సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపాత బట్టలు-కొత్త ఆశలు

15 గంటల క్రితం

krishna swami Untitled.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 02:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అనగనగా ఓ ఊరు. ఆ ఊరి బడిలో చైతన్య తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు బడికి సెలవు. బ్యాంకులో పని ఉన్న నాన్న పట్టణానికి బయలుదేరాడు. నాన్నతోపాటు చైతన్య కూడా బ్యాంకుకు వెళ్ళాడు.

బ్యాంకులోని క్యాషియర్ చైతన్యను పలకరించాడు. ఏమి చదువుతున్నావు, ఏ బడిలో చదువుతున్నావని అడిగాడు. అన్నిటికీ సమాధానమిచ్చాడు చైతన్య.

బ్యాంకులో ఓ చోట పెద్ద పెట్టె పెట్టి ఉన్నారు. అందులో బట్టలున్నాయి. అది ఏమిటని అడిగాడు చైతన్య. “ఈ పెట్టెలో ఎవరైనా పాత బట్టలు తెచ్చి పెట్టవచ్చు. వాటిలో బాగున్నవి తీసుకుని శుభ్రంగా ఉతికించి పేదవారికి, వాటి అవసరం ఉన్నవారికి ఉచితంగా ఇస్తాము” అని చెప్పాడు క్యాషియర్. ఆసక్తిగా విన్నాడు చైతన్య. మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారని అమాయకంగా అడిగాడు.

సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గర అవ్వాలని మేమిలా చేస్తున్నామని చెప్పాడు క్యాషియర్. ‘అలాగా’ అని బదులిచ్చిన చైతన్యకు తను కూడా ఏదైనా మంచి పని చేస్తే బాగుండుననిపించింది ఆలోచిస్తూ నాన్నతో పాటు ఇంటికి వెళ్ళాడు.

మరుసటి రోజు ఉదయం వీధిలోకి సైకిల్ మీద ఒకడు వచ్చాడు. ‘పాత బట్టలకు తళతళలాడే కొత్త స్టీలు సామాన్లు ఇస్తాం’ అని అరిచాడు. వాడి మాటలు విన్న చైతన్య అమ్మ ఆనందపడిపోయింది. గబగబా అటక మీద ఉన్న పాత బట్టల మూటను కిందికి దించింది. చైతన్య అది చూశాడు. అమ్మ దగ్గరకు వెళ్ళి తను బ్యాంకులో చూసింది చెప్పాడు.

“స్టీలు సామాన్ల కోసం ఆశపడి వాటిని అమ్మవద్దు.

బ్యాంకులోని పెట్టెలో వాటిని పెడితే ఆ బట్టలు అవసరమైన వారికి చేరుతాయి” అని చెప్పాడు.

కొడుకు మాటలకు ఆమె ఆలోచనల్లో పడింది. ఈ బట్టల ద్వారా వచ్చే పాత్రల విలువ అంత గొప్పదేమీ కాదు. అదే ఈ బట్టలు అవసరమైన వారికిస్తే దాని విలువ చాలా గొప్పదవుతుందని గుర్తించింది. “అయినా, బ్యాంకులో పెట్టడం ఎందుకు, మనకి తెలిసిన వారికి ఎవరికైనా ఇద్దాం” అని చెప్పింది.

వెంటనే చైతన్య “మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గర బట్టలు తీసుకోవడానికి సంకోచిస్తారు. వాటిని మననుంచి తీసుకోవడం అవమానంగా కూడా భావిస్తారు. అదే వారికి నిజంగా అవసరమైతే బ్యాంకుకు వెళ్ళి తీసుకుంటారు” అని నచ్చచెప్పాడు. కొడుకు మాటలకి అమ్మ ‘నా కొడుకు ప్రయోజకుడవుతున్నాడు’ అని మురిసింది. అలాగేనని చెప్పి బట్టల్ని సర్ది, చైతన్య చేతికిచ్చింది.

ఆరోజే వాటిని సైకిల్ మీద పెట్టుకుని, పట్టణానికి బయలుదేరుతున్నాడు. అదే ఊరిలో తనతో పాటు చదువుతున్న కిరణ్, సతీష్ లు చైతన్య వద్దకు వచ్చారు. ఏమి చేస్తున్నావని అడిగారు. తను చేస్తున్నది చెప్పాడు.

‘మాకురాని ఆలోచన నీకు వచ్చింది, మేము కూడా ఒక చేయి వేస్తామని’ వారు అన్నారు. అలాగేనని బదులిచ్చాడు చైతన్య. వాళ్ళిద్దరూ పరిగెత్తుకెళ్ళి వాళ్ళ ఇండ్లలో ఉన్న పాత బట్టలను మూటకట్టి తెచ్చారు. అన్నిటినీ తీసుకుని చైతన్య బ్యాంకుకు వెళ్ళాడు.

పెద్ద బట్టల మూటను పెట్టెలో పెడుతూ ఉంటే క్యాషియర్ చూశాడు. వెళ్ళి బ్యాంకు మేనేజర్ కి చెప్పాడు. చిన్నవాడి చిట్టి ఆలోచనకు బ్యాంకు మేనేజర్ ఆశ్చర్యపోయాడు. సిబ్బందినంతా రమ్మన్నాడు. వారందరికీ చైతన్య చేసింది చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు.

చైతన్యకు బ్యాంకు మేనేజర్ తమ బ్యాంకు క్యాష్ బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. సమాజానికి ఉపయోగపడే పనులు మరిన్ని చేయాలని చైతన్య భుజం తట్టాడు. అలాగే చేస్తానని చైతన్య ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు.

‘ఈ పాత బట్టలు ఎవరికో ఒకరికి కొత్త ఆశలను చిగురింపజేస్తాయి’ అన్నట్లుగా పెట్టెలోని బట్టలు ఫ్యాను గాలికి అటూఇటూ ఊగుతున్నాయి.

rc krishnaswamy raju .jpg

ఆర్.సి.కృష్ణస్వామి రాజు

9393662821

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్