ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా పాఠశాల.. మహనీయుల స్ఫూర్తికి నిలయం

1 గంట క్రితం

Our school... a home to the inspiration of great figures.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌ !

మా పాఠశాల అంటే మాకు చాలా ఇష్టం. ఇక్కడ మేము పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాదు.. జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను కూడా నేర్చుకుంటున్నాం. మా పాఠశాలలో జాతీయ నాయకులు, మహనీయుల ఫొటోలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ పాఠశాలకు వచ్చినప్పుడు వారి చిత్రాలను చూస్తూ, వారి గురించి తెలుసుకుంటున్నాం. వారి జీవితాలు మాకు మంచి మార్గాన్ని చూపిస్తున్నాయి. మా పాఠశాలలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌ వంటి మహనీయుల చిత్రాలు ఉన్నాయి. అలాగే మానవ సేవకు ప్రతీకగా నిలిచిన మదర్‌ థెరిస్సా జీవితాన్ని కూడా మేము తెలుసుకుంటున్నాం.

అబ్దుల్‌ కలాం జీవితం మాకు కలలు కనాలని, ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి చదవాలని చెబుతోంది. చిన్నస్థాయి నుంచి ఎదిగి దేశ అత్యున్నత పదవిని అలంకరించిన ఆయన జీవితం ప్రతి విద్యార్థికీ స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ జీవితం సత్యం, అహింస, శాంతి మార్గాల విలువను తెలియజేస్తుంది. జవహర్‌లాల్‌ నెహ్రూ పిల్లలను ఎంతో ప్రేమించేవారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని భావించిన ఆయన జ్ఞాపకంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ దేశ స్వాతంత్ర్యం కోసం చూపిన ధైర్యం, భగత్‌సింగ్‌ చేసిన త్యాగం మాకు దేశభక్తిని నేర్పుతున్నాయి. మదర్‌ థెరిస్సా జీవితంలో కనిపించిన సేవాభావం కూడా మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ చిత్రాలు కేవలం గోడలకు అలంకరణ కాదు. ప్రతిరోజూ మాకు కనిపించే పాఠాలు. ఒకరు సత్యాన్ని నేర్పితే.. మరొకరు ధైర్యాన్ని నేర్పుతున్నారు. ఇంకొకరు కష్టపడి కలలను సాకారం చేసుకోవాలని చెబుతున్నారు. మరొకరు సేవ చేయాలని, ఇంకొకరు దేశాన్ని ప్రేమించాలని స్ఫూర్తినిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు బట్టి సుధాకర్‌ పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. చదువుతో పాటు విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, సృజనాత్మకత పెంపొందేలా ప్రోత్సహిస్తున్నారు. దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మా పాఠశాల వాతావరణమే మాకు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్పేలా ఉంది.

మహనీయుల జీవితాలను తెలుసుకోవడం అంటే వారి ఫొటోలను చూడటం మాత్రమే కాదు.. వారి మంచి లక్షణాలను మన జీవితాల్లో ఆచరించడం. వారి స్ఫూర్తితో మేము మంచి విద్యార్థులుగా, మంచి మనుషులుగా, భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాం.

- సారిపల్లి సతీష్ కుమార్

5వ తరగతి

మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాల (ఎల్‌ఈ),

క్రిస్టియన్‌పేట, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా


​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్