ఇద్దరు కార్మికులు మృతి
పరవాడ దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఘటన
అనకాపల్లి జిల్లా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం, డిప్యూటీ సిఎం
సమగ్ర విచారణ జరపాలి : మాజీ సిఎం జగన్
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం : సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి- పరవాడ (అనకాపల్లి), అమరావతి బ్యూరో : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ సమీప ఇండస్ర్టియల్ పార్కులో ఉన్న దక్షిణ ఎనర్జీ కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున సంభవించిన భారీ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఇంధన నూనె తయారు చేసే యూనిట్‌లో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగల్చడమే కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, కాలుష్య నియంత్రణ చర్యలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల కథనం మేరకు... షా వేస్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఇక్కడ దక్షిణ ఎనర్జీ కంపెనీ ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలను పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా ఇంధన నూనెగా మార్చే విభాగంలో ప్రమాదం చోటుచేసుకుంది. వేకువజామున 5.30 గంటల సమయంలో సుమారు 1,200 టన్నుల సామర్థ్యంగల బాయిలర్ ట్యాంక్‌కు అమర్చిన కప్లింగ్ బోల్టులు విరిగిపోవడంతో ఈ భారీ పేలుడు సంభవించినట్టు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి మంటలు వేగంగా వ్యాపించి పరిశ్రమలోని పలు ప్రాంతాలను ఆవరించాయి. ఈ ప్రమాదంలో అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన బొద్దపు త్రినాథరావు (24), చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్ (34) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సోమవారం ఉదయం 9 గంటల నుంచి నిరంతరా యంగా విధుల్లో ఉన్నట్లు సహచర కార్మికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ ఆవరణలో భారీ మంటలు చెలరేగాయి. దాంతో సమీప పరిశ్రమల యాజమాన్యాలు అప్రమత్తమ య్యాయి. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.33 లక్షల చొప్పున పరిహారం
మృతుల కుటుంబాలకు రూ.33 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఆ మేరకు చెక్కులను మృతుల కుటుంబాలకు అందజేసింది. కేసును పరవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఆర్డిఒ, తహశీల్దార్ పివి.రత్నం, ఫ్యాక్టరీల శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తుల శంకరరావు, ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు రొంగలి రాము తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
బాధితులను ఆదుకోవాలని సిఎం ఆదేశం
అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సిఎం ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి సమీక్ష
సహాయక చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం ముగింపు దశలో వచ్చేసిన ఆయన అనకాపల్లి జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్నిప్రమాదాలు సంభవించడానికి కారణాలపై నివేదిక కోరారు. సంబంధిత అధికారులతో ప్రతి నెలా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాధాకరం : వైఎస్ జగన్
విశాఖ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదానికి కారణాలను సమగ్రంగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
కోటి రూపాయల పరిహారం అందించాలి : వి.శ్రీనివాసరావు
దక్షిణ ఎనర్జీ పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ యాజమాన్యం, ఫ్యాక్టరీలపై తనిఖీలు జరపాల్సిన కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టరేట్ యంత్రాంగం పూర్తిగా విఫలమవడమేనని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కంపెనీల్లో తనిఖీల నిలుపుదలతో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని, లేబర్ కోడ్స్ పేరుతో కార్మికుల రక్షణ బలహీనపర్చారని తెలిపారు. ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యాలకు దాసోహం అవుతూ, కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేయడం దుర్మార్గమని వివరించారు. అభివృద్ధి పేరుతో కంపెనీలకు ఎర్రతివాచీలు పరచడం తప్ప, కార్మికుల భద్రతపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరించడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దక్షిణ ఎనర్జీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను అమలు చేయించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.









కామెంట్‌లు (0)