దీపావళి పండుగ రోజు ఆ వీధంతా కొత్త వెలుగులతో కళకళలాడుతోంది. పదేళ్ళ వయసున్న చైతన్య, యత్విక్, హేమ, పర్ణిక తమ తమ ఇళ్ల ముందు దీపాలు పెట్టేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. చైతన్య, యత్విక్ మెరిసిపోయే ఇత్తడి ప్రమిదలను చూపిస్తూ, "మా ప్రమిదల నుండి వచ్చే కాంతి చాలా అందంగా ఉంది చూడండి" అన్నారు. ఆ మాటతో మట్టి దీపాలు వెలిగిస్తున్న పర్ణిక, హేమ చిన్నబుచ్చుకున్నారు. హేమ తన ఇంట్లో ఉన్న విద్యుత్ బల్బుల తోరణాన్ని తీసుకొచ్చి, "మీ ఇత్తడి దీపాలకంటే నా విద్యుత్ దీపాలే ఎక్కువ వెలుగునిస్తాయి" అని బదులిచ్చింది.
"నేను పెద్ద శబ్దం చేసే బాంబులు కాలుస్తాను, మీ అందరి కన్నా మా ఇంటి ముందే ఎక్కువ ధ్వని వస్తుంది చూడండి!" అని యత్విక్ సవాలు విసిరాడు. అందుకు బదులుగా, "టపాసులతో మా వాకిలే అందరికన్నా ఎక్కువ వెలుగుతుంది" అని పందెం కాసింది పర్ణిక. పిల్లలందరూ పంతాలకు దిగారు. వీధి అరుగుపై కూర్చున్న దీప్తి వారి మాటలు విని, చిరునవ్వుతో వాళ్ళను దగ్గరకు పిలిచింది. దీప్తి ఇంటర్మీడియట్ చదువుతోంది. సైన్స్ ప్రాజెక్ట్ తయారుచేస్తోంది.
"పిల్లలూ! చీకటిని పోగొట్టి వెలుగును పంచడమే దీపావళి లక్ష్యం కదా! మరి ఆ వెలుగు వెనుక ఉన్న సైన్స్ ఏమిటో, అది మనకు నేర్పే సమానత్వ పాఠమేమిటో మీకు తెలుసా?" అంటూ అడిగింది. పిల్లలందరూ దీప్తి వైపు ఆశ్చర్యంగా చూశారు.
“మా డాబాపై ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం రండి," అని ఆహ్వానించింది. పిల్లలు కుతూహలంగా దీప్తితో డాబా పైకి వెళ్లారు. అక్కడ టేబుల్ మీద ఒక గాజు గ్లాసు, కొన్ని అద్దాలు, పెద్ద పుటాకార దర్పణం ఉన్నాయి. అక్కడ ఇత్తడి ప్రమిదలను, మట్టి ప్రమిదలను పక్కపక్కనే ఉంచి వెలిగించింది దీప్తి. "ఈ ప్రమిదల పైభాగంలో మండుతున్న జ్వాలలో ఏమైనా తేడా ఉందా?" అని పిల్లలను అడిగింది. పిల్లలందరూ దీక్షగా పరిశీలించారు. "లేదు, అన్ని ప్రమిదల్లో ఒకేలాంటి పసుపు-నారింజ రంగు మంట వెలుగుతోంది!" అని చెప్పింది పర్ణిక.
"బయట ఉన్న పాత్ర ఇత్తడిదా, వెండిదా లేక మట్టిదా అన్నది ముఖ్యం కాదు. లోపల ఉన్న నూనె వత్తి గుండా పైకి ఎగబాకుతోంది. గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించి దహన చర్య జరిగి వెలుగును, వేడిని ప్రసరింపజేస్తోంది. బయటి రూపాలు వేరైనా, లోపల జరిగే రసాయనిక చర్య ఒక్కటే కదా?" అంటూ ప్రశ్నించింది. పిల్లలు అవునన్నట్టు తల ఆడించారు.
“ఈ సృష్టిలో జీవించే మనుషులమైన మనమందరం కూడా అంతే! మన చర్మం రంగు, మన రూపం, మన ఆర్థిక స్థితి వేరు కావచ్చేమో.. కానీ మనుషులందరం సమానులమే!" అంది. ఆ తర్వాత దీప్తి ఒక గాజుగ్లాసును వెలుగుతున్న దీపంపై బోర్లించింది. కొద్ది క్షణాల్లోనే దీపం ఆరిపోయింది.
