mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionFIFA : నాకౌట్‌‌కు బ్రెజిల్‌, మొరాకో

1 రోజు క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 10:46 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

ఫిఫా ప్రపంచకప్‌ - 2026లో గ్రూప్‌-ఎ, బి, సి జట్ల లీగ్‌ ‌దశ మ్యాచ్‌‌లు ముగిసాయి. మూడేసి మ్యాచ్‌‌లు ఆడిన తర్వాత గ్రూప్‌-ఎ నుంచి మెక్సికో, దక్షిణాఫ్రికా.. గ్రూప్‌-బి నుంచి స్విట్జర్లాండ్‌, కెనడా.. గ్రూప్‌-సి నుంచి బ్రెజిల్‌, మొరాకోజట్లు నేరుగా నాకౌట్‌‌కు చేరాయి. గురువారం జరిగిన చివరి గ్రూప్‌ లీగ్‌ ‌మ్యాచుల్లో ఆతిథ్య మెక్సికో జట్టు చెక్‌ ‌రిపబ్లిక్‌‌పై, దక్షిణాఫ్రికా జట్టు దక్షిణ కొరియాపై విజయం సాధించాయి. ఇక బ్రెజిల్‌, మొరాకో, స్విట్జర్లాండ్‌‌తోపాటు బోస్నియా, ఆతిథ్య కెనడా జట్లు తమ తమ గ్రూపుల్లో 2వ స్థానాల్లో నిలిచి రౌండ్‌-32కు చేరాయి.


న్యూయార్క్‌ : ఫిఫా ప్రపంచకప్‌ 2026లో మూడు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన ఆరు జట్లు నాకౌట్‌‌కు చేరాయి. మెక్సికో, చెక్‌ ‌రిపబ్లిక్‌ ‌జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌లో మెక్సికో 3-0తో చెక్‌‌ను చిత్తుచేయగా.. దక్షిణాఫ్రికా జట్టు ఆసియాఖండ జట్టైన దక్షిణ కొరియాను 1-0తో ఓడించి నాకౌట్‌‌కు చేరింది. ఇక స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3-0తో మ్యాచ్‌‌ను ముగించింది. స్కాట్లాండ్‌పై బ్రెజిల్ తొలి నుంచీ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్రెజిల్ స్టార్ ప్లేయర్ వినీషియస్ జూనియర్ తొలి అర్ధభాగంలోనే రెండు సూపర్‌ గోల్స్‌తో మెరిశాడు. మ్యాచ్‌ ప్రారంభమైన 7వ నిమిషంలోనే జట్టుకు తొలి గోల్ అందించాడు. అర్ధభాగం కొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా.. హెడర్ ద్వారా రెండో గోల్ చేసి బ్రెజిల్‌ను 2-0తో ఆధిక్యంలో నిలిపాడు. స్కాట్లాండ్‌పై విజయంతో బ్రెజిల్ జట్టు గ్రూప్-సిలో మొత్తం 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇదే గ్రూప్ నుంచి మొరాకో జట్టు కూడా నాకౌట్‌కు చేరింది. మరో గోల్‌‌ను మాథ్యూస్‌ కున్హా రెండో అర్ధభాగంలో కొట్టాడు. ఈ విజయంతో గ్రూప్‌-సి టాపర్‌గా బ్రెజిల్‌ నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఇక ఈ గ్రూపు నుంచి మొరాకో కూడా నాకౌట్‌కు చేరగా.. హైతీ ఎలిమినేట్‌ అయింది. స్కాట్లాండ్‌కు మరో అవకాశం ఉంది.

స్విట్లర్లాండ్‌ ‌చేతిలో కెనడా ఓడినా..

ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-బి చివరి లీగ్ మ్యాచ్‌లో ఉత్కంఠభరిత పోరు సాగింది. వ్యాంకోవర్ వేదికగా జరిగిన ఈ హోరాహోరీ సమరంలో స్విట్జర్లాండ్ 2-1 తేడాతో ఆతిథ్య కెనడాపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కెనడా డిఫెండర్లు, స్విస్ ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో తొలి అర్ధభాగం ముగిసే సమ యానికి ఇరు జట్లు గోల్ కొట్టలేదు. రెండో అర్ధభాగం ప్రారంభంలోనే స్విట్జర్లాండ్ వ్యూహాన్ని మార్చింది. కేవలం ఒక్క నిమిషంలోనే స్విస్ ఆటగాడు రూబెన్ వర్గాస్ అద్భుతమైన ఫీల్డ్ మూవ్‌ను గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ షాక్ నుంచి కెనడా తేరుకోకముందే, 57వ నిమిషంలో కెనడా డిఫెన్స్ చేసిన పొరపాటును అనుకూలంగా మార్చుకున్న జోహన్ మంజంబి లో-ఫినిష్‌తో బంతిని నెట్‌లోకి పంపి స్విట్జర్లాండ్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన ప్రామిస్ డేవిడ్ గోల్ కొట్టి కెనడాను తిరిగి రేసులోకి తెచ్చాడు. దీంతో స్విట్జర్లాండ్ 2-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో గ్రూప్‌-బి నుంచి స్విట్లర్లాండ్‌ 7‌పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. కెనడా 4 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి నేరుగా నాకౌట్‌‌కు చేరాయి. దీంతో కెనడా తొలిసారిగా నాకౌట్ కు అర్హత సాధించింది.

