పారా అథ్లెట్ దిలీప్ గావిత్‌కు స్వర్ణం
హమ్మద్ బాసిల్‌కు రజతం
జావెలిన్ త్రో ఫైనల్‌కు ముగ్గురు..
గ్లాస్గో: 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. అథ్లెటిక్స్‌లో మురళీ శ్రీశంకర్ రజత పతకం సాధించగా, పారా-అథ్లెటిక్స్‌లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణం, మహమ్మద్ బాసిల్ మొరసింగనకత్ రజతం సాధించి చరిత్ర సృష్టించారు. మరోవైపు భారత బాక్సర్లు కనీసం 10 పతకాలను ఖాయం చేసుకున్నారు. భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ 8.09 మీటర్ల దూరం దూకి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో లాంగ్ జంప్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డు సృష్టించాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ శ్రీశంకర్ రజత పతకం సాధించాడు. జమైకాకు చెందిన తాజే గేల్ 8.15 మీటర్ల దూరం దూకి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫెన్ మెకెంజీ 8.08 మీటర్ల ప్రదర్శనతో కాంస్య పతకం సాధించాడు. మరో భారత అథ్లెట్ లోకేష్ సత్యనాథన్ 7.97 మీటర్ల ఉత్తమ ప్రదర్శనతో ఐదో స్థానంలో నిలిచాడు.
పారా-అథ్లెటిక్స్‌లో మరో రెండు...
పారా-అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. పురుషుల 100మీ. టి47 విభాగంలో దిలీప్ మహాదు గావిత్ 10.71 సెకన్లతో కొత్త గేమ్స్ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. అదే ఈవెంట్‌లో భారత మరో అథ్లెట్ మహమ్మద్ బాసిల్ మొరసింగనకత్ 10.83 సెకన్లతో రజత పతకం సాధించాడు. దీంతో భారత్ స్వర్ణం, రజతం రెండింటినీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. ఇంతకుముందు మీరాబాయి చాను(వెయిట్‌లిఫ్టింగ్), షర్మిలా ధాకా (షాట్‌పుట్ ఎఫ్57)లో స్వర్ణాలు సాధించారు. ఈ పతకాలతో భారత్ మొత్తం 15 పతకాలకు చేరుకుంది. ఇందులో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది.
జావెలిన్ త్రో ఫైనల్‌కు ముగ్గురు...
జావెలిన్ త్రో ఫైనల్లోకి భారత్‌కు చెందిన ముగ్గురు అథ్లెట్లు బెర్త్ సంపాదించారు. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. నీరజ్ చివరి త్రోను 79.61మీ. విసరగా.. రోహిత్, యశ్ వీర్ కూడా ఫైనల్ అర్హత మార్క్‌ను అందుకున్నారు. అయితే, నీరజ్‌కు గట్టి పోటీనిచ్చే ప్రత్యర్థిగా పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఉన్నాడు. ఇతను 2022 క్రీడల్లో స్వర్ణం గెలవడమే కాకుండా, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చోప్రాను అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వీరిద్దరితో పాటు శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే పతక పోటీలో ఉన్నాడు. అతను క్వాలిఫికేషన్ రౌండ్‌లో 92.62 మీటర్ల త్రోతో ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన రికార్డును తన పేరిట కలిగి ఉన్నాడు.
బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం
బాక్సింగ్ రింగ్‌లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. మొత్తం 10మంఇ బాక్సర్లు సెమీఫైనల్స్‌కు చేరుకోవడంతో మరో 10 పతకాలు ఖాయమయ్యాయి. సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుష్ పంఘల్ (80 కేజీలు), నరీందర్ బర్వాల్ (+90 కేజీలు), ప్రపంచ ఛాంపియన్ జాస్మిన్ లంబోరియా (57 కేజీలు) సెమీఫైనల్ బెర్తులు సాధించారు. వీరిలో లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జదుమణి సింగ్ (55 కేజీలు) కూడా సెమీఫైనల్స్‌కు చేరారు. రోజు చివరి బౌట్‌లో జాస్మిన్ లంబోరియా ఇంగ్లాండ్‌కు చెందిన ఎలిస్ గ్లిన్‌పై 4-1 తేడాతో విజయం సాధించి 57 కేజీల సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో భారత్ సాధించిన ఏడు బాక్సింగ్ పతకాల రికార్డు కూడా ఈసారి బ్రేక్ కానుంది.
అథ్లెటిక్స్‌లోనూ ఫైనల్ బెర్తులు
పురుషుల 400మీ. హర్డిల్స్‌లో యశస్ పలక్ష, సంతోష్ కె. తమిళరసన్ ఫైనల్‌కు అర్హత సాధించారు. సంతోష్ రెండో హీట్‌లో 49.51 సెకన్లతో మూడో స్థానంలో నిలవగా, యశస్ మొదటి హీట్‌లో 49.65 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్‌పుట్‌లో జాతీయ రికార్డు హోల్డర్లు తేజిందర్‌పాల్ సింగ్ తూర్, సమర్‌దీప్ సింగ్ గిల్ కూడా ఫైనల్‌కు చేరారు. తూర్ 20.14 మీటర్ల దూరం విసరగా, గిల్ 19.95 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. 200మీ. పరుగులో జాతీయ రికార్డు హోల్డర్ అనిమేష్ కుజుర్ కూడా సెమీఫైనల్‌కు చేరాడు. 20.46 సెకన్లతో తన హీట్‌లో విజయం సాధించి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచాడు.
వెయిట్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్‌లో నిరాశ
అయితే వెయిట్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్‌లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. మహిళల 77 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో సంజన పోటీని పూర్తి చేయలేకపోయింది. స్విమ్మింగ్‌లో పురుషుల 200మీ. ఫ్రీస్టైల్ ఫైనల్‌కు సాజన్ ప్రకాష్, అనీష్ ఎస్. గౌడ అర్హత సాధించలేకపోయారు. సాజన్ తన హీట్‌లో ఐదో స్థానంలో, ఓవరాల్‌గా 20వ స్థానంలో నిలిచాడు. అనీష్ 1:51.64 సమయంతో ఓవరాల్‌గా 18వ స్థానంలో నిలిచాడు.








కామెంట్‌లు (0)