నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ జాతులు, భాషలు, సరిహద్దులను దాటి ప్రపంచ ప్రజలను ఒక్కచోట చేర్చే క్రీడా సంబరంగా గుర్తింపు పొందింది. అయితే అదే ప్రపంచకప్ తరచూ దుర్మార్గ రాజకీయాలకు వేదికగా మారుతోందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇటాలియన్ రాజకీయ కళాకారిణి లైకా దీనిని "డెత్‌కప్", "క్రైమ్‌కప్"గా అభివర్ణించింది. ఈ పేర్లతో రూపొందించిన పోస్టర్లను జూన్ 11న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న ఫిఫా ప్రధాన కార్యాలయం గోడలపై అతికించి ఆమె నిరసన వ్యక్తం చేసింది.
లైకా ఒక రాజకీయ కళాకారిణి, ఉద్యమకారిణి. ఆమె అసలు పేరు బహిరంగంగా తెలియదు. ప్రపంచానికి తెలిసింది మాత్రం "Laika1954" అనే పేరు మాత్రమే! 1957లో సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి అయిన కుక్క "లైకా" పేరునే ఆమె తన కలంపేరుగా స్వీకరించింది. అదే పేరుతో వెబ్‌సైట్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిర్వహిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా, శరణార్థులపై దాడులు జరిగినా, వలసదారులు వివక్షకు గురైనా, కార్మికుల హక్కులు ఉల్లంఘించినా ఆమె తన కళ ద్వారా స్పందిస్తుంది. రాజకీయ సందేశాలతో కూడిన భారీ పోస్టర్లను రూపొందించి, వాటిని ప్రభుత్వ భవనాలు, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు, వీధులు, ప్రజలు ఎక్కువగా చూసే ప్రదేశాల్లో ప్రదర్శిస్తుంది.

రెండు పోస్టర్లతో పదునైన సందేశం!
ఫిఫా ప్రధాన కార్యాలయం ఎదుట లైకా ప్రదర్శించిన రెండు పోస్టర్లు అమెరికా యుద్ధోన్మాదాన్ని, జాత్యహంకారాన్ని తీవ్రంగా నిరసించే సందేశాన్నిచ్చాయి. మొదటి పోస్టర్ "డెత్‌కప్". ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని నవ్వుతూ కనిపిస్తారు. ఆ ట్రోఫీ మానవ కపాలం రూపంలో ఉంటుంది. ట్రంప్ వలస విధానాలు, గాజా యుద్ధంపై అమెరికా వైఖరి, వాటిని పట్టించుకోకుండా ప్రపంచకప్ నిర్వహణను ముందుకు తీసుకెళ్తున్న ఫిఫా తీరుపై ఈ పోస్టర్ తీవ్ర విమర్శగా నిలిచింది. రెండో పోస్టర్ "ఫిఫా క్రైమ్‌కప్ 2026". ఇందులో మెక్సికో జాతీయ జట్టు జెర్సీ ధరించిన ఒక ఫుట్‌బాల్ అభిమాని చేతులు పైకెత్తి నిలబడి ఉంటాడు. అతన్ని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేస్తున్న దృశ్యాన్ని చిత్రించారు. ప్రపంచ ఐక్యత పేరిట ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నామని చెబుతూనే, మరోవైపు వలసదారులపై అనుమానం, నిర్బంధాలు, బహిష్కరణలు కొనసాగించడాన్ని ఈ చిత్రం ప్రశ్నిస్తోంది.
ఫిఫా కార్యాలయం గోడలపై పోస్టర్లు అతికించిన తర్వాత లైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇది ట్రంప్ ప్రపంచకప్. వేలాది మందిని చంపిన బాంబుల ప్రపంచకప్. జాతి వివక్ష ప్రపంచకప్. గాజాలో మారణహోమానికి మౌన సహకారం అందిస్తున్న ప్రపంచకప్. లెబనాన్, ఇరాన్‌లపై దాడుల ప్రపంచకప్. వెనిజులాపై కుట్రల ప్రపంచకప్. క్యూబాపై బెదిరింపుల ప్రపంచకప్" అని పేర్కొంది. ఫుట్‌బాల్ అభిమానులు గోల్స్‌ను మాత్రమే కాకుండా, ఆ గోల్స్ వెనుక దాగి ఉన్న రాజకీయాలను కూడా గమనించాలని ఆమె తన కళ ద్వారా పిలుపునిస్తోంది.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్








కామెంట్‌లు (0)