ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఊడుస్తాను.. ముగ్గులు వేస్తాను..

1 గంట క్రితం

Di. Teja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:34 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

''ఇది ఆడవాళ్ల పని.. అది మగవాళ్ల పని.. అనే గీతను నేను ఎప్పుడూ గీయలేదు. ఇంట్లో నేనే ఊడుస్తాను.. ముగ్గులు కూడా వేస్తాను. షూటింగ్ టైంలో కూడా అవసరమైతే నేను శుభ్రం చేస్తాను. ఆ పనులు చేయడానికి ఎప్పుడూ సిగ్గు పడలేదు" అని స్పష్టంగా వెల్లడించారు దర్శకుడు తేజ. ఒకప్పుడు వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ తన ఆలోచనలు, జీవన విధానం, సమాజంపై ఉన్న అభిప్రాయాలతో ఇప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కుటుంబ బాధ్యతలు, స్త్రీ–పురుష సమానత్వం, వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి ఆయన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


తెలుగు చిత్రసీమలో ప్రేమ కథలతో కొత్త యువ నటీనటులను పరిచయం చేసిన దర్శకుల్లో తేజ ఒకరు. ఆయన తండ్రి జాస్తి బాలరాం కృష్ణ (జే.బి.కే. చౌదరి) ప్రముఖ పారిశ్రామికవేత్త. తల్లి పేరు జాస్తి రాణి. ఆర్థికంగా బలమైన కుటుంబంలో జన్మించారు. అయితే వ్యాపారంలో తీవ్ర నష్టాలను కుటుంబం ఎదుర్కొంది. కుటుంబం ఎదుర్కొన్న ఒడిదుడుకులు తేజను చిన్న వయసులోనే స్వతంత్రంగా నిలబడేలా చేశాయి. సినిమా రంగంలో అడుగుపెట్టే ముందు లైటింగ్ విభాగంలో సహాయకుడిగా పనిచేశారు. తర్వాత సౌండ్, కెమెరా విభాగాల్లో అనుభవం సంపాదించారు. ప్రముఖ ఫొటోగ్రఫీల వద్ద పనిచేస్తూ సినిమాటోగ్రఫీలో నైపుణ్యం పెంచుకున్నారు. డాక్యుమెంటరీల నిర్మాణంలో కూడా పనిచేసి, తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీగా ఎదిగారు.

‘‘చిత్రం’’ – కొత్త ట్రెండ్‌కు నాంది..

‘‘చిత్రం’’తో తేజ దర్శకుడిగా 2000లో పరిచయమయ్యారు. అప్పటి వరకూ స్టార్ హీరోల చుట్టూ తిరిగిన తెలుగు సినిమా కథనాన్ని పక్కనబెట్టి, కొత్త హీరో–హీరోయిన్లతో యూత్‌ఫుల్ ప్రేమకథను తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, కొత్త తరం ప్రేమకథలకు మార్గదర్శకంగా నిలిచింది. ‘‘నువ్వు నేను’’ – ప్రేమను సహజంగా చూపించిన దర్శకుడు తేజ. ఈ చిత్రంలో ప్రేమను అతిశయోక్తులు లేకుండా, నిజ జీవితానికి దగ్గరగా, కాలేజీ యువత ప్రేమకథ గురించి ఆవిష్కరించారు. పాత్రల భావోద్వేగాలు, కుటుంబ నేపథ్యం, ఆర్.పీ. పట్నాయక్ సంగీతం సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రం తేజకు ఉత్తమ దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత తీసిన సినిమా ‘జయం’. కొత్త నటీనటులకు విజయ ద్వారంగా ఈ సినిమా నిలిచింది. జయంతో నితిన్‌ను హీరోగా, సదాను హీరోయిన్‌గా, గోపీచంద్‌ను విలన్‌గా పరిచయం చేశారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, ముగ్గురి కెరీర్‌కు బలమైన పునాది వేసింది. కొత్తవారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో తేజకు ఉన్న నమ్మకానికి ఇది మరో ఉదాహరణ.

