చీరాలకి రెండు కిలోమీటర్ల దూరంలో, సంపత్‌నగర్ ఉంది...అక్కడ విసిరెసినట్లు అక్కడక్కడ ఇళ్లు ఉన్నాయి. అప్పుడప్పుడే లాంతర్లు, దీపపు బుడ్లు పోయి, ప్రతి ఇంటికీ విద్యుత్ బల్బులు వస్తున్న రోజులు అవి. ఇంటి యజమాని లక్ష్మణరావు వృత్తిరీత్యా ఉదయాన్నే చీరాలకు వెళితే, రాత్రికే ఇంటికి వచ్చేవాడు. సమయం సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది. నల్లని మేఘాలు వేగంగా కదులుతూ ఊరంతా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి.
ఇంట్లో లక్ష్మణరావు భార్య సుబ్బమ్మ, కూతురు బుజ్జి, మరో చంటిపిల్లతో ఉన్నారు. ఆ సమయంలో కాలనీ మొత్తం కరెంటు పోయింది. గాజుసీసాకు ఒక గుడ్డముక్కను ఒత్తిగా చేసి, కిరోసిన్ పోసిన బుడ్డిదీపం వెలిగించింది సుబ్బమ్మ. మెల్లమెల్లగా దీపం వెలుగు తగ్గిపోతోంది. పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బా తీసి చూసింది సుబ్బమ్మ.
‘అయ్యో! ఇప్పుడెలా? కిరోసిన్ కూడా లేదే’ అంది బుజ్జితో.__
‘అమ్మా! నేను ఊళ్లో నాన్న దగ్గరికి వెళ్లి కిరోసిన్ తీసుకుని రానా?’ అంది బుజ్జి.
‘ఒక్కదానివే రెండు కిలోమీటర్లు నడిచి వెళతావా? నాన్న దగ్గరికి వెళ్లి కిరోసిన్ తెస్తావా?’ అంటూ సందేహంలో పడింది సుబ్బమ్మ.__
'నిండా పదేళ్లు కూడా లేని బుజ్జి, ఈ చీకట్లో, సన్నని గాలుల మధ్య, ఒక్కొక్కటిగా రాలుతున్న వర్షపు చినుకులు పెరుగుతుండగా, జాగ్రత్తగా వెళ్లి, రాగలదా? వెళ్లకపోతే రాత్రంతా చీకట్లో ఉండాల్సిందే’ అనుకుని బుజ్జిని పంపడానికి సుబ్బమ్మ సిద్ధపడింది. తడవకుండా ఉండేందుకు బుజ్జి తలపై ఒక పాలిథిన్ కవర్ కప్పి, టార్చిలైట్ ఇచ్చింది. ఆ టార్చిలైట్లో కూడా బ్యాటరీ పవర్ తక్కువగా ఉంది. మరో చేతికి కిరోసిన్ రేకుడబ్బా ఇచ్చింది సుబ్బమ్మ.
‘అమ్మా! నువ్వు చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను కిరోసిన్ తీసుకుని వస్తాను సరేనా’ అంటూ బయలుదేరింది బుజ్జి. దూరదూరంగా ఉన్న ఇళ్లన్నీ దాటుకుని రోడ్డు వెంబడి నడక సాగించింది. రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లు. కనుచూపు మేరలో ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు బుజ్జికి.
ఇంకాస్త ముందుకు నడిచేసరికి ఇరువైపులా కాలువలు ఉన్న వంతెన వచ్చింది. వడివడిగా నడుస్తోంది బుజ్జి. చినుకుల వేగం పెరిగింది. అప్పటివరకూ ఏ ఆలోచనా లేని బుజ్జికి ఒక్కసారిగా భయంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. తన గుండె చప్పుడు కంటే గాలి చేసే వింతవింత శబ్దాలు మరింత భీతి గొలుపుతున్నాయి. అయినా నడుస్తూనే గమనించసాగింది బుజ్జి.
‘టప్... టప్...’ అనే శబ్దం తన తలపై ఉన్న పాలిథిన్ కవర్‌పై చినుకుల తాకిడికి వస్తోందని గ్రహించింది. చేతికి దగ్గరగా ‘టంగ్... టంగ్...` అనే శబ్దాన్ని కూడా గమనించింది. అది కిరోసిన్ రేకుడబ్బాపై చినుకులు పడుతుంటే వస్తున్న సౌండ్ అని గ్రహించింది. వర్షం ఇంకా వేగం పెరిగింది. బుజ్జి నడక వేగం కూడా కొంచెం పెంచింది. నిర్మానుష్యంగా ఉన్న దారుల్లో, ఇరువైపులా ఉన్న చెట్ల నుండి ఒకలాంటి భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి.
ఉన్నచోటే ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది బుజ్జి. చిమ్మచీకటి తప్ప ఏమీ కనిపించలేదు. ముందుకు సాగాలో, వెనక్కి పోవాలో అర్థంకాని అయోమయంలో పడిపోయింది బుజ్జి. తన గుండె చప్పుడు తనకే పెద్దగా వినిపిస్తూ, ధైర్యం మొత్తం సన్నగిల్లిపోయి, దుఃఖం తన్నుకొస్తోంది. అయినా మొండి ధైర్యంతో ముందుకు నడుస్తూనే ఉంది. ఏపుగా పెరిగిన చెట్ల గాలికి `రీ...` అనే శబ్దం వస్తుంటే, ఎవరో కేకలు పెట్టినట్లు, ఎవరో అరుపులుగా వినిపించసాగాయి. గాలి వేగానికి తలపై ఎగురుతున్న పాలిథిన్ కవర్‌ను గట్టిగా నొక్కిపట్టింది. చేతిలో ఉన్న రేకుడబ్బా మధ్య ఒరుసుకుపోతున్న వేళ్లను సరిచేసుకుంటూ, టార్చిలైట్ తడవకుండా ఉండేందుకు తలపై నుండి నడుము వరకు ఉన్న పాలిథిన్ కవర్ చాటుగా పెట్టుకుంది. భయాన్ని గొంతులోనే గుటకలు మింగుతూ, ముందుకు సాగింది.
కంటికి కాస్తంత దూరంలో ఊళ్లో వెలిగే విద్యుత్ దీపాలు కనిపించాయి. వాటిని చూసి బుజ్జి నేత్రాలు మెరుపుల్లా మెరిసాయి. "నాన్నా" అంటూ పరుగున తండ్రిని చేరింది బుజ్జి. ఆ సమయంలో బుజ్జి ఒక్కతే రావడంతో తండ్రి లక్ష్మణరావుకు ఆశ్చర్యం వేసింది. ఆ చిన్న వయసులో ఆ గాలివానలో కూతురి ధైర్య సాహసాలను చూసి, లక్ష్మణరావు గర్వంగా అలా ఉండిపోయాడు.
పద్మజా రామకృష్ణ. పి.
9491830278.








కామెంట్‌లు (0)