శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలపై స్వ‌తంత్ర ద‌ర్యాప్తు

1 గంట క్రితం

cec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 01:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- సుప్రీం రిటైర్డ్‌ జ‌డ్జి నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ లేదా సిట్

- జ్ఞానేశ్ కుమార్, మనీష్ గార్గ్, సీమా ఖన్నాను ప్రాసిక్యూట్ చేయాలి

- సుప్రీంకోర్టులో పిటిషన్

ప్ర‌జాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలపై స్వ‌తంత్ర ద‌ర్యాప్తు చేయాల‌ని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సిఇసి జ్ఞానేష్ కుమార్‌ ఏకపక్ష‍ంగా తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకోవాలని పిటిష‌నర్‌ కోరారు. విధి నిర్వహణలో వైఫల్యం, నిర్లక్ష్యానికిగాను 1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 32 కింద సిఇసి జ్ఞానేశ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ (ఐటి) సీమా ఖన్నాను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 32 ప్ర‌కారం న్యాయ‌వాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో సిఇసి జ్ఞానేష్ కుమార్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా లేదా మెజారిటీ అభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, ఆదేశాలు, సాఫ్ట్‌వేర్‌ మార్పులను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ 2023 చట్టంలోని సెక్షన్‌ 18లో ఉన్న నిబంధనలను పిటిషన్‌ ప్రస్తావించారు.

ఫారం-6లో మార్పులపై అభ్యంతరాలు

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మార్పులు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టబద్ధంగా నిర్దేశించిన ఫారం-6ను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టును కోరారు. కీలక నిర్ణయాలను సిఇసి ఏకపక్షంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బిర్ సింగ్ సంధూ, వివేక్ జోషిని సంప్రదించకుండా సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌ నిర్ణయాలు తీసుకున్నారని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

13 కోట్ల ఓటర్ల తొలగింపుపై స్వతంత్ర దర్యాప్తు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల పేర్లు ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి తొలగించడంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి, ఇసిఐనెట్‌, ఈఆర్ఒనెట్‌ వ్యవస్థలను ఫోరెన్సిక్‌గా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

14 సందర్భాల్లో అభ్యంతరాల ప్రస్తావన

ఎస్‌ఐఆర్‌, ఓటర్ల జాబితాల నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పది నెలల వ్యవధిలో కనీసం 14 సందర్భాల్లో లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇటీవల వెలువడిన మీడియా నివేదికలను పిటిషనర్‌ ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్