క్రీడలు : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు, టి 20 ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పి ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌పైనే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మళ్లీ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాలపై కోహ్లీ స్వయంగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఢిల్లీలో తన సొంత స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ వన్ 8 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోహ్లీకి టెస్టు క్రికెట్ రీఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. వ్యాఖ్యాత డానిష్ సైత్
సరదాగా, “మీ టెస్టు పరుగుల సంఖ్య 9,230. అదే ధరతో మన బ్రాండ్‌లో ఒక షూ ఉంది. ఇంకొన్ని టెస్టులు ఆడి పరుగుల సంఖ్య పెంచి ఆ షూ ధరను కూడా పెంచాలని అనుకోవట్లేదా ? ” అని అడిగాడు. దీనికి కోహ్లీ కూడా చమత్కారంగా స్పందిస్తూ, “అమ్మకాలు కొంచెం తక్కువైనా పరవాలేదు. టెస్టు క్రికెట్‌తో నా ప్రయాణం ముగిసిపోయింది. ఆ అధ్యాయం ఇప్పటికే పూర్తయింది” అని స్పష్టం చేశారు.
గత ఏడాది మే నెలలో కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 14 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. భారత టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. ముఖ్యంగా 2016 నుంచి 2019 వరకు కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆ నాలుగేళ్లలో 43 టెస్టుల్లో 4,208 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కెప్టెన్‌గా ఏడు డబుల్ సెంచరీలు నమోదు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఢిల్లీతో తనకున్న అనుబంధాన్ని కూడా కోహ్లీ గుర్తు చేసుకున్నారు. “నా జీవితం ఇక్కడే మొదలైంది. ఢిల్లీలోనే పుట్టాను, ఇక్కడే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాను. అందుకే వన్ 8 బ్రాండ్‌ను కూడా ఇక్కడే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం. అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాను” అని కోహ్లీ అన్నారు.









కామెంట్‌లు (0)