ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధన రాజకీయాలను తిప్పి కొట్టి , 52 వ డివిజన్ లో సిపిఎం సత్యబాబు గెలుపు అద్వితీయం

45 నిమిషాల క్రితం

CPMs Satyababu wins in the 52nd division a remarkable victory that defied the influence of money in politics
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 12:52 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

కూటమి ప్రభుత్వంపై అందరిలో సానుకూలత ఉంటే.. 45 శాతం మంది ఓటింగ్ కు ఎందుకు రాలేదు ?, వందల కోట్లు వెచ్చించి ఓటర్లకు డబ్బు ఎందుకు పంచారు ?

సిపిఎం, కమ్యూనిస్టులకు ఆశించిన ఓట్లు రాకపోవడంపై పరిశీలన చేసుకుంటాం, మరింత ఉధృతంగా పోరాటాలు సాగిస్తాం

నగరపాలక సంస్థ కౌన్సిల్లో సిపిఎం .. నికరమైన ప్రతిపక్షం, ప్రజాపక్షం

ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతాం, క్షేత్రస్థాయిలో మరింత ప్రజలకు చేరువవుతాం నగరంలో సిపిఎం, వామపక్షాల ఐక్యతను బలోపేతం చేస్తాం

సత్య బాబు అభినందన, ఓటర్లకు కార్యకర్తలకు... ధన్యవాదాల సభలో సిపిఎం నేతల పిలుపు


విజయవాడ : నేడు మాకినేని బసవన్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు అభినందన సభలో ... సత్యబాబును గెలిపించిన ప్రజలకు, నగరంలో పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి. కాశీనాథ్ తదితర నేతలు ప్రసంగించారు. పార్టీ నేత బి. రమణ రావు అధ్యక్షత వహించగా, పి.కృష్ణ ఆహ్వానం పలికారు. ఈ సభలో వివిధ సంఘాల నేతలు ,కార్యకర్తలు, నగర ప్రముఖులు, పార్టీ అభిమానులు, నేతలు.. సత్య బాబుకు పుష్పగుచ్చాలిచ్చి, శాలువాలు కప్పి అభినందించారు, సత్కరించారు. అనంతరం బాబురావు, కృష్ణ, కాశీనాథ్, సత్యబాబు లు మాట్లాడుతూ ... కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోంది, ఓటు హక్కును హరిస్తోంది, సర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ పాలకుల ఏజెంట్ గా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపింది, అధికార దుర్వినియోగానికి పాల్పడింది, ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చింది, దౌర్జన్యాలకు పూనుకున్నది, ధన రాజకీయాలను సాగించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 52వ డివిజన్లో కూటమి, బిజెపి అభ్యర్థిని, వైసీపీ అభ్యర్థిని ఓడించి సిపిఎం అభ్యర్థి బోయి సత్య బాబును 1400 మెజారిటీతో గెలిపించిన ప్రజలకు జేజేలు అని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఐదు సార్లుగా సిపిఎం అభ్యర్థులను,బోయి సత్య బాబును మూడుసార్లు గెలిపించిన ప్రజానీకానికి అభినందనలు తెలిపారు. సిపిఎం పోటీ చేసిన 14 వార్డుల్లోనూ, వామపక్షాల అభ్యర్థులకు, మేయర్ గా స్వతంత్ర అభ్యర్థి ఏబి. వెంకటేశ్వరరావు గెలుపు కొరకు కృషి చేసిన కార్యకర్తలకు, సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో సిపిఎం 7 వార్డులు, మొత్తం వామపక్షాలు 13 వార్డులలోనూ,ఒక జడ్పిటిసి స్థానంలో సిపిఎం ,మరో 15 ఎంపీటీసీ స్థానాల్లో సిపిఎం, వామపక్షాలతో కలిపి 25 స్థానాలు, సిపిఎం ఒక ఎంపీపీగా, నాలుగు మండలాల్లో వైస్ ఎంపీపీలుగా గెలుపొందడం హర్షనీయమన్నారు. స్థానిక సంస్థలు, చట్టసభలలో కృషితో పాటు ,ప్రజాక్షేత్రంలో ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మంత్రి రాజీనామా చేయటం ప్రజా ఉద్యమ విజయం అని చెప్పారు. ఓటు హక్కు తొలగింపుకు నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇతర ప్రతిపక్షాలు, పౌర సంఘాలు చేస్తున్న పోరాటం వల్ల ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేయక తప్పలేదు, ఇది జన విజయమే, ఈ పోరు మరింతగా ముందుకు సాగించాలి, కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి, ఎన్నికల కమిషన్ సమూలంగా మార్పులు చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రాయితీల వలన కొత్త ఉద్యోగాలు కల్పించబడలేదు, కార్మికులు వేతనాలు పెరగలేదని ప్రధానమంత్రి మోడీనే స్వయంగా అంగీకరించారు అని వివరించారు. మోడీ ,అంబానీ, అదాని, కార్పొరేట్లు కొమ్మక్కై దేశ సంపదని లూటీ చేస్తున్నారని వామపక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజలు చేస్తున్న ఆరోపణలు సరైనవేనని మోడీ వ్యాఖ్యలతో రుజువయ్యిందని అన్నారు. ఈ విధానాలకు బిజెపి, మోడీ బాధ్యత వహించాలి, ఇతరుల మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చెల్లవు అని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థల దోపిడీ వలన భారాలు పెరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పవలసి వచ్చిందన్నారు. సిపిఎం వామపక్షాలు ఎప్పటినుండో విద్యుత్ ప్రైవేట్ కంపెనీల ఒప్పందాలను రద్దు చేయాలని పోరాడుతున్నాయని తెలిపారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, దోపిడీకి కూటమి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వాస్తవాలు ఇంత నగ్నంగా బట్టబయలవుతున్నా, తాజాగా సెమీ కండక్టర్ తదితర కంపెనీలకు 80 శాతం పెట్టుబడి రాయితీలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. గత అనేక నెలలుగా బియ్యం, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు సతమతమవుతుంటే ప్రభుత్వం ఇప్పుడు మేల్కొన్నట్లు నటించడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ధరలను అదుపు చేయాలి, నిత్యవసర వస్తువులను ఒక ధరలకు డిపోల ద్వారా అందించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు తమ వారసులకు పదవులు కట్టబెట్టి, యువతను ముందుకు తెస్తున్నట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అనారోగ్యం పాలవుతున్నారు, ఇదేనా విద్యార్థులు, యువతకు ప్రోత్సాహం ? అని ప్రశ్నించారు. అమెరికా మొదలు ఇజ్రాయిల్ వరకు పాలక పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతున్నారు, రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలింది, దేశంలో రాబోయే పరిణామాలకు ఇది ఒక సూచిక అని అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 52వ డివిజన్ మినహా మిగిలిన వార్డుల్లో సిపిఎం, వామపక్షాలకు ఆశించిన ఓట్లు రాలేదు ,ప్రజా ఉద్యమాలు ఓటింగ్ గా మారలేదు అని చెప్పారు. ఒక వైపున ధన రాజకీయాలు, మరోవైపు అధికార కూటమి భ్రమలు, మత, కుల రాజకీయాలు, తగిన సమయం లేకుండా ఎన్నికల నిర్వహణ.. తదితర అనేక ఆటంకాల మధ్య, సిపిఎం, వామపక్షాలను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సిపిఎం, వామపక్షాలు లేవనెత్తిన సమస్యలు, ప్రజా ఎజెండా ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. వివిధ కారణాలతో అధిక శాతం మంది కూటం వైపు మొగ్గినా, 45 శాతం మంది ఓటర్లు ఓటింగ్ కు రాకపోవడం... కూటమి పాలనపై అనేకమందిలో ఉత్సాహం కొరవడటం తో పాటు, ప్రభుత్వ వ్యతిరేకత ఇమిడి ఉంది,ఇంకా అనేక అంశాలు కారణం అని అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి , ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంచాయి, అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించింది, అనేకచోట్ల కార్పొరేటర్ సీట్లు లక్షలాది రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. భవిష్యత్తులో నగరపాలక సంస్థలో అవినీతి మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలన్నారు. నూతన మేయర్ ,కౌన్సిల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. విజయవాడ నగర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలి, రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించాలన్నారు. సిపిఎం ఈ ఎన్నికల అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకుంటుంది, మరింత ప్రజాసేవకు అంకితం అవుతుంది ,ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తుంది, ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందుతుందని చెప్పారు. స్థానిక, క్షేత్రస్థాయిలో సమస్యలపై ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు, సైదాంతిక కృషిని ముమ్మరం చేద్దామన్నారు. విజయవాడలో రాష్ట్రంలో సిపిఎం, వామపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేస్తామన్నారు. అభ్యుదయ, వామపక్ష శక్తులు, పౌర సమాజాన్ని కలుపుకొని ఐక్య ఉద్యమాన్ని సాగిస్తామన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్లోను, బయట ప్రజల ప్రయోజనాల కొరకు పోరు సాగిస్తాం, నికరమైన, నిజమైన, ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల తరఫున ప్రతిపక్షంగా కృషి చేస్తామని ప్రసంగించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్