- స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్ : ప్రకృతి వ్యవసాయ సాగుతో ప్రజలకు ఆరోగ్యం అందించడమే కాకుండా రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ తెలిపారు. గుడిపాల మండలం పుల్లూరు గ్రామంలో గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ పర్యటించి ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పిఎండిఎస్ క్షేత్రాలను పరిశీలించారు. విత్తన గుళికలతో సాగు చేసిన పొలంలో మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉండడంవంటి ప్రయోజనాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో గ్రామంలోని రైతులు సమూహాలుగా ఏర్పడి పిఎండిఎస్‌తోపాటు ఇతర అంతర పంటలను సాగు చేయడం అభినందనీయమన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఇటువంటి పంటల సాగు ద్వారా రైతులు స్థిరమైన దిగుబడులు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నందున రైతులు తమ పొలాలను బీడుగా ఉంచకుండా ఏదో ఒక పంట లేదా అంతర పంటను తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. పిఎండిఎస్‌లో సాగు చేసే నవధాన్యాలతో కూడిన పంటలను పశువులకు మేతగా అందిస్తే వాటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాల ఉత్పత్తి, రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. అనంతరం గుడిపాల మండల రైతులకు ఎన్‌ఎంఇఒ-ఒఎస్ పథకం కింద వంద శాతం రాయితీతో సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు పిఎండిఎస్ కిట్లు, సాయిల్ హెల్త్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి, చిత్తూరు సహాయ వ్యవసాయ సంచాలకులు, డిపిఎం కె శివశంకర్, డిఎఒ ఐ మురళి, ఎడిఎ (చిత్తూరు) ఉమా, గుడిపాల మండల తహసీల్దార్, ఎంపిడిఒ, మండల వ్యవసాయ అధికారి, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)