నటి అనసూయ ఇటీవల తన తండ్రి మరణానంతరం తల్లి జీవితంలో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు. భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకు వంటి అలంకరణలకు దూరం కావాలనే ఆచారాన్ని ప్రశ్నించారు. ఈ అలంకరణలను పెళ్లికి ముందే తల్లులు, అమ్మమ్మలు ఆడపిల్లలకు పరిచయం చేస్తుంటే, వాటిని భర్త జీవితంతో ఎందుకు ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలు చదివినప్పుడు నాకు మా అమ్మానాన్నల జీవితం గుర్తుకొచ్చింది.
మా అమ్మానాన్నల వివాహం వారి పెద్దల ఆకాంక్ష మేరకు గుంటూరు జిల్లా కాకాణిలో గుడిలో జరిగింది. తరువాత కొన్నాళ్లకు తాళి అనేది పురుషాధిపత్యానికి గుర్తు అని భావించి, అమ్మకు నచ్చజెప్పి దానిని తీసేయించారు మా నాన్న ఎ.వి. వర్మ. ఆయన అభ్యుదయ ఆలోచనకు ఊతమిచ్చి, ఆ విధంగానే ఆచరించింది మా అమ్మ ఎ. లక్ష్మి. తాళి తీసేసిన కొత్తల్లో అమ్మకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘ఏమి, భర్త ఏమయ్యాడు? పోయాడా?’ అని సానుభూతి వచనాలు వినాల్సి వచ్చింది. అడిగిన వారందరికీ నచ్చజెప్పి, అభ్యుదయ బాటలోనే జీవితాంతం నడిచారు అమ్మానాన్న. ఈ ఏడాది జనవరి 14న మా నాన్న చనిపోయిన తరువాత కూడా ఎటువంటి ఆచారాలూ పాటించలేదు. మా నాన్న కోరుకున్నట్టుగానే ఆయన పార్థివ దేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం అప్పగించాం. ఆ విధంగా మా నాన్న ‘విద్యార్థుల ప్రయోగాల్లో’ బతికే ఉన్నాడన్న తృప్తి మా కుటుంబంలో ఉంది. అంతేకాదు, నాన్న బతికి ఉన్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో, ఆయన చనిపోయిన తరువాత కూడా అదే విధంగా ఉంది. ఆచారాల పేరిట ఏ తంతులూ పాటించలేదు.
నేడు సోషల్ మీడియా వేదికగా ఎన్నో అంశాలు చర్చకు వస్తున్నాయి. ఓ వైపు సోషల్ మీడియా వేదికగా మనువాద భావజాలాన్ని పెంచి పోషిస్తున్న తీరు బాధ కలిగిస్తోంది. మరోవైపు అభ్యుదయ ఆలోచనలూ వ్యాప్తి చెందటం సంతోషం కలిగిస్తోంది. సమాజంలో ఈ రెండూ ఎప్పుడూ ఉంటాయి. ఏది శాస్త్రీయమో, ఏది సరైనదో మనమే గుర్తించి వాటిని పాటించాలి. ఇలాంటి సందర్భాల్లో విమర్శించేవాళ్లు కొందరు ఉండొచ్చు. ఆ కొందరి కోసం వెనకడుగు వేయకూడదు. ఎవరో ఒకరు ముందడుగు వేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. చాలా కుటుంబాల్లో నేడు భర్త పోయిన మహిళల మానసిక వేదనను చూస్తున్నాం. భర్త పోయాడన్న బాధ ఓ వైపు ఉంటే, మరోవైపు ఆమెకు వైధవ్యం దాపురించిందంటూ ఆచారాల పేరిట మానసికంగా హింసిస్తున్నారు. ఈ విషయంలో డబ్బున్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా ఏమీ లేదు. భర్త పోయిన బాధలో ఆమె ఉండగా, మొహానికి పసుపు రాసి, పెద్ద కుంకుమ బొట్టు పెట్టి, తలనిండా పూలు పెట్టి... ఇదే నీ చివరి అలంకరణ అన్నట్లుగా వ్యవహరిస్తారు. పెద్ద కర్మ జరిగే లోపు ప్రతిరోజూ ‘ముత్తయిదవ’ పేరుతో అలంకరిస్తారు. ఇలా ఆమెను బాధపెట్టి, హింసిస్తారని చెప్పవచ్చు. భర్త చనిపోయి బాధలో ఉంటే ఇదెక్కడి ఆచారమో అర్థం కాదు.
చెరువు గట్టుపై ఆచారం పేరుతో..
భర్త చనిపోయిన వారిని బంధువుల మధ్య చెరువు గట్టున కూర్చోబెట్టి చేసే తంతు మరీ ఘోరం. పసుపు రాయడం, పెద్ద కుంకుమ దిద్దడం, రంగురంగుల గాజులు తొడిగి, పూలను జడలో అలంకరించడం చేస్తారు. తరువాత గాజులు పగలగొట్టి, పూలన్నీ లాగి పడేసి, బొట్టు చెరిపేసి, తెల్లచీర కట్టబెట్టి ‘విధవరాలు’గా ముద్ర వేసి మూలన కూర్చోబెడతారు. ఇలా చేయడానికి ఎవరిచ్చారు హక్కు? పూలు, గాజులు, బొట్టు అన్నీ పుట్టినప్పటి నుంచి వచ్చినవే కదా. అయినా బొట్టు, పూలు పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం, గాజులు వేసుకోవడం, వేసుకోకపోవడం మహిళల ఇష్టం. అలాంటిది భర్త పోతే అవన్నీ పోయాయంటూ ఏంటి ఈ సనాతన దురాచారం?
‘ఆచారం’ పేరుతో ఇంకెన్నాళ్లు..?
అర్థం లేని ఆచారాలతో కొందరు చదువుకున్నవారూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయాల పేరుతో భర్త లేని స్త్రీని అవమానిస్తారు. ఆమె మనసు ఎంత బాధపడుతుందో అని కూడా ఆలోచించరు. ఆమె ఎదురొస్తే కీడు జరుగుతుందని భావిస్తారు. శుభకార్యాలకు పిలిచినప్పుడు ‘గడప’కు బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాం అనుకుంటారు తప్ప, అవమానిస్తున్నామని అనుకోరు. భర్త చనిపోతే ఆశీర్వదించడానికీ అనర్హురాలు అన్నట్లు పక్కన పెడతారు. ఆఖరికి సొంత బిడ్డకు పెళ్లి జరుగుతున్నా కల్యాణ మండపంలో తగిన ప్రాధాన్యం ఉండదు. కన్యాదానం చేసే బాధ్యతను వేరే వారికి అప్పగిస్తారు. ఈ కన్యాదాన సంప్రదాయం సరైందా కాదా అన్నది వేరే ప్రశ్న. కానీ, ఆ ఘట్టానికి ఆమెను దూరంగా ఉంచటం దారుణమే కదా!
మన సంఘ సంస్కర్తలు ఎన్నో సనాతన సంప్రదాయ సంకెళ్లను తెంచటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సమాజంలో వేళ్లూనుకుని ఉన్న మూఢాచారాలతో యుద్ధం చేశారు. వారి వరవడిని, వారసత్వాన్ని మనం కొనసాగించాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరమైంది, ఏది అవసరం లేనిది అన్నది మనం గుర్తించాలి. సంప్రదాయాల పేరుతో అవమానాలకు గురిచేసే తంతులకు ముగింపు పలకాలి. సంప్రదాయ సంకెళ్లను తెంచుకుంటేనే మహిళలకు ముందడుగు.
- ఎ. వనజ, 94900 99261







కామెంట్‌లు (0)