నులక మంచంలో సేద తీరడం
కోడి కూతలతో నిద్ర లేవడం
చేద బాయిలోంచి నీళ్లు తోడడం
పిడక బొగ్గుతో పండ్లు తోమడం !
చిందు నాటకాల చమత్కారాలు
చిర్రగోనే ఆటల చిలిపిచేష్టలు
పానాదుల వెంట పండ్ల వేటలు
పూల బతుకమ్మ సింగిడి రంగులు !
వరి గొలుసులకు వేలాడే పిచ్చుకలు
చిలక కొట్టిన జామ పండ్ల రుచులు
మంచె ఎక్కి పక్షుల్ని తరమడాలు
చెరువుల్లో వచ్చీరాని ఈతల వెతలు !
కాల్చిన తాటిపండ్ల మధుర రసాలు
తాటి ముంజెలకు గౌడన్న ప్రసన్నాలు
తాటి గేగుల్లోని బహు తియ్యటి గుజ్జులు
ముళ్లు గుచ్చినా పరికి పండ్ల వేటలు !
ఊరంతా వావివరుసల అల్లికలు
సుఖదుఃఖాల్లో వాడంతా కోస్తాలు
వాగుల్లో చలమనీళ్ళ స్వచ్ఛ తేటలు
అలుగు దునికిన చెరువుల్లో చేపలు !
బడిలో చెప్రాసీని చూస్తేనే భయాలు
తప్పు చేస్తే పంతులు బెత్తం వాతలు
గోడ కుర్చీలతో గగ్గోలు పెట్టిన రోజులు
పొరపాట్లను దిద్దిన బెత్తంతో దెబ్బలు !
పాజీల్లో ఎరవేసి పట్టిన కౌజు పిట్టలు
గాలాల ఎరలు వేసి పట్టిన చేపలు
ఇంటి చుట్టూ కోళ్ల ఫ్యాషన్ పరెడ్లు
బర్రెపాల నురగలతో నిద్రలేచే ఊళ్లు !
కట్టెల పొయ్యి గంజి కూడా తియ్యన
పందిరి కింద గోలీల ఆటలు జోరున
పెరట్లో తిన్న టమాటా పండ్లు కమ్మన
కష్టసుఖాల కలబోత ఊరంతా చక్కన !
మధుపాళీ
9949700037









కామెంట్‌లు (0)