హరారే : జింబాబ్వేతో జరుగుతున్న ఐదు టీ 20ల సిరీస్‌లో భారత్ విజయంతో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జింబాబ్వేను 125 పరుగులకే పరిమితం చేయగా, యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ధసెంచరీతో జట్టుకు సులభ విజయాన్ని అందించాడు. అయితే ఈ విజయానికి తనకంటే బౌలర్లే అసలైన కారణమని, తానింకా పిల్లాడినేనని నేర్చుకుంటున్నానని వైభవ్ వినయంగా పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం బిసిసిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ ... కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పాడు. జట్టు కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని, అయితే ఈ మ్యాచ్ విజయానికి తాను క్రెడిట్ తీసుకునే అర్హుడిని కాదని స్పష్టం చేశాడు. బౌలర్ల అద్భుత ప్రదర్శనే విజయానికి బాట వేసిందని, తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని తెలిపాడు. అర్ధసెంచరీ అనంతరం చేతి వేళ్లతో 'ఏ' (A) అక్షరాన్ని చూపిస్తూ చేసిన సెలబ్రేషన్‌పై స్పందిస్తూ.. అది తన తల్లి ఆర్తి సూర్యవంశీ పేరులోని మొదటి అక్షరమని వివరించాడు. తన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని కుటుంబ సభ్యులు, కోచ్‌లు, తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ 19 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) చివరివరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండో టీ 20 శనివారం జరగనుంది.
‘నేనింకా పిల్లాడినే.. నేర్చుకుంటున్నా’ : వైభవ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 12:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)