- ఫైనల్లో శ్రీలంకపై ఘన విజయం
- వైభవ్ ఖాతాలో మరో రికార్డు
దంబుల్లా: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా ఎ విజేతగా నిలిచింది. ఆదివారం శ్రీలంక ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్ ఎ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) అర్ధ శతకాలు చేయగా.. విజయకాంత్ వియాస్కాంత్ (39), సహన్ అరచ్చిగే (38), నిరోషన్ డిక్వెల్లా (25) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ 3, విప్రాజ్ నిగమ్ 3, అనుకుల్ రాయ్ 2, అశోక్ శర్మ, తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆదివారం మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టులో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. బంతి అందుకోవడానికి బౌలర్లు భయపడే రీతిలో ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. వైభవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అత్యధిక సమయం బౌండరీ బయటే ఉందంటే అతిశయోక్తి కాదు. షిరాజ్ వేసిన మూడో ఓవర్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లుతో ఏకంగా 26 పరుగులు పిండాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు సాధించాడు. అయితే, సహన్ బౌలింగ్‌లో 8.5వ బంతికి వియస్కాంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శతకం చేజార్చుకున్నా శ్రీలంకను సూర్యవంశీ ఆదిలోనే బలమైన దెబ్బకొట్టాడు.









కామెంట్‌లు (0)