“గాజు గ్లాసు లోపల ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. అందుకే దీపం ఆరిపోయింది!” అని చెప్పాడు చైతన్య.
"ఈ వెలుగులాగే మనుషులు జీవించడానికి స్వచ్ఛమైన గాలి కావాలి. మరి మీరు పెద్ద శబ్దాలు చేసే టపాసులు కాలిస్తే గాలిలో సల్ఫర్, కార్బన్ వంటి హానికర రసాయనాలు కలిసిపోయి, మనం పీల్చే గాలి విషపూరితం అవుతుంది. శబ్ద కాలుష్యం కూడా కలుగుతుంది. మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.” అని చెప్పి, “ప్రకృతిని నాశనం చేసి, పండుగ జరుపుకోవడం మంచిదా?" అని అడిగింది. కాదన్నట్టు తల ఊపాడు యత్విక్.
అప్పుడు దీప్తి పిల్లల ఆలోచనలను మరో మలుపు తిప్పే ప్రయత్నం చేసింది. డాబాపై ఉన్న అన్ని లైట్లను ఆపేసింది. పరిసరాలు మళ్లీ కటిక చీకటిగా మారాయి. ఇప్పుడు ఎవరి ప్రమిదను వారి చేతిలో పెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో మూల నిలబెట్టింది. ఎవరికి వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చిన్న ప్రమిద వెలుగు కేవలం వారి పాదాల చుట్టూ ఉన్న భాగాన్ని మాత్రమే వెలిగించగలిగింది.
"ఇప్పుడు మీ ప్రమిదలన్నింటినీ ఈ టేబుల్ మధ్యలో ఉంచండి," అని చెప్పింది. నలుగురు పిల్లలు తమ ఇత్తడి, మట్టి ప్రమిదలన్నింటినీ ఒక్కచోట చేర్చారు. ఎక్కువ వెలుగు అక్కడ చేరింది. వెంటనే దీప్తి ఆ దీపాల వెనుక ఒక పెద్ద దర్పణాన్ని అమర్చింది. దాంతో ఆ దీపాల నుంచి వెలువడిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది, ఒక శక్తివంతమైన కాంతి పుంజంలా మారి, డాబా మొత్తాన్నీ వెలుగుతో నింపేసింది.
పిల్లల కళ్లు ఆశ్చర్యంతో మెరిశాయి. "అద్భుతం అక్కా! అందరి దీపాలు కలిసేసరికి ఇంత పెద్ద వెలుగు వచ్చిందా?" అని ఆశ్చర్యపోయాడు చైతన్య.
"అవును! ఇదే కాంతి శక్తి సూత్రం, ఇదే మానవ ఐక్యత తత్వం," అని చెప్పింది దీప్తి. పిల్లలు ఆ ఆశ్చర్యం నుండి బయటకు రాగానే దీప్తి గంభీర స్వరంతో, "ఒక్కొక్కరిగా విడిపోయి, నాది గొప్ప, నీది తక్కువ అని పోటీపడితే మనం అజ్ఞానమనే చీకట్లోనే ఉండిపోతాం. మన శక్తులన్నింటినీ ఏకం చేసినప్పుడు మాత్రమే సమాజంలోని దారిద్య్రం, మూఢనమ్మకాలు, విభేదాలు అనే చీకట్లను శాశ్వతంగా తరిమికొట్టగలం!" అని వివరించింది.
ఆ ప్రయోగం పిల్లల మనసుల్లోని భేదాభిప్రాయాలను తుడిచిపెట్టేసింది. చైతన్య, యత్విక్ తమ ఇత్తడి దీపాలను చూసి గర్వపడలేదు. హేమ, పర్ణిక తమ మట్టి దీపాలను చూసి చిన్నబోలేదు. బాణసంచా కాల్చి వాతావరణాన్ని పాడుచేయకూడదని పిల్లలందరూ నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, పిండివంటలను పంచుకుంటూ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.

పేట యుగంధర్
9492571731








కామెంట్లు (0)