అనగనగా భీమాపురం గ్రామంలో చందు అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు, బంధువులెవ్వరూ లేరు. చందు చాలా తెలివైన పిల్లవాడు. ఆయనకు తల్లిదండ్రులు వ్యవసాయ భూమి ఇచ్చారు. చందు తన నాన్నగారు ఇచ్చిన వ్యవసాయ భూములను చూసుకుంటూ బడికి వెళ్లి చదువుకునేవాడు. చందు పొలం చూసుకోవడంలో సరిగ్గా బడికి వెళ్లలేకపోయేవాడు. పైగా తమ దగ్గర పుస్తకాలు, బట్టలు కొనేందుకు తగిన డబ్బులు కూడా ఉండేవి కావు. తిండి ఒక పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉండాల్సి వచ్చేది. అందుకే చదువుతో ఎవరో స్నేహం కూడా చేసేవారు కాదు. పైగా అందరూ పేదవాడని హేళన చేసేవారు. చందు అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ చదువుకునేవాడు._
ఒకరోజు చందు పొలం పని చేసుకుని బడికి వెళ్తుండగా దారిలో గిరిజ అనే అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ అతి తక్కువకాలంలోనే స్నేహితులయ్యారు. చదువు విషయంలో సబ్జెక్టు అంశాలు కూడా బాగా చర్చించుకునేవారు. ఇద్దరూ చదువుకునేవారు. గిరిజ తన పుస్తకాలను చందూతో పంచుకుంది. గిరిజ ప్రధానోపాధ్యాయుల కూతురు. ఆ విషయం చందుకి తెలియదు. ఒకరోజు చందు పొలం పని చేసుకోవడంతో బడికి రాలేకపోయాడు. గిరిజ ఆ విషయం తెలియక తరగతి గదిలో దిగులుగా కూర్చుని చందు కోసం ఎదురుచూస్తోంది. ఎంతసేపటికి చందు బడికి రాకపోయేసరికి గిరిజ తన నాన్నగారైన ప్రధానోపాధ్యాయుల దగ్గరకు వెళ్ళింది. నాన్న చందు ఈరోజు బడికి రాలేదు ఎందుకని అడిగింది. సరే తల్లి మనం చందు ఇంటికి వెళదాం అన్నారు. అప్పుడు గిరిజ సంతోషంగా చందు ఇంటికి వెళ్ళింది. కానీ చందు ఇంటిదగ్గర లేడు. గిరిజ వాళ్ల నాన్నగారు పక్కింటి వారిని అడిగితే ఇలా అన్నారు. "ఆ... చందుగాడా? వాడు పొలానికి వెళ్ళాడు"అని చెప్పారు. వెంటనే గిరిజ వాళ్ళ నాన్నగారు కలిసి చందు పొలం దగ్గరకు వెళ్లారు. గిరిజ చందుతో ఇలా అంది. ‘చందు ఈరోజు నువ్వు బడికి ఎందుకు రాలేదు అని అడిగింది’. ‘నాకు తల్లిదండ్రులు, బంధువులెవ్వరూ లేరు. మా నాన్న ఇచ్చిన ఈ పొలం చేసుకుంటూ బడికి వస్తున్నాను’ అని చందు అన్నాడు. ‘మరి నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు’ అని గిరిజ అడిగింది. చందు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గిరిజ వాళ్ళ నాన్నతో ఇలా అంది. ‘నాన్న మన దగ్గర సోమయ్య ఉన్నాడు కదా అతనికి ఈ పొలం చూసుకోమని చెప్పు. చందు మనతోనే మన ఇంట్లోనే ఉంటాడు’ అని గిరిజ తండ్రితో చెప్పింది. ‘సరే తల్లి అలాగే మన ఇంట్లోనే చందుని ఉంచుదాం’ అని తండ్రి బదులిచ్చాడు. ఇంక సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత చందును కూడా వారింటికి తీసుకెళ్లారు. ఇక అప్పటినుండి ఇద్దరూ కష్టపడి బాగా చదువుకున్నారు. ప్రయోజకులు అయ్యారు.

బి.గీత, 8వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
పారసాం, నెల్లిమర్ల మండలం,
విజయనగరం జిల్లా.








కామెంట్‌లు (0)