ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకొండలెక్కుదాం.. చలో చలో..

18 గంటల క్రితం

ట్రెక్కింగ్_ 8.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 08:34 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

‘అంకుల్... కొండపైకి దారి ఎటు?’

నలుగురు కాలేజీ కుర్రాళ్లు కేకలు పెడుతున్నారు.

కొండపల్లి ఊళ్లో నుంచి ఖిల్లాకు వెళ్లే దారిలో కొండ సాహసికుల బృందం(అడ్వెంచర్ ట్రెక్కర్స్ కంపెనీ-ఏటీసీ)... సుమారు 12 మంది వెళ్తున్నారు. కొండపాదం నుంచి ఖిల్లాకు(బీస్ట్)... అక్కడి నుంచి పర్వత శిఖరాగ్రానికి చేరాలి.

మా జట్టులో అత్యంత పిన్న వయస్కుడికి 57 సంవత్సరాలు. అందరికంటే పెద్దోడికి 23 ఏళ్లు. కాలేజీ కుర్రాళ్లు వేస్తున్న కేకలకి మా జట్టులో ఒక్కరు కూడా స్పందించలేదు. చివరికి మా సభ్యుడు ఒకరు ‘బ్రో... అంకుల్ అంటే ఎవరూ పలకరు’ అంటూ హింట్ ఇచ్చాడు.

దీంతో వాళ్లు ‘బ్రో... పైకి ఎలా వెళ్లాలి? మీతో రావచ్చా?’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ అడిగారు.

అదిగో అప్పుడు లేచాయి మా గొంతులు, ‘వెల్కమ్ బ్రో... ’ అంటూ...

‘ప్రకృతిలో విహరిద్దాం... పరవశంతో తిరిగివద్దాం’... ‘ఆనందగా వెళ్దాం... ఆరోగ్యంగా వద్దాం’... ‘సమయానికి చేరుకుందాం... సమయపాలనతో తిరిగొద్దాం’ వంటి చిక్కటి తెలుగు నినాదాలతో మా బృందం 2019లో ఏర్పడింది. అప్పటి నుంచి నిరంతరాయంగా కొండలు ఎక్కుతూనే ఉన్నాం. కొవిడ్ మహమ్మారి కాలంలో మాత్రమే మా బృందం కొండ ముఖం చూడనిది. ఇన్నేళ్లలో గుండెల నిండుగా గాలి పీల్చుకోని, మేఘాలను పలకరించని, మంచు తునకల్లో తేలియాడని ఆదివారాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు.

శనివారం సాయంత్రం అయిందంటే అందరి చూపు వాట్సాప్ వైపే ఉంటుంది. ఆదివారం ఉదయం ఏ కొండ ఎక్కాలన్నది ‘అడ్మిన్ బృందం’ నిర్ణయిస్తుంది. ఎన్ని గంటలకు వెళ్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెచ్చుకోవాల్సిన వస్తువులు వంటి వాటితో ఓ మెసేజ్ వస్తుంది. అచ్చ తెలుగులో రాయాలన్న ఆకాంక్ష ఉన్న ‘పూర్ణయోగి’ (ఆయన యోగా మాస్టారు లేండి) నుంచి వచ్చే ఆ సందేశంతో గ్రూపు లో మాటలు ప్రారంభమవుతాయి. సోమవారం సాయంత్రం వరకూ ఫొటోలు, ఇన్ స్టా పోస్టింగులతో హోరెత్తే మా వాట్సాప్ గ్రూపు మరో శనివారం కోసం చూస్తూ మౌనంగా ఉండిపోతుంది.

డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, లాయర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, కాంట్రాక్టర్లు, పాత్రికేయులు మా బృందంలో సభ్యులు. వయస్సు తారతమ్యాలు మరిచిపోయి చిన్న పిల్లల్లా గెంతడం, ఒకరి కోసం మరొకరు నిలబడడం జట్టు స్థిరంగా కొనసాగడానికి కారణాలు. కొండపల్లి, గుణదల, గన్నవరం, గుంటూరు, కొండవీడు, ఎర్రబాలెం, మంగళగిరి, అమరావతి – గుంటూరు మార్గంలోని కొండలు, పాడేరు, అహోబిలం వంటి ప్రాంతాలకు కొండలు ఎక్కడమే పనిగా మా సభ్యుల ప్రయాణం సాగింది. మా జట్టులో సుమారు 10 మంది వరకూ అమర్ నాథ్ యాత్రకు వెళ్లారు. 15 మంది వరకూ శ్రీశైలానికి అటవీ ప్రాంతంగుండా నడకదారిలో వెళ్లి వచ్చింది. మొత్తం 45 కి.మీ. దూరాన్ని ఒక్క రోజులో పూర్తి చేసింది. విజయవాడ నుంచి కారులో రాత్రంతా ప్రయాణించి, ఉదయాన్నే కొండ ఎక్కడం ప్రారంభించి, రాత్రి 10.30 గంటలకు శ్రీశైలం చేరుకుంది. అత్యంత వేడి వాతావరణంలో సాగిన ఈ ప్రయాణం సవాలనే చెప్పుకోవాలి.

గుండెకు తూములు (సరదాగా స్టంట్ కు మేం పెట్టున్న పేరు) వేసుకున్న వాళ్లు... ప్రమాదంలో కాళ్లలో రాడ్లు ఉన్న వాళ్లు, మోకీలు అరిగింది... జాగ్రత్త అంటూ వైద్యుల హెచ్చరికలు విన్నవాళ్లు జట్టులోని పిల్లలు. ఒకే కొండను వివిధ దారుల్లో ఎక్కడం, కష్టంగా సాగే, దారులే లేని ప్రాంతాల నుంచి కొండపైకి చేరడానికి ప్రయత్నం చేయడం, సంక్లిష్టమైన కొండలు, 80 డిగ్రీల వాలు ఉన్న కొండ బండలనూ ఇష్టంగా కష్టపడి ఎక్కడం అలవాటు చేసుకున్నాం. ఈ క్రమంలో జట్టులోని బలమైన వారు అవసరమున్న వారికి చేయూతనిస్తూ సమిష్ఠి తత్వంతో సాగుతారు. జట్టులోని సభ్యులు వివిధ అవసరాల రీత్యా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినా అప్పుడప్పుడూ కొండ ఎక్కడానికి పలకరిస్తూ ఉంటారు. ఖాళీ అయిన స్థానాలను ఎప్పటికప్పుడు కొత్తనీరు పూరిస్తూనే ఉంది. కొత్తల్లో అమ్మో దీనిని ఎక్కడం అసాధ్యం అనుకున్న వాళ్లు... మాతో కొద్ది రోజుల ప్రయాణం తర్వాత... ‘ఇదేమీ పెద్ద కష్టం కాదు. ఎక్కాలన్న తపన ఉంటే చేయి అందించే వాళ్లు చాలా మంది ఉన్నారు’ అంటూ భరోసా ఇచ్చే స్థాయికి రావడం చెప్పదగ్గ విషయం.

కొండ, బండ, అడవి...

ప్రతి కాలంలోనూ కొత్తగా కనిపిస్తూనే ఉంటాయి. ఆకురాలిన చెట్టు అందాన్ని, దానికి కింద పరుచుకున్న గలగలలను ఆస్వాదించని హృదయం ఉంటుందా? శీతకాలంలో రెమ్మ అంచున జాలువారడానికి సిద్ధంగా ఉన్న ముత్యం చుక్కను, పొగలు కక్కే పొగమంచులోనూ చెమటలు కక్కే శ్రమనీ ప్రేమించని మనుషులు ఉంటారా? ఉదయం వేళల్లో పక్షుల శబ్దాలు, అకస్మాత్తుగా దర్శనమిచ్చే నెమ్మళ్లు, అరుదుగానైనా కనిపించే అడవి పందులు... అవి విదిల్చి వెళ్లే ముళ్లు, జర జరా పాకే పాములు... ఎవరి దారి వాళ్లదే. వాటి ఉనికిని గౌరవిస్తూ, మన దారిన మనం సాగుతూ పోవడమే.

చివరిగా... కొండల్లోకి, కోనల్లోకి...

