ప్రజాశక్తి - ఆత్మకూరు : రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, పూర్వ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బి.హెచ్. రాయుడు తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో మృతి చెందారని వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ప్రజాతంత్ర ఉద్యమంలో రైతులు కార్మికులు కష్టజీవుల కోసం పనిచేసిన బిహెచ్ రాయుడు అకాల మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి వారి కుటుంబానికి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. సిపిఎం జిల్లా నాయకుడిగా, విద్యార్థి ఉద్యమంలో పరిచయం అంచలంచలుగా ఎదిగి ప్రజా ఉద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం చాలా కొద్ది మందిలో పీహెచ్ రాయుడు ఒకరని తెలిపారు. కష్టజీవుల రాజ్యం కోసం తపన పడ్డారని, వారి ఆశయాన్ని కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. బి హెచ్ రాయుడు కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తెలియజేస్తున్నదని శ్రీనివాసరావు తెలిపారు.
విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బి.హెచ్. రాయుడు, అనంతరం డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడిగా, కార్మికనేతగా వి ఆర్ ఎల సంఘం, హమాలీల సంఘం నాయకుడిగా గుర్తింపు పొందారు. గార్లదిన్నె మండల కార్యదర్శిగా మండలంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసారు. శింగనమల డివిజన్ కార్యదర్శిగా, ప్రజా సమస్యలు అవగాహన చేసుకోవడం తోపాటు కార్యకర్తల అభివృద్ధికి తపనపడేవారు. మాజీ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా పార్టీ పిలుపు అమలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలను అత్యంత నిబద్ధతతో నిర్వహించారు. అనంత ప్రస్థానం పేరుతో 54 రోజుల పాటు 2200 కిలో మీటర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలో మొక్కవోని దీక్షతో పాల్గొన్నారు. బెలుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు చదివి కష్టజీవుల పక్షాన మరణించే వరకు నిలబడ్డారు. పార్టీ అప్పజెప్పిన ఏ బాధ్యతను చిత్తశుద్ధితో పని చేసారు. నిర్వహించే రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజా ఉద్యమాలలో ముందుండి పోరాడారు. ఉద్యమాల పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజలతో మమేకమైన జీవితం, నిరాడంబర వ్యక్తిత్వం ఆయనను అందరికీ ఆదర్శప్రాయమైన నాయకుడిగా నిలబెట్టాయి.
తన జీవితమంతా ప్రజల పక్షాన నిలబడి, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కులు, శ్రమజీవుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం సాగించారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజా ఉద్యమాల నిర్మాణం, పార్టీ బలోపేతం కోసం విశేష కృషి చేశారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి, రైతు ఉద్యమానికి, కార్మిక వర్గానికి, ప్రజాస్వామ్య శక్తులకు తీరని లోటు. యెర్రగుడి గ్రామంలో కుల వివక్షత, అంటరానితనం కు వ్యతిరేకంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్వహించిన ఉద్యమంలో ముందుండి ఆలయ ప్రవేశం చేయించారు.
మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, సిపిఎం సీనియర్ నాయకులు జి. ఓబులు, జిల్లా కార్యదర్శి ఓ. నల్లప్ప, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ నాగేంద్ర కుమార్. ఆర్ చంద్రశేఖర రెడ్డి, ఎం.బాల రంగయ్య, ఎం.కృష్ణమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు ఎం నాగమణి,అచ్యుత్ ప్రసాద్, ఆర్వీ నాయుడు, వెంకట నారాయణ,మల్లికార్జున, గోపాల్, శకుంతల, రైతు సంఘం జిల్లా నాయకులు శివారెడ్డి, ఆర్.కుళ్లాయప్ప,రాజారాం రెడ్డి,దస్తగిరి, శ్రీనివాసులు, వెంకట కొండ, జయమ్మ, వలి, శివశంకర్, సురేష్,రమాదేవి, ఎ హరి,పెద్దన్న,సంజీవరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)