శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

షూటింగ్‌లో తొలి స్వర్ణ పతకం

2 గంటల క్రితం

man
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 11:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

50మీ. రైఫిల్‌-3 రజతం

టిటి, షాట్‌పుట్‌, 10వేల మీ. పరుగు, పోల్‌వాల్ట్‌లో కాంస్య పతకాలు

ఐచి-నగోయా(జపాన్‌): 20వ ఆసియా క్రీడ‌ల్లో భార‌త షూట‌ర్లు అదరగొడుతున్నారు. శుక్రవారం జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సురుచి, క‌మ‌ల్‌జీత్, 50మీ. రైఫిల్‌-3 టీం విభాగంలో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ థోమర్‌, నీరజ్‌ కుమార్‌, రుద్రాంక్ష‍ పాటిల్‌ రజత పతకాన్ని సాధించారు. అలాగే టేబుల్‌ టెన్నిస్‌(టిటి) మిక్స్‌డ్‌లో మనుషా షా, దియా చిటాలే, మహిళా షాట్‌పుటర్‌ మన్‌ప్రీత్ కాంస్య పతకాలను అందించారు. శుక్రవారం జరిగిన 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో ఈ జోడి 484.6 పాయింట్ల‌తో ప్రథమస్థానంలో నిలిచి దక్ష‍ిణాఫ్రికాపై 6.6పాయింట్ల ఆధిక్యతతో బంగారు పతకాన్ని ముద్దాడింది. ఈ విభాగంలో ద‌క్షిణ కొరియా (478.0 పాయింట్లు), ఇరాన్ (415.8 పాయింట్లు) రెండు, మూడో స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాయి. ఈ ఆసియా క్రీడల్లో షూటింగ్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం.

టేబుల్‌ టెన్నిస్‌(టిటి)లో కాంస్యం...

టేబుల్ టెన్నిస్‌ వ్యక్తిగతంలో విఫలమైన భారత బృందం.. మిక్స్‌డ్ విభాగంలో చెలరేగింది. మనుషా షా, దియా చిటాలే బృందం సెమీస్‌లో ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్‌ టీం విభాగంలో భారత జంట 5-11, 8-11, 8-11తో చైనా జంట వాంగ్ చుకిన్ – సున్ ఇంక్షా చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో సెమీస్‌లో ఓడిన భారత జంట మనుషా షా, దియా చిటాలేలకు కాంస్య పతకం లభించనుంది.

షాట్‌పుట్‌లో కాంస్యం...

భారత షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇనుప గుండును 17.17మీ. దూరం విసిరిన మన్‌ప్రీత్.. మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఆసియాడ్‌ మహిళల షాట్‌పుట్‌లో పతకం సాధించిన మూడో అథ్లెట్‌గా మన్‌ప్రీత్‌ నిలిచింది. ఇంతకుముందు బర్బరా వెబ్‌స్టర్(1951లో), కిరణ్‌ బలియన్(2023లో) షాట్‌పుట్‌ విభాగాల్లో కాంస్య పతకాలతో మెరిశారు. ఇక చైనాకు చెందిన సంగ్‌ జియాన్‌(19.04మీ.), జంగ్‌ లిన్‌రూ(18.14మీ.) స్వర్ణ; రజత పతకాలను సాధించారు. ఇక భారత్‌కే చెందిన కృష్ణ జయశంకర్‌ మీనన్‌ (16.57మీ.) 5వ స్థానానికే పరిమితమైంది. ఇక అథ్లెటిక్స్‌లో పతకం సాధిస్తాడనుకున్న గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్‌లు 100మీ. పరుగులో తేలిపోయారు.

పురుషుల 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ రజతంతో మెరిసిన కాసేపటికే బరానికా ఎలంగోవన్ చరిత్రాత్మక పతకం సాధించింది. ఎన్నడూ ఆసియాడ్‌లో పతకం గెలవని పోల్‌ వాల్ట్‌లో అద్భుతం చేసిన తను కాంస్యంతో మెరిసింది. శుక్రవారం జరిగిన పోల్‌వాల్ట్‌ ఫైనల్లో బరానిక 4.15 మీటర్ల ఎత్తు దూకింది. దాంతో.. మూడో స్థానం ఖాయమవ్వగా.. ఈ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి పతకం వచ్చింది.

సాత్విక్- చిరాగ్‌కు నిరాశ..

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పతక ఫేవరెట్‌ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిల జోడీ తొలిరౌండ్‌ థాయ్‌లాండ్ జంట చేతిలో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలయ్యారు. మొదటి సెట్‌ను 21-12తో గెలుపొందిన సాత్విక్ – చిరాగ్ జంట ఆ తర్వాత రెండు సెట్లను 19-21, 14-21తో ఓడారు. ఉత్కంఠభరితంగా సాగిన తొలిరౌండ్‌ పోటీలో థాయ్ షట్లర్లు పీరట్చాయ్ సుఖ్‌ఫున్ – పక్కాపొన్ తీరరాత్సకుల్‌(థాయ్‌లాండ్) ద్వయం దూకుడు ముందు భారత జోడీ నిలవలేకపోయారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో పతకంతో మెరిసిన బాక్సర్ ప్రీతి పవార్ రౌండ్‌-16లోనే నిష్క్రమించింది.

కబడ్డీ ఫైనల్‌కు భారతజట్టు...

కబడ్డీ పురుషుల, మహిళల విబాగాల్లో భారతజట్లు ఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇరుజట్లు శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సునాయాస విజయాలను నమోదు చేసుకున్నాయి. సెమీస్‌ పురుషుల విభాగంలో భారతజట్టు 66-28పాయింట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుచేయగా.. మహిళల విభాగంలో భారతజట్టు 48-24పాయింట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి బంగారు పతకానికి అడుగు దూరంలో నిలిచాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్