mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యూహాత్మక భాగస్వామ్యం.. వచ్చే ఏడాది భారత్‌ పర్యటనకు ట్రంప్ ..!

1 గంట క్రితం

Strategic partnership... Trump to visit India next year!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:01 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, వ్యూహాత్మక అంశాలను ఖరారు చేసేందుకు తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మార్కో రూబియో మాట్లాడుతూ .... ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధమే ఇరు దేశాల సంబంధాలకు ప్రధాన పునాది అని కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదిగిందని ప్రశంసించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా, వెనిజులా దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఇంధన సరఫరాలను పెంచడంపై దృష్టి సారించామని రూబియో స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేసే అరుదైన సామర్థ్యం భారతదేశానికి ఉండటం ఇరు దేశాల భాగస్వామ్యానికి మరింత బలాన్ని ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. "మేము వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కేవలం అంగుళాల దూరంలో ఉన్నాము. ఇది చాలా సానుకూలంగా జరుగుతోంది" అని రూబియో స్పష్టం చేశారని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. క్వాడ్ కూటమి గురించి కూడా రూబియో మాట్లాడుతూ .... త్వరలోనే క్వాడ్ సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మధ్య మరో ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ, వాణిజ్యం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత వంటి రంగాల్లో రెండు దేశాలూ మరింత సమన్వయంతో ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.


భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశకు చేరుకుందని భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. రెండు దేశాలు అపారమైన సామర్థ్యం కలిగిన సహజ భాగస్వాములని పేర్కొన్నారు. కేవలం కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉందని, త్వరలోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, ట్రంప్‌లు ఇద్దరూ ఒకే రకమైన దేశహిత దృక్పథాన్ని కలిగి ఉన్నారని గోర్ గుర్తుచేశారు.


డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారతదేశానికి రావడం ఇదే తొలిసారి కానుంది. గతంలో ఆయన 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రెండు దేశాల నాయకులు ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమ్మిట్ సందర్భంగా సమావేశమయ్యారు, ఇది గత 16 నెలల్లో వారి తొలి ద్వైపాక్షిక భేటీ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్