శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెపి నిరసనపై పిటిషన్‌ దాఖలు కాలేదు.. ఆ వార్తలు ‘బాధ్యతారాహిత్యమైనవి’ : సిజెఐ

1 గంట క్రితం

CJI Kant
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 01:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ‘చలో సంసద్’ మార్చ్‌ చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరుతూ ఎటువంటి పిటిషన్‌ దాఖలు కాలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శుక్రవారం తెలిపారు. అటువంటి అంశాన్ని విచారణకు స్వీకరించడానికి కోర్టు నిరాకరించిందంటూ వచ్చిన వార్తలు ‘‘బాధ్యతారాహిత్యమైనవి’’ అని ఆయన విమర్శించారు. రిజిస్ట్రీ రికార్డులను పరిశీలించగా ఎటువంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని తేలిందని సిజెఐ తెలిపారు. ‘‘పిటిషన్‌ దాఖలు చేయకుండానే ఆ విషయం ఇటీవల మా దృష్టికి తీసుకువచ్చారు. నేను రిజిస్ట్రీని అడిగి తెలుసుకున్నాను. సుప్రీంకోర్టులో ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదు" అని సిజెఐ పేర్కొన్నారు. కోర్టుకు చేరింది కేవలం ఒక వినతిపత్రం మాత్రమేనని ఆయన అన్నారు. “అది ఆ మిశ్రానో లేదా ఇంకెవరో పంపిన ఒకే ఒక్క వినతిపత్రం. నేను ఆ వినతిపత్రాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణించగలను. అయినా మీడియా దీనిపై విచక్షణారహితంగా వార్తలు రాయడం మొదలుపెట్టింది,” అని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న సిజెఐ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. “గత రెండు రోజులుగా, ఒక కేసు దాఖలైందని పూర్తిగా తప్పుడు ప్రకటన చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును విచారణకు స్వీకరించడానికి నిరాకరించారని మీడియా ఎలాంటి బాధ్యత లేకుండా విచక్షణారహితంగా తప్పుడు వార్తలు రాస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదు.” అని అన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరో కేసును విచారిస్తున్న సమయంలో, సీనియర్ న్యాయవాది షోయెబ్ ఆలం బాంబే హైకోర్టు తీర్పుకు సంబంధించిన మరో అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ అంశంపై తక్షణ విచారణ జరపాలని ఆయన కోరారు. ఆ సందర్భంలోనే ఈ విషయం సుప్రీంకోర్టు ముందు ప్రస్తావనకు వచ్చింది.


అసలేం జరిగింది..

జులై20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన పోలీసుల క్రూరత్వంపై సుమోటోగా విచారణ చేపట్టాలంటూ న్యాయవాది నరేంద్ర మిశ్రా చేసిన మౌఖిక అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం (బుధవారం) మిశ్రా సిజెఐకి రాసిన లేఖ రూపంలోని పిటషన్‌ను ప్రస్తావిస్తూ.. నిరసనకారులపై పోలీసులు దాడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న వీడియోలను పరిశీలించాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని సూచిస్తూ.. ధర్మాసనం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.‘‘మాకు వీడియోల పట్ల ఆసక్తి లేదు. వాటిని చూసే సమయం లేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు.


అదే రోజు పోలీసుల చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసుల నుండి స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. పోలీసుల చర్యకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్‌, వీడియో రికార్డింగ్‌లు, ఇతరరికార్డులను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై సెప్టెంబర్‌ 11న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్