mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జర్మనీకి ఈక్వెడార్‌, అమెరికాకు టర్కీ ఝలక్‌

1 రోజు క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 11:06 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- చివరి లీగ్‌ ‌మ్యాచుల్లో సంచలనాల విజయాలు

- నాకౌట్‌‌కు ఐవరీ కోస్ట్‌, ఆస్ట్రేలియా

న్యూయార్క్‌: ఫిఫా ప్రపంచకప్‌లో శుక్రవారం రెండు సంచనాలు నమోదయ్యాయి. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ జర్మనీకి ఈక్వెడార్‌ ఝలక్‌ ఇచ్చింది. గ్రూప్‌-ఇలో భాగంగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పటిష్ట జర్మనీపై 2-1 తేడాతో ఈక్వెడర్‌ ఓడించి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. దీంతో ఫిఫా చరిత్రలో ఆ దేశం రెండోసారి నాకౌట్‌ దశకు చేరింది. ఈ గెలుపుతో ఆ దేశ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ ముగింపుగా రిఫరీ విజిల్‌ వేయడమే ఆలస్యం.. ఆనంద బాష్పాలు రాల్చారు. కేరింతలతో హోరెత్తించారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రెండో నిమిషానికే జర్మనీ ఆటగాడు లెరోయ్‌ గోల్‌ కొట్టడంతో ఒక్కసారిగా ఈక్వెడార్‌ ఆటగాళ్లు షాక్‌‌కు గురయ్యారు. అయితే జర్మనీకి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రత్యర్థి గోల్‌ నుంచి తేరుకున్న ఈక్వెడార్‌.. తొమ్మిదో నిమిషానికి స్కోర్‌ను సమం చేసింది. ఆ జట్టు ప్లేయర్‌ నిల్సన్‌ గోల్‌ కొట్టడంతో స్టేడియం హోరెత్తింది. అనంతరం తొలి అర్ధభాగంలో మరో గోల్‌ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడ్డా ఫలితం దక్కలేదు. ఇక రెండో అర్ధభాగంలో ఈక్వెడార్‌ ఆటగాడు ప్లేటా 77వ నిమిషంలో మ్యాజిక్‌ చేశాడు. కార్నర్‌ కిక్‌ను ఉపయోగించు కుని అద్భుతంగా గోల్‌ చేయడంతో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం పలుమార్లు జర్మనీ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా ఈక్వెడార్‌ ఆటగాళ్లు దూసుకెళ్లారు. చాలావరకు బంతి తమ ఆధీనంలోనే ఉన్నప్పటికీ జర్మనీ ఆటగాళ్లు ప్రభావం చూపలేకపోయారు. ఇక ఈక్వెడార్‌ ఆటగాళ్లు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థిని అడ్డుకున్నారు. కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్‌ను గ్రూప్ ఈలోని ఈక్వెడార్ ఓటమితో ఆరంభించింది. తొలి పోరులో ఐవరీకోస్ట్ చేతిలో 0-1తో ఓడిన ఆ జట్టు.. కురకావోతో రెండో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. చావోరేవో పోరులో గురువారం జర్మనీపై ఈక్వెడార్ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో కురసావ్‌పై ఐవరీకోస్ట్‌ 2-0 తేడాతో గెలిచింది.

ఈ రెండు మ్యాచ్‌లతో గ్రూప్‌-ఇ లీగ్‌ దశ పూర్తయింది. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలో రెండు విజయాలతో జర్మనీ, ఐవరీకోస్ట్‌ నేరుగా నాకౌట్‌కు అర్హత సాధించగా.. 4 పాయింట్లు సాధించిన ఈక్వెడార్‌ మూడో జట్టుగా నాకౌట్‌ దశకు చేరుకుంది. ఫిఫా కొత్త నిబంధనల ప్రకారం.. మొత్తం 12 గ్రూప్‌ల్లోని 48 జట్లలో మొదటి రెండు స్థానాల్లో నిలిచినవి నాకౌట్‌ దశకు వెళతాయి. ప్రతి గ్రూప్‌లోని మూడో స్థానంలో ఉన్న 12 జట్లలో పాయింట్ల ఆధారంగా 8 ఉత్తమ జట్లు సైతం నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి.

గెలుపుతో ముగించిన ట‌ర్కీ

లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ట‌ర్కీ పెను సంచలనాన్ని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడి నాకౌట్‌ ‌బెర్త్‌‌కు దూరమైన టర్కీ.. ఏకంగా ఆతిథ్య అమెరికాను ఓడించి తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టర్కీ చివరి సెకన్లలో గోల్‌ చేసి 3-2తో అమెరికాపై గెలిచింది. మ్యాచ్‌ ప్రారంభ‌మైన మూడు నిమిషాల‌కే అమెరికా ప్లేయ‌ర్ ఆస్ట‌న్ ట్ర‌స్టీ గోల్ కొట్టాడు. డీప్ కార్న‌ర్ నుంచి సెబాస్టియ‌న్ అందించిన పాస్‌ను ఎడమకాలితో ట్ర‌స్టీ గోల్‌గా మ‌లిచాడు. ఇక ట‌ర్కీ ప్లేయ‌ర్ గులేర్ 10వ నిమిషంలో ఆ జ‌ట్టుకు తొలి గోల్ అందించాడు. మరో గోల్‌ బారిస్ యిల్మాజ్ చేశాడు. దీంతో ట‌ర్కీ 2-1 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగం 49వ నిమిషంలో అమెరికా ప్లేయ‌ర్ బెర్‌హాల్ట‌ర్ గోల్ చేసి ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ రేపాడు. దాదాపు ఆట ముగిసే స‌మ‌యం వ‌ర‌కు రెండు జ‌ట్లు 2-2 గోల్స్ తేడాతో స‌మంగా పోరాడాయి. కానీ 98వ నిమిషంలో ట‌ర్కీ ప్లేయ‌ర్ అంద‌ర్నీ స్ట‌న్ చేశాడు. కాన్ అయాన్ గోల్ చేయ‌డంతో కీల‌క‌మైన మూడు పాయింట్లు ట‌ర్కీ ఖాతాలోకి వెళ్లాయి. అమెరికా జట్టు మూడు లీగ్‌ ‌మ్యాచుల్లో కలిపి ఇప్పటికే 8 గోల్స్ చేసింది. గ‌తంలో 1930, 2002లో అత్య‌ధికంగా ఏడు గోల్స్ మాత్ర‌మే చేయగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్‌ ‌చేసింది. ఇదే గ్రూప్‌‌లో భాగంగా మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-పరాగ్వే జట్ల మద్య జరిగిన మరో మ్యాచ్‌ 0-0తో డ్రా అయ్యింది. దీంతో టేబుల్‌ టాపర్‌ అమెరికాతో పాటు.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, పరాగ్వే నాకౌట్‌కు చేరాయి. అయితే, చివరి మ్యాచ్‌లో అమెరికాపై సంచలన విజయం సాధించిన టర్కీ జట్టు ఈ గ్రూప్‌‌లో 3పాయింట్లతో 4వ స్థానానికే పరిమితమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్