మనలోకి మనం తొంగిచూసుకునే అవకాశం, మనల్ని మనం ఆవిష్కరించకోవడానికి సమయాన్ని వెచ్చించడం. ఆరోగ్యం కోసం కొండలే అవసరం లేదనే వాళ్లకు... జట్టు బల ప్రదర్శనకు, సమిష్ఠి తత్వానికి అదో వేదిక అంటుంది మా బృందం. గుండె బలపడడానికి, ఊపిరి‘తిత్తులు’ మరింత విచ్చుకోవడానికి, మోకీళ్లను పట్టి ఉంచే కండరాలు గట్టిపడడానికి, సంక్లిష్ట సన్నివేశాల్లో నిబ్బరం కోల్పోకుండా ఉండడానికీ ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి చక్కగా ఉపయోగపడతాయన్నది మా అనుభవం. దీనిలో మరో మెట్టు ఎక్కడానికి మా బృందం కేరళలోని అగస్యకూడం ట్రెక్కింగ్ కు బయలుదేరింది. విశాఖ ఏజెన్సీలోని తూర్పు కనుమల్లో సరికొత్త ట్రెక్కింగ్ దారుల వెంట సాగాలన్న ఆకాంక్షను తీర్చుకోవడానికి నవంబరు చక్కటి కాలమని అనుకుంటున్నాం.

కేవలం కొండలు ఎక్కడంతోనే ఆగమండోయ్... వీలు చేసుకొని నదీ తీరం వెంబడి ఇసుక తిన్నెల్లో కనీసం 10 కి.మీ. నడక, ఏడాదికోసారి సముద్రపు ఒడ్డున విహరించడం, శ్రీశైలం మోటర్ సైకిల్ పై ప్రయాణం వంటివీ మా యాత్రల్లో భాగమే. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలు ట్రెక్కింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఆ క్రమంలో పర్యావరణానికి వారు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అది గమనించి మన కొండలు, అడవుల్లోకి ప్రయాణిస్తున్నప్పుడు బాధ గుండెల్ని మెలితిప్పుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, తాగిపడేసిన సీసాలతో వన్యప్రాణుల జీవితాలతో ఆడుకునే హక్కు మనకు లేదన్న విషయాన్ని ప్రభుత్వాలు నొక్కి చెప్పాలి. ట్రెక్కింగ్ కు వెళ్లే వాళ్లు, అడవి దారుల వెంట వెళ్లే వాళ్లూ ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మనం కుసింత వెనకబడే ఉన్నామని చెప్పడానికి ఏ మాత్రం సంకోచం లేదు. ఇది చెప్పిన తర్వాత మా ఆచరణ గురించి కూడా ఒక వాక్యం చెప్పాలి. మా వెంట తీసుకుని వెళ్లే ఏ ప్లాస్టిక్ కాగితమూ అడవిదారుల్లో కనిపించదు. అన్నీ మాతోపాటు కొండదిగాల్సిందే. ఎవరైనా కొత్తగా వచ్చినవాళ్లు వేసినా వెంటనే ఎవరో ఒకరు అది తప్పని చెపుతూ తీసి బ్యాగ్ లో వేసుకుంటారు. అందుకనే మా దారిలో మేం వదిలిన పాద ముద్రలు తప్ప మరేమీ కనిపించదు.

చివరిగా... ‘ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరి. రెండు లీటర్ల మంచి నీళ్లు మరిచిపోకండి. చిక్కీలు గట్రా... బ్యాక్ ప్యాక్ లో వేసుకోండి. కనీస ఫిట్ నెస్ లెవల్స్ ఉంటేనే ట్రెక్కింగ్ కు రండి. ఎవరి వ్యక్తిగత భద్రత, ఆరోగ్యానికి వాళ్లే బాధ్యులు. ఈ విషయంలో అడ్మిన్ బృందం ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత వహించదు. అన్యదా భావించవద్దు’... దీనిని అర్థం చేసుకుని 46 మంది సభ్యులున్న మాతో కలసి కొండదారుల వెంట వెళ్లడానికి సిద్ధమయ్యే సాహసికులకు మా సాదర స్వాగతం...

చిగురుపాటి సతీష్‌బాబు

7013727229

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్