రాము క్లాసులో చివరి బెంచ్ లో కూర్చుని ఉన్నాడు. వాడి పక్కన ఎవ్వరూ కూర్చోరు. పైగా ఎగతాళి చేస్తూ ఉంటారు. వాడికి మెల్లకన్ను. అందుకని వెక్కిరిస్తూ, ఏడిపిస్తూ ఉంటారు. ఆటల్లో కూడా వాడిని చేర్చుకోరు. కానీ లెక్కలు మాస్టారి క్లాస్ అంటే పిల్లలకి చాలా భయం. సరిగా చేయకపోతే ఆయన చాలా గట్టిగా అరవడమే కాదు, క్లాస్ బయట నుంచో పెట్టేస్తారు. రాముకి మాత్రం లెక్కల క్లాస్ అంటే భయం లేదు. పైగా ఇష్టం. వాడికి లెక్కలు, ఎక్కాలు చాలా బాగా వచ్చు. నోటితో కూడికలు, గుణింతాలు అవలీలగా చెప్పేస్తాడు. లెక్కల మాస్టారికి కూడా రాము అంటే ఇష్టం. కష్టమైన లెక్కని బోర్డు మీద రాసి, ఎవరు ముందు చేస్తే, వాళ్ళ చేత ఆ లెక్క ఎలా చేయాలో చెప్పిస్తారు. వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి మెచ్చుకుంటారు.
ఆ చాక్లెట్లు ఎప్పుడూ రామూకే ఇవ్వాల్సి వచ్చేది. వాడే బాగా చేసేవాడు మరి. మిగిలిన వాళ్ళకి రాము అలా లెక్కలు సులువుగా చెప్పేయడం అసూయగా ఉండేది. "వీడు ట్యూషన్ కి వెళ్తాడు రా! అందుకే లెక్కలు ముందే నేర్చుకుని చెప్తాడు. "అని చెవులు కొరుక్కునేవారు.
ఆ రోజు లెక్కల క్లాస్ కి మాస్టర్ వచ్చారు మామూలుగా. కొత్త అధ్యాయం లెక్కలు వివరించి, ఒక లెక్క బోర్డు మీద రాస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి మాస్టారు గుండె పట్టుకుని నేలమీద కూలబడిపోయారు. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి పిల్లలు భయం, భయంగా చూశారు.
రాము మాత్రం గబగబా మాస్టర్ దగ్గరికి వెళ్లి, ఆయనను సరిగా పడుకోపెట్టి, గుండె మీద అరచేతులతో ఒత్తుతూ, ప్రథమ చికిత్స చేస్తూ, మిగతా పిల్లల్ని "హెడ్మాస్టర్ కి చెప్పి అంబులెన్స్ కి ఫోన్ చేయమని చెప్పండి! " అని అరిచాడు. ఆపకుండా అరచేతులతో ఒత్తుతూ, నోట్లో నోరు పెట్టి ఊదుతున్నాడు. హెడ్ మాస్టారు అంబులెన్స్ కు ఫోన్ చేసి, వచ్చి రామూ చేస్తున్న పని చూసి అవాక్కయ్యారు. ఇంతలో పక్కనే ఉన్న ఆసుపత్రి నుంచి అంబులెన్స్, డాక్టర్ రావడంతో అందరూ పక్కకు నిలబడ్డారు. డాక్టర్ గారు వచ్చి రామూని జరగమని, ఆక్సిజన్ మాస్క్ పెట్టి, మాస్టార్ ని అంబులెన్స్ లో ఎక్కించారు.
"మాస్టారికి గుండెపోటు రాగానే ఇలా చేయాలని ఎక్కడ నేర్చుకున్నావు బాబూ?"అని డాక్టర్ గారు అడిగారు.
"పుస్తక ప్రదర్శనకి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక డాక్టర్ గారు చేయడం నేర్పిస్తూ ఉంటే, చూసి నేర్చుకున్నానండి!" అన్నాడు రాము.
డాక్టర్ గారు మిగతా పిల్లల్ని" మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. ఆపద చెప్పి రాదు కదా!"అని అన్నారు. రాముని అభినందించారు. హెడ్మాస్టర్ కూడా రాముని మెచ్చుకున్నారు.
ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు రాము అక్కడ నిలబడి ప్రథమ చికిత్సలు గమనిస్తూ ఉంటే మిగిలిన పిల్లలు వాడిని వేళాకోళం చేస్తూ ‘‘ఇదంతా బోర్!’’ అనుకుంటూ వెళ్లిపోయారు. ఆ సంఘటన గుర్తొచ్చి పిల్లలంతా తలదించుకున్నారు. రామూకి ఇప్పుడు అందరూ స్నేహితులే.

ముంజులూరి కృష్ణకుమారి
9494493409








కామెంట్లు (0)