- ప్రసంగాన్ని బహిష్కరించిన ఐరాస రాయబారులు
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించేందుకు నెతన్యాహూ సిద్ధపడుతున్న సమయంలో వివిధ దేశాలకు చెందిన రాయబారులు సభ నుంచి వాకౌట్ చేశారు. వారంతా ఆయనను ఎగతాళి, హేళన చేస్తుండగా అనుకూల బృందం నిలబడి కరతాళధ్వనులు చేసింది. సభలో క్రమశిక్షణ పాటించాలంటూ స్పీకర్ గట్టిగా అరిచారు. వామపక్షవాది అయిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను యూదు వ్యతిరేకి అని అన్నారు.
మిత్రుల పైనా విమర్శలు
ఇజ్రాయిల్ భాగస్వాములైన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సైతం నెతన్యాహూపై విమర్శలకు పదును పెట్టడం విశేషం. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని తమ సెటిల్మెంట్లకు (స్థావరాలు) వ్యతిరేకంగా ఫ్రాన్స్, బ్రిటన్ చేసిన ప్రకటనలపై ఆయన స్పందిస్తూ 'వారు ఈ చిన్న ఇజ్రాయిల్‌పై వలసవాద ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆ వలసవాద పదాన్ని సృష్టించింది వారే' అని అన్నారు. హమాస్‌కు మద్దతు ఇస్తున్న టర్కీపై విమర్శలు చేస్తూ ఆ దేశ నాయకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను నిరంకుశుడిగా అభివర్ణించారు. ఇరాన్ ఓ హంతక నియంతృత్వ దేశమని ఆరోపిస్తూ ఇజ్రాయిల్, అమెరికా దేశాలు జరిపిన యుద్ధం అణ్వాయుధాలను తయారు చేయకుండా టెహ్రాన్‌ను నిలువరించిందని చెప్పుకొచ్చారు.
నెతన్యాహూ...నరకానికి పో !
నిరసనలతో అట్టుడికిన న్యూయార్క్
ఆందోళనకారులపై పోలీసుల దాష్టీకం ... నటీనటులు, నేతల అరెస్ట్
న్యూయార్క్ : ఐరాస సమావేశాల సందర్భంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు నిరసనల సెగ తగిలింది. సమావేశాలు జరుగుతున్న ప్రాంగణం సమీపంలో వేలాది మంది నిరసనకారులు గుమిగూడి నెతన్యాహూపై విమర్శలు సంధించారు. వారిలో కొందరు 'మారణహోమాన్ని ఆపండి' అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. 'ప్రజలకు బాంబులు కాదు...నిధులు ఇవ్వండి', 'యుద్ధం వద్దు', పాలస్తీనాకు స్వేచ్ఛ' అని రాసి ఉన్న తెల్లని టీ-షర్టులు ధరించారు. నెతన్యాహూకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న హాలీవుడ్ నటి, ఆస్కార్ పురస్కార గ్రహీత సుసాన్ సరండన్, ఎమ్మీ అవార్డు విజేత హన్నా ఐన్‌బైండర్, డెమొక్రటిక్ కాంగ్రెస్ అభ్యర్థి డారియాలిజా అవిలా షెవాలియన్, న్యూయార్క్ నగర కౌన్సిల్ సభ్యుడు ఒస్సే సహా పలువురు నటీనటులు, రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'గాజాలో జరుగుతున్నది ఏమిటి? మన పేరు మీద, మన డబ్బుతో ఓ సమాజం మొత్తాన్నీ నాశనం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పడం మన బాధ్యత. తన అకృత్యాలను సమర్ధించుకోవడానికి ఐరాస వేదికను ఉపయోగించుకునే హక్కు నెతన్యాహూకు లేదు' అని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ మొరాడియాన్ అన్నారు. పాలస్తీనాకు మద్దతు ఇచ్చే యూదు కార్యకర్తల బృందం 'జ్యూయిష్ వాయిస్ ఫర్ పీస్' ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. నిరసనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. చాలా మంది ఆందోళనకారులు ఫుట్‌పాత్‌ల పైనే కూర్చొని నెతన్యాహూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఒక్కొక్కరిగా నిరసనకారులను గుంపు నుంచి బయటికి లాగి వారి చేతులను వెనక్కి కట్టేసి బస్సుల వద్దకు తీసుకొనిపోయారు. ఆందోళనకారులు ఏ మాత్రం వెరవకుండా 'నెతన్యాహూ...నరకానికి పో' అంటూ నినాదాలు చేశారు. ట్రంప్ ప్రభుత్వం వీసా నిరాకరించడంతో నెతన్యాహూ విమర్శకులలో ఒకరైన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. నెతన్యాహూ ప్రసంగానికి ముందు ప్రదర్శించిన ఓ వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ 'మేము ఈ చట్టవిరుద్ధమైన చర్యలను తిరస్కరిస్తున్నాము. వాటికి ఆధారమైన ఆరోపణలను, సమర్ధనలను కూడా తిరస్కరిస్తున్నాం' అని అన్నారు.
మౌనమే సమాధానం
ఐరాస సమావేశాలలో ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్ ఇరాన్‌కు ఓ సందేశాన్ని అందించారు. ఆయన ఇరాన్ దౌత్యవేత్త నాసర్ అసదీ వద్దకు వెళ్లి స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ రిసీవర్‌ను ఇచ్చారు. 'ఇరాన్‌లో పాలన మారాలని మేము కోరుకుంటున్నాము' అని అన్నారు. దీనికి అసదీ నుంచి మౌనమే సమాధానమైంది. ఆయన డానన్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయారు. తాను ఇచ్చిన సమాధానం స్వేచ్ఛను పొందడంలో ఇరాన్ ప్రజలకు ఉపయోగపడుతుందని డానన్ ఆ తర్వాత సోషల్ మీడియాలో తెలియజేశారు.
.........







కామెంట్‌లు (0)