస్ లచే నిర్వహిస్తున్న దిశ పోలీస్ స్టేషన్ లో ఉద్యోగ నిర్వహణ చేస్తున్న సిబ్బంది బాధితులకు తప్పకుండా భరోసా కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన, దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకుని సదరు కేసులలో దర్యాప్తుని వేగవంతం చేయాలన్నారు. అలాగే ఆయా కేసులలో వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయుటకు గాను పలు సూచనలు సలహాలు, ఆదేశాలను డిఐజి అశోక్ కుమార్ సిబ్బందికి అందజేశారు. అలాగే మారుతున్న చట్టాలకు అనుగుణంగా సిబ్బంది ఉద్యోగ నిర్వహణ చేయాలని, విధి నిర్వహణలో ఎవరైనా అవకతవకులకు పాల్పడిన, అలసత్వాన్ని ప్రదర్శించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిఐజి హెచ్చరించారు.







కామెంట్‌లు (0)