- వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు..
- వేల ఎకరాల్లో పంట నష్టం
- అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలు
- స్తంభించిన రాకపోకలు
ప్రజాశక్తి- యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీటి మునిగాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపరిహారం అంచనాలో అధికారులు ఉన్నారు. తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటిన తర్వాత కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం జిల్లాలో 18,147 ఎకరాల్లో వరి, 1,149 ఎకరాల్లో మొక్కజొన్న, 231 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు 7,813 ఎకరాల్లో మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వంశధార, నాగావళి, వంశధార నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నాగావళి వరద ఉధృతితో బూర్జ మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని నాగావళి నది ఒడ్డుకు మేత కోసం గొర్రెలను తీసుకెళ్లి వరద నీటిలో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపారులను అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు. విజయనగరం జిల్లాల్లో 1,833 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రెండు ఇళ్లు పూర్తిగా, 16 ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 124 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఒక పశువు మృతి చెందింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 6,900 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 3,800 ఎకరాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,607 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
అల్లూరి జిల్లాలో కొనసాగిన వర్షాలు
ఒడిశా రాష్ట్రానికి ఆనుకొని ఉన్న అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట మండలాల్లో శుక్రవారం కూడా భారీగా కురిసింది. ముంచంగిపుట్టు మండలం అరబీరు గ్రామంలో ఓ ఇల్లు నేలమట్టమైంది. బూసిపుట్టు గ్రామానికి చెందిన రావెల సూరిబాబు ఇంటి పైకప్పు దెబ్బతింది. పెదబయలు మండలంలో ఆంధ్ర-ఒడిశాకు ఆనుకుని ఉన్న మత్స్యగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. కిముడుపల్లి, గోమంగి ప్రాంతాల్లోని వంతెనల పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల రోడ్లు, పంట పొలాల గట్లు, అరకులోయ మండలం గిర్లిగూడు వద్ద కల్వర్టు, జి.మాడుగుల మండలం మత్స్యపురం_వద్ద వంతెన కొట్టుకుపోయాయి. జికె.వీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్‌లో దార్లగుంది సమీప మలుపు వద్ద రహదారిపై కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. సీలేరు కాంప్లెక్స్ పరిధి జలాశయాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయాల నుంచి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీని వరద ముంచెత్తింది. శబరి నదికి భారీగా వరద నీరు రావడంతో నీటి 42 అడుగులకు చేరింది.
కుయుగురు, సోకిలేరు, చంద్రవంక వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు రహదారులు జలమయమయ్యాయి. చింతూరు నుంచి ఒడిశా రాష్ట్రానికి, విఆర్.పురం మండలానికి రాకపోకలు స్తంభించాయి. శబరి ఒడ్డున ఉన్న సంతపాకల వీధి నీటమునిగింది. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం నీట మునిగాయి. పాలకొండ మండలంలోని అంపైప్ లైన్ కల్వర్టు కోతకు గురవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంపిలి, అన్నవరం, గోపాలపురం, ఎరకరాయపురం, కొండాపురం గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. అన్నవరం గ్రామానికి వెళ్లే రహదారులపై నాలుగు అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. అన్నవరం గ్రామం చుట్టూ వరద నీరు చేరి జలదిగ్బంధం కావడంతో, ఓ ఇంట్లో ఉన్న తొమ్మిది నెలల గర్భిణి భూమికను ముందు జాగ్రత్త చర్యగా లైఫ్ జాకెట్టు తొడిగి బోటుపై వరద నీటిని దాటించి అనంతరం ఆస్పత్రికి తరలించారు. కొమరాడ మండలం కోటిపాం గ్రామ సమీపంలో జంఝావతి నది ఉగ్రరూపం దాల్చడంతో కోటిపాము గ్రామానికి వెళ్లే దారులన్నీ జలమయమయ్యాయి. నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో కల్లికోట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. నది ఆవల వైపు ఉన్న మాదలింగి గ్రామంలో గుమ్మడి గడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ఎనిమిది గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించాయి. రెండు నదుల సంగమంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన గుంప సోమేశ్వరస్వామి ఆలయం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలకు కొమిరి గ్రామం వద్ద ఉన్న కాజ్‌వే కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో కొమిరి గ్రామంలో వరద నీరు చేరింది. వ్యవసాయ పొలంలో ఉన్న మోటార్లను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి మధ్యలో చిక్కుకుపోయిన రైతులను రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ, తన సిబ్బంది వచ్చి వారిని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తోటపల్లి నిర్వాసిత గ్రామమైన బాసంగిలో 19 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి రెండు గంటలకు వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, వాగులు పొంగి ప్రవహించాయి. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద వాగు పొంగి దాదాపు పది గ్రామాలకు, పెదమద్దూరు వద్ద ఉన్న వంతెనకు గండిపడడంతో బౌద్దారామం అమరావతి-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డెల్టాలోని దుగ్గిరాలలో 105.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దుర్గగుడి ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు
ఎడతెరిపిలేని భారీ వర్షాలకు విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డుపై గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. రానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఘాట్ రోడ్డు మరమ్మతు పనుల కోసం గత మూడు రోజులుగా మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహం
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది. భద్రాచలంలో గురువారం 18 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం నాటికి 20.2 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుండి 4,88,550 క్యూసెక్కుల జలాలు విడుదలను దిగువకు చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజికి పెరిగిన వరదపోటు
ప్రకాశం బ్యారేజికి శుక్రవారం రాత్రి వరద ప్రవాహం మరింత పెరిగింది. ఖమ్మం జిల్లా వైరా, కట్టలేరు, మున్నేరు, పాములేరు, ఎన్‌టిఆర్ జిల్లా బుడమేరు నుంచి వస్తున్న ప్రవాహంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం దాటడంతో 47,125 క్యూసెక్కులను సముద్రంలోకి, 5,026 క్యూసెక్కులను తూర్పు డెల్టాకు, 2519 క్యూసెక్కులను పశ్చిమ డెల్టాకు, 259 క్యూసెక్కులను తూర్పు డెల్టాకు విడుదల చేస్తున్నారు.
బిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే బాలింత మృతి
అల్లూరి జిల్లా జికె వీధి మండలం ధారకొండ పంచాయతీ గంగవరంలో బిడ్డను ప్రసవించిన కాసేపటికే బాలింత లావణ్య (28) మృతి చెందారు. నిండు గర్భిణి అయిన ఆమెకు పురుటి నొప్పులు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గంగవరం వాగును దాటించి ధారకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం సిద్ధమయ్యారు. ఇంతలోనే ఇంటి వద్ద లావణ్య మగ శిశువుని జన్మనిచ్చింది. అనంతరం కోమాలోకి వెళ్లి కొద్దిసేపటికే మృతి చెందింది. దీంతో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






కామెంట్‌లు (0)