ఖతార్‌ను చిత్తు చేసిన బోస్నియా

సీయాటిల్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో బోస్నియా జట్టు ఘనవిజయం సాధించింది. నాకౌట్‌ ‌రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో అద్భుత ప్రదర్శన చేసిన బోస్నియా 3-1 తేడాతో ఖతార్‌ను ఓడించింది. గ్రూప్ స్టేజ్ దాటాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకంగా మారడంతో ఆట ఆరంభం నుంచే ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ 29వ నిమిషంలో బోస్నియాకు చెందిన 18 ఏళ్ల యువ సంచలనం కెరిమ్ అలజ్‌బెగోవిచ్ పెనాల్టీ ఏరియా వెలుపల నుంచి ఒక పవర్‌ఫుల్ కర్లింగ్ షాట్‌తో అద్భుత గోల్ కొట్టి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ విజయంతో బోస్నియా తమ నాకౌట్ (రౌండ్ ఆఫ్ 32) ఆశలను సజీవంగా ఉంచుకోగా, ఖతార్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ గ్రూప్‌ ‌నుంచి స్విట్జర్లాండ్, కెనడా టాప్‌-2లో నిలిచి రౌండ్‌-32కు చేరగా.. 4పాయింట్లతో కెనడాతో సమానంగా నిలిచిన గోల్స్‌ ‌వ్యత్యాసంతో 3వ స్థానంలో నిలిచిన బోస్నియా మరియు హెడ్జిగోవినా నాకౌట్‌ ‌రేసులో నిలిచింది. లీగ్‌ ‌దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8జట్లకు రౌండ్‌-32కు చేరే ఛాన్స్‌ ఉంది.

గెలుపుతో ముగించిన మొరాకో

అట్లాంటా వేదికగా జరిగిన గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో మొరాకో జట్టు 4-2 తేడాతో హైతీపై ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మొరాకో రౌండ్ ఆఫ్ 32 (నాకౌట్)కు అర్హత సాధించింది. మ్యాచ్ ప్రారంభమైన 10వ నిమిషంలోనే హైతీ ప్లేయర్ క్రాస్ చేసిన బంతిని అందుకునే క్రమంలో మొరాకో గోల్ కీపర్ యాస్సిన్ బౌనౌకు తగిలి అది 'ఓన్ గోల్'గా మారింది. దీనితో హైతీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంచకప్ చరిత్రలో హైతీ జట్టుకు 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లభించిన మొదటి గోల్ ఇది. 39వ నిమిషంలో మొరాకో స్టార్ ప్లేయర్ అష్రాఫ్ హకీమి గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. 43వ నిమిషంలో హైతీ ఆటగాడు విల్సన్ ఇసిడోర్ లాంగ్-రేంజ్ నుంచి ఒక అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో గోల్ చేయడంతో హైతీ తిరిగి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ తొలి అర్ధభాగం ముగిసేసరికి మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారీ గోల్ చేయడంతో 2-2తో సమమైంది. ద్వితీయార్థం 70వ నిమిషంలో మొరాకో ఆటగాడు సౌఫియాన్ రహిమి, గెస్సిమ్ యాస్సిన్‌లను సబ్‌స్టిట్యూట్స్‌గా మైదానంలోకి దించింది. 78వ నిమిషంలో లభించిన కార్నర్ కిక్‌ను సద్వినియోగం చేసుకుంటూ రహిమి గోల్ కొట్టి మొరాకోను 3-2తో ముందంజలో నిలిపాడు. ఆ తర్వాత 89వ నిమిషంలో మొరాకో కౌంటర్ అటాక్‌కు దిగింది. ఈసారి రహిమి అందించిన అద్భుతమైన పాస్‌ను గెస్సిమ్ యాస్సిన్ ఖాళీ నెట్‌లోకి పంపి 4-2తో మొరాకో విజయాన్ని ఖాయం చేశాడు.

దక్షిణాఫ్రికా సంచలనం దక్షిణ కొరియాపై గెలుపు

దక్షిణాఫ్రికా జట్టు గ్రూప్‌- ‘ఎ’నుంచి రెండోస్థానంలో నిలిచి నేరుగా నాకౌట్‌ ‌బెర్త్‌ కొట్టింది. దక్షిణ కొరియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 1-0తో విజయం సాధించింది. దీంతో తొలిసారి నాకౌట్‌ బెర్తు ఖరారు చేసుకుంది. మ్యాచ్‌ తొలి అర్ధ భాగంలో ఏ జట్టూ గోల్ చేయలేదు. రెండో అర్ధ భాగంలో దక్షిణాఫ్రికా తరఫున తాపెలో మసేకో గోల్‌ కొట్టడంతో 1-0కు చేరింది. మెక్సికోలోని మాంటెర్రీ వేదికగా కొరియా అభిమానుల మధ్య దక్షిణాఫ్రికా అనూహ్య రీతిలో విజయం సాధించింది. ఇక కొరియాకు మరో అవకాశం మిగిలి ఉంది. ప్రతీ గ్రూపులోని నాలుగు జట్ల నుంచి టాప్‌-3లో నిలిచిన 8జట్లు నాకౌట్ కు చేరతాయి.

ఫిఫా ప్రపంచకప్‌‌లో నేడు...

25(శుక్ర): టర్కీ × అమెరికా, పరాగ్వే × ఆస్ర్టేలియా (‌ఉ.7.30గం.లకు)

26(శని): నార్వే × ఫ్రాన్స్, సెనెగల్ × ఇరాక్ (‌తె.12.30గం.లకు)

కాబో వెర్డే × సౌదీ అరేబియా, ఉరుగ్వే × స్పెయిన్ (తె.5.30గం.లకు)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్