అనకాపల్లి జిల్లా.. ఈ పేరు వింటే ఠక్కున గుర్తుకొచ్చేవి జలాశయాలు.. వాటిని ఆనుకుని ఉండే పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలు. తీరం వెంబడి ఉండే బీచ్‌లు కూడా ఇట్టే ఆకట్టుకుంటాయి. చారిత్రాత్మక బొజ్జన్న కొండ విజ్ఞాన విషయాలను తెలియజెబుతుంది. జిల్లాలోని చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఎనిమిది రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో రైవాడ, పెద్దేరు, తారకరామ, కల్యాణపులోవ జలాశయాలు పేరుగాంచాయి. తాండవ రిజర్వాయర్ కూడా చూడముచ్చటగా ఉంటుంది. విశాఖ నగరానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి మండలంలో ఉండే రైవాడ జలాశయం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడి ప్రశాంతమైన జలసౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులు.. అక్కడి నుంచి సమీపంలోని గిరిజన ప్రాంతాల ప్రకృతి అందాలను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు.

బాహుబలి’ జలపాతం చూసొద్దామా..
ఒకవైపు ఎత్తయిన కొండలు.. మరోవైపు పచ్చని అడవులు.. వాటి మధ్య రాళ్లను తాకుతూ ఉరకలెత్తే జలధార.. చుట్టూ పరుచుకున్న గిరిజన ప్రాంతపు సహజ సౌందర్యం.. వెరసి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే అద్భుత దృశ్యం దేవరాపల్లి మండలం వాలాబు సమీపంలోని సరియా జలపాతానిది. కొండల మధ్య నుంచి వాలు జారుతూ కిందికి దూకే జలధారను చూసి పర్యాటకులు దీనిని ముద్దుగా ‘బాహుబలి జలపాతం’ అని పిలుస్తుంటారు. దేవరాపల్లి మండల కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం విశాఖ నగరానికి కూడా పెద్దగా దూరం కాదు.
బొజ్జన్నకొండకు రెండు వేల ఏళ్ల చరిత్ర
అనకాపల్లి జిల్లా కేంద్ర సమీప శంకరం గ్రామంలో ప్రపంచ ప్రాచీన బౌద్ధ వారసత్వానికి ముఖ్యమైన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి సమీపంలోని బొజ్జన్నకొండ, లింగాలకొండలపై కనిపించే స్తూపాలు, గుహలు, బుద్ధుని శిల్పాలు, విహారాల అవశేషాలు ప్రాచీన చరిత్రను కళ్లకు కడుతున్నాయి.
పురావస్తు ఆధారాల ప్రకారం శంకరం ప్రాంతంలో క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచే బౌద్ధ కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. శాతవాహనుల కాలానికి చెందిన నాణేలు, ప్రాచీన మట్టి పాత్రలు, స్తూప నిర్మాణాల అవశేషాలు ఇక్కడి ప్రాచీనతకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. బొజ్జన్నకొండపై అనేక రాతి గుహలు, స్తూపాలు, బుద్ధుని శిల్పాలు కనిపిస్తాయి. ప్రధాన గుహలో రాతి స్తంభాలు, మధ్యలో ఏకశిలా స్తూపం, దాని చుట్టూ ప్రదక్షిణా మార్గం ఉన్నాయి. అద్భుత శిల్ప కళకు ఈ బొజ్జన్న కొండ ప్రత్యక్ష తార్కాణం. ఈ కొండకు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు.
చూడముచ్చటగా కొండకర్ల ఆవ అందాలు
ప్రకృతి సౌందర్యానికి నిలయంగా అచ్యుతాపురంలోని కొండకర్ల ఆవ ప్రసిద్ధిగాంచింది. అచ్యుతాపురం - మునగపాక మండలాల మధ్యలో సుమారు 1400 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ కొండకర్ల ఆవ బ్రిటిష్ వారి పాలనలో ప్రసిద్ధి చెంది తెల్లదొరలను ఆకర్షించింది. పెద్ద చెరువు మాదిరి ఉండే ఈ కొండకర్ల ఆవలో రంగు రంగులతో విరబూసి కనిపించే కలువ పువ్వులు, నీటిపై తేలియాడుతున్న తామర ఆకులు, ఆకులకు కలువ పువ్వులకు మధ్యన కిలకిల రాగాల శబ్దాలతో తిరుగాడుతూ కనిపించే రకరకాల పక్షులు ప్రత్యక్ష ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిక్నిక్‌లకు, ఫొటో షూట్‌లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.








కామెంట్‌లు (0)