ఈ వేసవికాలంలో స్పిక్‌మాకే_కార్యక్రమంలో పాల్గొనటానికి ఐఐటీ ఖరగ్పూర్_వెళ్లడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మొదట్లో అంత దూరం వెళ్లి, ఆరు రోజుల పాటు నా కుటుంబాన్ని వదిలి, ఎలా ఉండగలనోనని భయంగా అనిపించింది. అక్కడ మొదటిరోజు నాకు చాలా కొత్తగా, కొంచెం గందరగోళంగా అనిపించింది. కానీ తర్వాతిరోజు నుంచి ప్రతి కార్యక్రమానికి ముందుగానే వెళ్లాలని చాలా ఆసక్తి కలిగింది. నేను హ్యాండ్లూమ్ వీవింగ్‌లో పాల్గొన్నాను. కాటన్ బట్టలను ఎలా నేస్తారు, వాటిపై అందమైన డిజైన్లను ఎలా తయారు చేస్తారు అనే విషయాలను నేర్చుకున్నాను. నాకు సంగీతం కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. అయినప్పటికీ, నేను హ్యాండ్లూమ్‌ను ఎంతో శ్రద్ధగా, ఉత్సాహంగా నేర్చుకున్నాను. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేకమైన నాటకాలు, కళా ప్రదర్శనలు జరిగేవి. ఎంతో మంది గొప్ప కళాకారులు తమ కళలను ప్రదర్శించడం చూసి, చాలా ఆనందం కలిగింది. రాత్రి జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో అందమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు చూశాను. అందులో నాకు కూడియట్టం చాలా నచ్చింది. ఆ నృత్యంలోని ముద్రలు, కళ్ల కదలికలు, భావ వ్యక్తీకరణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
మాకు హెరిటేజ్ టూర్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక గ్రామాన్ని సందర్శించాము. ఆ గ్రామంలో ప్రజలు బట్టలపై, ఇతర వస్తువులపై చేతితో అందమైన చిత్రాలు వేస్తున్నారు. ప్రతి వస్తువుపై చేతితో పెయింటింగ్స్ వేస్తుండటం చూసి చాలా ఆశ్చర్యపోయాను. కార్యక్రమంలో నాకు చాలామంది కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. వారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వారంతా రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. మొదట వారితో మాట్లాడటం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాను. చివరగా, ఈ ఏడు రోజుల ప్రయాణం నాకు ఎన్నో కొత్త అనుభవాలు, కొత్త స్నేహితులు, మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. ఈ స్పిక్‌మాకే శిబిరం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి అనుభవం.
సి. దీపు కార్తికేయ
8వ తరగతి,_
అరవింద మోడల్ స్కూల్,
_మంగళగిరి, గుంటూరు జిల్లా.







కామెంట్‌లు (0)