శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

త్రిపుర మున్సిపల్‌ ఎన్నికల్లో బిజెపిని ఓడించండి

1 గంట క్రితం

త్రిపుర మున్సిపల్‌ ఎన్నికల్లో బిజెపిని ఓడించండి
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేంద్ర చౌదరి పిలుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేంద్ర చౌదరి పిలుపు

అగర్తలా : త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి పిలుపునిచ్చారు. దోపిడీ రాజకీయాలకు, ప్రజాస్వామ్య హక్కుల అణచివేతకు, పెరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ముగింపు పలకాలంటే వామపక్ష కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. గురువారం అగర్తలాలో వామపక్ష అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు. నిరంకుశ పాలనను అడ్డుకుని, నివాసయోగ్యమైన పట్టణ వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ఈ పౌర ఎన్నికలు అవకాశమన్నారు.

2021 నుంచి అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్‌లో సాగిన ఐదేళ్ల బిజెపి ఆరాచక పాలనను ప్రజలు ముగింపు పలకాలని చౌదరి అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి భారీగా నిధులు వచ్చినా గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుంతల రోడ్లు, తాగునీటి కొరత సహా అనేక సమస్యలును బిజెపి నేతృత్వంలోని కార్పొరేషన్ పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మరోవైపు నీటి పన్ను, ఆస్తి పన్ను, ఇతర వసూళ్ల భారం ప్రజలపై పడిందని, పన్నుల భారం 300 రెట్లు పెరిగిందన్నారు. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో అగర్తలా కూడా ఉందని తెలిపారు. ప్రజలకు దూరమవుతున్న బిజెపి పార్టీ, అధికారం నిలబెట్టుకోవడానికి అణచివేత, నిరంకుశ పద్ధతులను చేపడుతుందన్నారు. వామపక్ష ప్రభుత్వ కాలంలో ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకొన్నారని, బిజెపి పాలనలో పోటీ చేసే హక్కు, ఓటు హక్కు సహా ప్రజాస్వామిక హక్కులను దెబ్బతీస్తున్నారని అన్నారు.

ఇదిలా ఉండగా, 27వ వార్డులో సిపిఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న మహిళా జర్నలిస్టును బెదిరించి వేధించారు. అగర్తలా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు బిజెపి చర్యను ఖండించారు. జర్నలిస్టులపై ఇలాంటి బెదిరింపులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్