టర్కీపై పరాగ్వే, స్కాట్లాండ్ పై మొరాకో గెలుపుతో నాకౌట్ రేసులోకి...
ఫిఫా ప్రపంచకప్-2026లో రెండు జట్లు 71సెకన్లలోపే గోల్ కొట్టి రికార్డుల్లోకెక్కాయి. పరాగ్వే జట్టు 64సెకన్లకు, మొరాకోజట్టు 71 సెకన్లలోపే గోల్ కొట్టాయి. టర్కీ జట్టుపై పరాగ్వే ఆటగాడు మాటియాస్ గాలార్జా మ్యాచ్ ప్రారంభమైన 64 సెకన్లకే 25 మీటర్ల దూరం నుంచి పవర్‌ఫుల్ డ్రైవ్ షాట్ కొట్టి గోల్ కొట్టాడు. ఇది ఫిఫా 2026లో వేగవంతమైన గోల్ గా నమోదైంది. ఇక మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి.. బ్రాహిమ్ డియాజ్ అందించిన పాస్‌ను స్కాట్లాండ్ డిఫెండర్ల కళ్లుగప్పి బంతిని ఎడమవైపు కార్నర్ నుంచి గోల్‌పోస్ట్ లోకి పంపాడు. ఈ రెండు గోల్స్ 2026 ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన గోల్స్‌గా నమోదయ్యాయి.
శాన్‌ఫ్రాన్సిస్కో: శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో శనివారం జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో పరాగ్వే జట్టు 1-0తో టర్కీని ఓడించింది. ఈ గోల్ మ్యాచ్ ప్రారంభమైన 64 సెకన్లలోనే పరాగ్వే నమోదు చేసింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రికార్డయ్యిన ఫాస్టెస్ట్ గోల్‌గా ఇది నిలిచింది. తొలి నిమిషాల్లోనే వచ్చిన గోల్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. రెండో అర్ధభాగంలో టర్కీ ఎటాక్‌కు దిగింది. అయితే, 32 షాట్స్, 12 కార్నర్లు, దాదాపు 80 శాతం బాల్ పొజెషన్ ఉన్నప్పటికీ ఒక్క గోల్ వేయలేకపోయింది. టర్కీకి వచ్చిన అవకాశాలన్నీ చేజారడంతో ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. తొలి మ్యాచ్‌లో టర్కీజట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. చివరి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచినా నాకౌట్‌కు చేరడం కష్టమే. మరోవైపు అమెరికాపై తొలి మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిన పరాగ్వేకు ఈ విజయం కీలకంగా మారింది. మూడు పాయింట్ల తో ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచిన పరాగ్వే.. చివరి మ్యాచ్‌లో ఆస్ర్టేలియాను ఓడించాల్సి ఉంది. దీంతో చివరి గ్రూప్ మ్యాచ్‌లో పరాగ్వే–ఆస్ట్రేలియా మధ్య పోరు కీలకంగా మారింది. ఆ జట్టు రౌండ్ టాప్-32లోకి వెళ్లాలంటే గెలుపు తప్పనిసరి. ఇక పరాగ్వే ఆటగాడు మిగెల్ అల్మిరోన్ మౌత్ టాక్ కారణంగా రెడ్‌కార్డు గురయ్యాడు. దీంతో పరాగ్వే పది మంది ఆటగాళ్ల మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
మౌత్ కవర్ రూల్ తో...
మ్యాచ్ తొలి అర్ధభాగం స్టాపేజ్ టైమ్‌లో పరాగ్వేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మిగెల్ అల్మిరోన్ టర్కీ డిఫెండర్ మెరిహ్ డెమిరల్‌తో జరిగిన ఘర్షణకు దిగడంతో పాటు తొలిసారిగా రెడ్‌కార్డ్‌ను పొందాడు. ఫిఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘మౌత్ కవర్ రూల్’ కింద తొలి రెడ్ కార్డు ఇదే కావడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. మ్యాచ్‌లో ఫౌల్ అనంతరం తుర్కియో డిఫెండర్ మెర్ట్ ముల్దర్‌తో పరాగ్వే ఫార్వర్డ్ ఆటగాడు ఇసిడ్కో పిట్టా వాగ్వాదానికి దిగాడు.
ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే ఇరుజట్ల ఆటగాళ్లు గుంపుగా వచ్చేశారు. ఈ సమయంలో జట్టుకు కాస్త దూరంలో ఉన్న అల్మిరాన్ ముల్దర్‌తో మాట్లాడుతూ నోటికి చేతిని అడ్డుపెట్టాడు. అల్మిరాన్ చర్య పట్ల తుర్కియే డిఫెండర్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. వీఏఆర్ (వీడియో అసిస్టెంట్ రిఫరీ) ద్వారా మ్యాచ్ అధికారులు వీడియోను పలుమార్లు పరిశీలించారు. రిప్లేలో అల్మిరాన్ తన నోరును మూసుకున్నట్లు తేలడంతో రిఫరీ బార్డన్ వెంటనే అతడికి రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో పరాగ్వే జట్టు 10 మందితోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
మొరాకో జోరు
గ్రూప్-సిలో మొరాకో జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సి లో భాగంగా శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో మొరాకో 1-0తో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన మొరాకో.. ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. బ్రెజిల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న ఆ జట్టు.. ఈ విజయంతో నాకౌట్ దశకు అడుగు దూరంలో నిలిచింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మొరాకో సంచలన గోల్ నమోదు చేసింది. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్ జట్టు బలమైన బ్రెజిల్‌తో, మొరాకోతోమొరాకో తలపడనున్నాయి.









కామెంట్‌లు (0)