- పట్టణ పేదలకూ ఉపాధి హామీ అమలు చేయాలి
- అక్టోబర్ 2న దేశవ్యాప్త ఆందోళనలు
- వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల జాతీయ వేదిక పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోని గ్రామీణ ప్రాంతాలను కరువు విలయతాండవం చేస్తోందని, గ్రామీణ కూలీలు వ్యవసాయ పనులు లేక, ఉపాధి లేక పస్తులతో అల్లాడుతున్నారని వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల జాతీయ వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. కరువు, వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న గ్రామీణ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది. శుక్రవారం నాడిక్కడ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల జాతీయ వేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బి. వెంకట్, విక్రమ్ సింగ్, వి. శివదాసన్, సాహిల్ (ఎఐఎడబ్ల్యుయు), గోరియా, నిర్మల్ (బికెఎంయు), దేవేంద్ర ఝా (ఎఐఎఆర్ఎల్ఎ), ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల నుంచి ఇకలోహ సింగ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కోసం అదనంగా రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించి, దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి పనులు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు, నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు బి.వెంకట్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామీణ పేదలకు తక్షణ ఉపాధి కల్పించాల్సి ఉందని, మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదల ఆకలి కేకలను పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటంలో మునిగిపోయిందని విమర్శించారు. గ్రామీణ పేదలకు చట్టబద్ధమైన ఉపాధి హక్కును కల్పించిన ఉపాధి హామీ-2005ను రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చి పనిదినాలను కుదించడం దుర్మార్గమని అన్నారు. ఏడాదికి కనీసం 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, కరువు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయ పనులు తీవ్రంగా తగ్గిపోయిన ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు వెంటనే అదనపు ఉపాధి కల్పించాలని కోరారు.






కామెంట్‌లు (0)