మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జాబుల్లేని క్యాలెండర్‌

1 గంట క్రితం

job
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

‌రాష్ట్రంలో నిరుద్యోగిత వృద్ధి రేటు రికార్డులు బద్దలు కొడుతున్న వేళ టిడిపి కూటమి ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రకటించిన జాబ్‌ ‌క్యాలెండర్‌ సర్కారీ కొలువుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్న యువతకు మిక్కిలి నిరాశ మిగిల్చింది. వివిధ డిపార్టుమెంట్లలో 10,060 పోస్టుల భర్తీకి శనివారం ఆర్థిక శాఖ అనుమతించింది. అదుగో ఇదుగో అని ఊరించి సగం ఏడాది గడిచాక ఆగస్టు చివరిలో అరకొర పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చింది లాంఛనప్రాయమైన గ్రీన్‌ ‌సిగ్నల్‌ మాత్రమే. నోటిఫికేషన్లు నాలుగు దశల్లో విడుదల చేస్తామన్నారు. అవసరాలు, పోస్టుల ప్రాధాన్యత, ప్రజలకు చేసే సేవలు, ఆదాయ సమీకరణ, మౌలిక వసతులు.. అమాంబాపతు పరిశీలనల అనంతరం ఒకటొకటిగా నోటిఫికేషన్‌ ‌వస్తుందని సెలవిచ్చారు. రాష్ట్రంలో మంజూరైన ప్రభుత్వ పోస్టులు 7,71,117 కాగా 5,29,868 మంది మాత్రమే పని చేస్తున్నారు. దాదాపు 2,41,309 ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో కనీసం రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం మాత్రం 1.75 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌‌సోర్స్‌ పద్ధతిలో తక్కువ జీతాలపై పని చేయించుకుంటోంది తప్ప శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టట్లేదు. ప్రపంచబ్యాంక్‌ ఆంక్షలు, నయా-ఉదారవాద విధానాల యుగంలో ఎవరు అధికారంలో ఉన్నా ఇదే వైఖరి.

ఎన్నికలకు ముందు యువగళం పేరిట లోకేష్‌ ‌నిర్వహించిన పాదయాత్రలోనూ, కూటమి అగ్రనేతలు నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్‌‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలోనూ తామొస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాల జాతరేనని నమ్మబలికారు. మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్‌‌సిక్స్‌ ‌పథకాల్లో మొదటిది ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. వాటితోపాటు మెగా డిఎస్‌‌సి, ప్రతి ఏటా జాబ్‌ ‌క్యాలెండర్‌ హామీ ఇచ్చారు. మొదటి ఏడాది వాటి ఊసే లేదు. రెండవ ఏడాది మెగా డిఎస్‌‌సి అనగా, ఖాళీగా ఉన్న అన్ని టీచర్‌ ‌పోస్టులనూ నింపుతారనుకున్నారు. తీరా భర్తీ 16 వేలకు పరిమితం చేశారు. గిరిజన యువతకు స్పెషల్‌ ‌డిఎస్‌‌సి మాట మరిచారు. ఇంకా 20 వేల వరకు టీచర్‌ ‌ఖాళీలుండగా ఇప్పుడు జాబ్‌ ‌క్యాలెండర్‌‌లో 2,991 పోస్టులు భర్తీ చేస్తామంటున్నారు. రిటైర్మెంట్లను కలుపుకొని కనీసం 10 వేలన్నా నింపాలని నిరుద్యోగులు డిమాండ్‌ ‌చేస్తున్నా చెవికెక్కించుకోకపోవడం అన్యాయం. పోలీస్‌ ‌శాఖలో 20 వేల ఖాళీలున్నాయని స్వయాన హోంమంత్రే వెల్లడించగా, కనీసం 11 వేలు భర్తీ చేయాలని యువత ఆందోళనలు చేస్తుండగా, జాబ్‌‌ క్యాలెండర్‌‌లో 2,265 పోస్టుల భర్తీకే అనుమతించారు. గ్రూపు1, 2 పోస్టులు 5 వేలు ఖాళీ ఉంటే కేవలం 800 నింపుతున్నారు. లైబ్రేరియన్‌, పశు సంవర్థక శాఖలో ఎహెచ్‌ఎ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్నా ‌విస్మరించారు. అందుకే ప్రభుత్వం ప్రకటించింది జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌కాదు.. ‌జాబ్‌‌లెస్‌ క్యాలెండర్‌ అనవలసి వస్తుంది.

విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికీకరణ, సేవా రంగం విస్తరణ లేక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర పాలకులు తరచు చెబుతుంటారు. విభజన జరిగిన పన్నెండేళ్ల తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదనీ అంగీకరిస్తారు. బాధ్యత ఎవరిది? చదువుకున్న యువత ఉద్యోగాల కోసం హైదారాబాద్‌, బెంగళూరు, చెన్నయ్‌, ముంబయి బాట పడుతున్నారు. ఎ.పి.లో నిరుద్యోగిత రేటు 6.2గా ఉందని గతేడాది పార్లమెంట్‌‌లో మోడీ ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ సగటు కంటే ఎక్కువని సర్వేలు ఘోషిస్తున్నాయి. రాష్ట్రంలో 6.16 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్‌ ఎక్సేంజిలలో పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్టర్‌‌ చేయించుకోనివారు, స్కిల్‌, సెమి స్కిల్‌, అన్‌‌స్కిల్డ్‌, అందరినీ లెక్కేసుకుంటే నిరుద్యోగుల సంఖ్య కొన్ని రెట్లు ఎక్కువే. స్వర్ణాంధ్ర 2047, దాని వెలుగులో వచ్చే ప్రైవేటు పెట్టుబడుల ద్వారా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందన్న ప్రభుత్వ ప్రచారం డొల్లేనని కేటాయించిన భూములు, నెలకొల్పిన పరిశ్రమలు, లభించిన ఉద్యోగాలను చూస్తే తెలుస్తుంది. విభజన హామీల్లో ముఖ్యమైన ప్రత్యేక హోదా కనుక కేంద్రం కల్పించి ఉంటే పెట్టుబడులకు కొంతైనా భరోసా ఉండేది. అది వదిలేసి పెట్టుబడులంటూ దేశ విదేశాలు తిరిగినా ఆకర్షించగలిగేవి స్వల్పంగానే ఉంటాయి. నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మభ్యపెట్టాలని చూస్తే జెన్‌-‌జెడ్‌ నుంచి ఆగ్రహోద్యమాలు తప్పవు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్