బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అనాహత్‌ సింగ్‌పై అభినందనల వెల్లువ

2 రోజుల క్రితం

common
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ 2026 టైటిల్‌ను సొంతం చేసుకుని, ఈ ఘనత తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన అనాహత్‌ సింగ్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న అనాహత్‌ శనివారం జరిగిన ఫైనల్లో విజేతగా నిలిచింది. అనాహత్‌ 11-3, 11-7, 11-9తో రుకాయ సాలెమ్‌ (ఈజిప్ట్‌)ను ఓడించింది. ఈ టోర్నీలో పతకం సాధించడం 18 ఏళ్ల అనాహత్‌కు ఇది వరుసగా రెండోసారి. నిరుడు కాంస్యం నెగ్గిన ఆమె ఈసారి ఏకంగా స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ ఘనత సాధించిన భారత తొలి అమ్మాయి అనాహతే. 2005లో జోష్న చినప్ప రజతం గెలవడమే అంతకుముందు అత్యుత్తమ ప్రదర్శన. ‘‘ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌లో అయిదోసారి బరిలో దిగా. ఎట్టకేలకు స్వర్ణం సాధించినందుకు సంతోషంగా ఉంది’’ అని మ్యాచ్‌ అనంతరం అనాహత్‌ చెప్పింది.18 ఏళ్ల ఈ యువ క్రీడాకారిణి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ తరఫున పాల్గొన్న అత్యంత పిన్నవయస్కురాలిగా (14 ఏళ్లు) రికార్డు సృష్టించింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో రెండు కాంస్య పతకాలు (మహిళ టీమ్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌) గెలుచుకుంది. సీనియర్‌ జాతీయ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో 2023 నుంచి వరుసగా మూడేళ్లపాటు విజేతగా నిలిచింది. అనాహత్‌ సింగ్‌ 2008 మార్చి 13న ఢిల్లీలో జన్మించింది. ఒలింపిక్‌ విజేత పి.వి. సింధు ఆమెకు స్ఫూర్తి. తొలుత బ్యాడ్మింటన్ ఆడిన అనాహత్‌.. తన సోదరి అమీరాను చూసి స్క్వాష్‌వైపు ఆకర్షితురాలైంది. 10 ఏళ్ల వయసులోనే దీనిని ప్రొఫెషనల్‌ గేమ్‌గా ఎంచుకుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో తొలిసారిగా స్క్వాష్‌ను చేర్చారు. అందులో ఆడి భారత్‌కు బంగారు పతకం తీసుకురావడమే తన లక్ష్యమని అనాహత్‌ చెబుతోంది.

భారత యువ సంచలనం అనాహత్‌ సింగ్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమన్నారు. ఈ ఘనత భారత స్క్వాష్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్