వాస్తవానికి దగ్గరగా కథలు..

‘‘నిజం’’,‘‘ జై’’, ‘‘ఔవునన్నా.. కాదన్నా’’, ‘‘ఒక విచిత్రం’’ వంటి చిత్రాల్లోనూ తేజ తనదైన కథనశైలిని కొనసాగించారు. ఆయన సినిమాల్లో పాత్రలు.. అలంకారాల కంటే భావోద్వేగాలతో గుర్తుండిపోతాయి. కుటుంబ విలువలు, ప్రేమ, ఆత్మగౌరవం, యువత ఎదుర్కొనే సమస్యలు తరచూ ఆయన కథల్లో కనిపించే అంశాలు. అంతేకాదు.. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన చిత్రాలు తీశారు. ప్రేమ, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలకు పెద్దపీట వేశారు. సంగీతం, భావోద్వేగాలు కథతో కలిసి ప్రయాణించే శైలి ఆయనది అని పేరు తెచ్చుకున్నారు. అలాగే విమర్శలనూ ఎదుర్కొన్నారు.

విజయాల తర్వాత ఎదురుదెబ్బలు..

కొన్ని పరాజయాల తర్వాత 2017లో వచ్చిన ‘‘నేనే రాజు నేనే మంత్రి’’ చిత్రంతో తేజ మరోసారి తన సత్తా చాటారు. రాజకీయ నేపథ్యంలోని ఈ చిత్రంలో భావోద్వేగాలు, అధికారం, ఆశయం మధ్య సంఘర్షణను ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటూ వాణిజ్యపరంగానూ విజయం సాధించి, తేజకు విజయవంతమైన కమ్‌బ్యాక్‌గా నిలిచింది. కానీ ఆ తర్వాత తీసిన ‘‘అహింస’’ చిత్రానికి అపజయం ఎదురైంది. కొన్ని కథల ఎంపికలో తాను తప్పు చేశానని తేజానే అంగీకరించారు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న సమయంలో తాను ఎక్కువకాలం ఒకే తరహా ప్రేమకథలపై దృష్టి పెట్టడం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. వరుస అపజయాలు వచ్చిన తర్వాత పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం సహజంగానే తగ్గిపోయిందని ఆయన తెలిపారు. మరోవైపు, సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తేజ సినిమాల్లో సహజత్వం, కొత్త నటీనటులకు అవకాశాలు వంటి బలాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు కథనం పాత శైలిలో అనిపించడం, మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా అన్ని సినిమాలు లేకపోవడం ఆయన కెరీర్‌పై ప్రభావం చూపిందని భావిస్తారు.

కులం, మతానికి దూరంగా..

తేజ వ్యక్తిత్వంలో మరో విశేషం ఆయన ఆలోచనా విధానం. కులం, మతం, ప్రాంతం వంటి విభజనలకు తాను దూరమని తరచూ చెబుతారు. తనకుగానీ, తన పిల్లలకుగానీ ఎలాంటి క్యాస్ట్‌ ‌సర్టిఫికెట్‌, ఇంటిపేరు ఉండవని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలో పిల్లల స్కూలు యాజమాన్యంతో కొన్ని సందర్భాల్లో ఇబ్బందిపడినట్లు గుర్తుచేసుకున్నారు. అలాగే ఇంటి పనులను స్త్రీ, పురుషుల పనిగా విభజించకుండా, అవసరమైతే తానే వంట పని, ఇంటి పనులు చేస్తానని చెప్పడం ఆయనలోని సమానత్వ భావనకు నిదర్శనం.

అసలు పేరు : జాస్తి ధర్మ తేజ

పుట్టిన రోజు : 1966, ఫిబ్రవరి 22న

భార్య: శ్రీవల్లి

పిల్లలు: అమితోవ్ తేజ (కుమారుడు), ఐలా తేజ (కుమార్తె).

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్