నాగోయా : ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో భారత పతాకాన్ని మను భాకర్, తజీందర్‌పాల్ సింగ్ తూర్ మోయనున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ, రెండు ఆసియా క్రీడల్లో వరుసగా షాట్‌పుట్ స్వర్ణాలు గెలిచిన తూర్‌కు ఈ గౌరవం దక్కింది. వీరి ఎంపికను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. భారత్ తరఫున ఫ్లాగ్‌బేరర్లలో ఒకరిగా మను భాకర్ వ్యవహరిస్తారని ఇండియన్ చెఫ్-డి-మిషన్ హర్‌దేవ్ యాదవ్ వెల్లడించగా, రెండో పతాకధారిగా తేజేందర్‌పాల్ ఉంటారని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించి స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిన ఘనత మను భాకర్‌ది కాగా, గత రెండు ఆసియా క్రీడల్లోనూ షాట్‌పుట్‌లో తేజేందర్‌పాల్ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.
రేపే వేడుకలు ప్రారంభం :
20వ ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి నాగోయా వేదికగా శనివారం ప్రారంభం కానున్నాయి. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు అధికారిక ప్రారంభోత్సవం జరగనుంది. సుమారు రెండు గంటల పాటు సాగే ఈ వేడుకను జపనీస్ ప్రముఖ దర్శకుడు యుకిహికో సుత్సుమి రూపకల్పన చేశారు. ఈ క్రీడా సంబరంలో 45 దేశాల నుంచి దాదాపు 11,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
మొత్తం 43 క్రీడాంశాల్లో 469 పతక ఈవెంట్లు నిర్వహించనుండగా.. బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, టెక్ బాల్ వంటి పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. టెక్ బాల్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, పాడిల్ సర్ఫింగ్, వర్చువల్ తైక్వాండోలు ఈసారి కొత్తగా చేరాయి. కాగా, విలువిద్య, హాకీ, సెయిలింగ్, స్క్వాష్, టెన్నిస్, ట్రయాథ్లాన్ అంశాల విజేతలు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు.
ఈసారి షూటింగ్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, క్రికెట్‌లలో భారత్ భారీ ఆశలు పెట్టుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ చైనా అత్యధిక మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది.







కామెంట్‌లు (0)