మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్లే నేరస్తులా?

1 గంట క్రితం

vote
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 04:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆగస్టు-14 తేదీన ‘స్త్రీ శక్తికి ఏడాది-రెట్టింపు అయిన ఆత్మగౌరవం’ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మహిళలు ఎందుకు మానలేదు? అని ప్రశ్నించారు. ఏ రాజకీయ నాయకుడూ ఇంటి నుండి డబ్బులు తీసుకురారు. వాళ్లు ఇచ్చేదంతా లంచాల సొమ్మే. ఎన్నికల్లో రూ.2 వేలు ఇస్తే, దానికి బదులు రూ.2 లక్షలు సంపాదించుకుంటారు. అంటే వారు సంపాందించుకునే దానిలో మీకు చిల్లర విదిలిస్తారంటూ సూక్తులు వల్లించారు. ఎన్నికల్లో 10 రూపాయలు ఎవరు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకు మహిళలు ఓట్లు వేస్తున్నారు. దీనిపై మహిళలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సందేశం ఇచ్చారు.

బహుశా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు చంద్రబాబు గారికి జ్ఞాపకం వచ్చి ఉంటాయి. అందుకే నీతి సూక్తులు వల్లిస్తున్నారు. అసలు ఎన్నికల్లో డబ్బు పంచుతున్నది ఎవరు? రాజకీయ నాయకులు కాదా? రాజకీయాలకు విలువ లేకుండా చేసింది ఎవరు? ఎన్‌.టి.రామారావు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచడం చూశామా? టిడిపి కి చంద్రబాబు నాయకత్వం వహించినప్పటి నుండి ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతున్నది. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది చంద్రబాబు కాదా? ఎన్నికల్లో డబ్బు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో ‘‘ఓటుకు నోటు’’ కేసులో చిక్కింది చంద్రబాబు కాదా? అదే విధానాన్ని బిజెపి నేడు మరింత తీవ్రంగా ఆచరిస్తున్నది. ‘ఆప్‌’ తో సహా అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను బెదిరించి కొంటున్నది. రాజ్యసభలో మెజారిటీ సాధించాలని చూస్తున్నది. ‘కాంగ్రెస్‌’ కి డబ్బులు పంచే ఆనవాయితీ ముందు నుంచీ వుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ‌ఆ కుదురు నుండి పుట్టినదే కదా! బూర్జువా పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా కమ్యూనిస్టులు మాత్రమే డబ్బు పంచడానికి పూర్తి వ్యతిరేకం. గెలిచినా, ఓడినా కమ్యూనిస్టులు ప్రజలకు సేవ చేయడం, ఓట్లు అడగడం మాత్రమే వారి రాజకీయ నిబద్ధత.

ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంచుతున్నది పాలకవర్గ పార్టీల నాయకులు. చంద్రబాబు ఈ నేరాన్ని మహిళలపై నెట్టడం అన్యాయం. ఎన్నికల్లో ఒక పార్లమెంట్‌ సీటుకు రూ.వంద కోట్లు పైగాను, ఒక అసెంబ్లీ స్థానానికి రూ.పదుల కోట్లలో ఖర్చు పెట్టే స్థాయికి రాజకీయాలు దిగజారాయి. ప్రజలు ఈ రాజకీయాలను నేడు అసహ్యించుకుంటున్నారు. స్వాతంత్య్రం అనంతరం రాజకీయాలలో విలువలు ఉండేవి. ఏ పార్టీలోనైనా విధానాలు వేరు కావచ్చు. కానీ విలువలను ప్రజలు గౌరవించేవారు.

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత (2014 ) రాజకీయాల్లో విలువలు దారుణంగా పడిపోయాయి. పెద్ద అవినీతి తిమింగలాలను తమ పార్టీలో చేర్చుకొని వారిపైనున్న అవినీతి కేసులు మాఫీ చేస్తున్నారు. సిబిఐ, ఇ.డి లాంటి శాఖలతో దాడి చేయించడం, బెదిరించడం ఆనవాయితీ అయింది. అలాంటి వారికే మరలా పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో బిజెపి టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఎంత అవినీతిపరులైనా బిజెపి లో చేరగానే వాషింగ్‌ మిషన్‌లో మురికి వదలి క్లీన్‌ అయినట్లు బయటకు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి విధానాల వలన రాజకీయాలు భ్రష్టుపడుతున్నాయి. ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేయరనే భయంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం''సర్‌'' పేరుతో కోట్లాది ఓట్లు తీసివేస్తున్నది. గతంలో ఎన్నికల్లో వారందరినీ ఓట్లర్లుగా చేర్చాలనే నినాదం ఉండేది. నేడు ఓట్లు ఎంత తక్కువగా ఉండాలి? అనే విధానాన్ని బిజెపి అమలు చేస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైనది ప్రజాస్వామం. ప్రజాస్వామ్యానికి గుండెకాయ ఎన్నికలు. ధన, కండ బల సంపన్నులు మాత్రమే రాజకీయ నాయకులు అయితే రాజకీయాలు మసకబారతాయి. రాజకీయాల్లో నేర చరితుల సంఖ్య తారాస్థాయికి పెరుగుతున్నది. 2004 లోక్‌సభ ఎంపీలుగా గెలిచివారిలో నేర చరితులు 23 శాతం అయితే గత 20 సంవత్సరాల్లో నేరచరితుల సంఖ్య రెట్టింపు అయింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు తెలియజేసింది. పోటీపడి బూర్జువా పార్టీలు రాజకీయాలను దిగజారుస్తున్నాయి. బిజెపి కేంద్ర ప్రభుత్వం నయా ఫాసిస్ట్‌ ధోరణిలో పయనిస్తున్న తరుణంలో ఎన్నికలు కూడా ప్రమాదంలో పడ్డాయి.1970 దశకంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి 1975 జూన్‌లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశం 18 మాసాలు అంధకారంలో మగ్గింది. 1977 జనవరిలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 30 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. జనతా పార్టీ 6 మాసాల్లో ఏర్పడి అధికారంలోకి వచ్చింది.

భారత్‌ లాంటి ‌సువిశాల దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచడం ఎవరి తరం కాదు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే చైతన్యం ఉంటుంది. నిద్రాణంలో ఉన్న యువతను కాక్రోచ్‌ జనతా పార్టీ మేల్కొల్పినట్లే సరైన సమయంలో ప్రజలంతా తిరగబడతారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రజాతంత్రవాదులంతా కృషి చేయాలి.


వ్యాసకర్త: సిహెచ్‌. నరసింగరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్