రచ్చరచ్చగా కర్రతొ
రహదారిని కొట్టుచున్న
అమాయకుని చేష్టచూసి
అడిగెను ఓ వ్యక్తి ఇలా,
‘‘వెర్రి వెంగళప్పలాగ
కర్రతోటి రహదారిని
అదే పనిగ కొట్టుచుంటి
వదేలనో వివరించుము!’’
‘‘దారులు కొట్టి బతకమని
తండ్రి నాకు చెప్పెగనుక
రచ్చరచ్చగా కర్రతొ
రహదారిని కొట్టుచుంటి’’
‘‘దారులు కొట్టుట అంటే
దారినేగు వార్నికొట్టి
వారి సొమ్ముకాజేయుట’’
వ్యక్తి చెప్పెనో సలహా!
‘‘ఇంకెవరో ఎందుకింక
ఇపుడే కొట్టెద నిన్నిక!
నీ దగ్గర వున్న సొమ్ము
నాదే ఇక వెళ్లిపొమ్ము’’
‘‘అయాచిత సలహా ఇచ్చి
ఆపద కొని తెచ్చుకొంటి’’
అని చింతిస్తూ ఆతడు
తనదారిన వెళ్లినాడు!
‘‘బాలబంధు’’ *అలపర్తి వెంకటసుబ్బారావు.
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్యపురస్కార గ్రహీత)
9440805001







కామెంట్‌లు (0)