ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబందీ...?

21 నిమిషాల క్రితం

BANDHI-MAIN KATHA PHOTO2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:49 పూర్వాహ్నం | 8 నిమిషాల చదవడం

కేఫ్‌లో ఆ సాయంత్రం జనం ఎక్కువగా లేరు. బయట వర్షం పడుతోంది. గాజు అద్దాల మీదుగా జారుతున్న నీటి చారలను చూస్తూ రాఘవ కాఫీని మెల్లగా తాగుతున్నాడు. ఎదురుగా అతని స్నేహితుడు, న్యాయవాది శివరాం ప్రసాద్ పేపరు చదువుతున్నాడు. రాఘవకు ముప్పై అయిదేళ్లు. ఉన్నత విద్యావంతుడు. మంచి ఉద్యోగం చేయగల సామర్థ్యం ఉంది. పెళ్లి చేసుకోలేదు. వెనకా ముందూ ఎవరూ లేని ఆవారా జీవితం. కానీ అతను జీవితాన్ని ద్వేషించేవాడు కాదు. జీవితంలో మనుషులు నిర్మించుకున్న కొన్ని విలువలను మాత్రం తీవ్రంగా ప్రశ్నించేవాడు. అతనికి ఒక సిద్ధాంతం ఉండేది.

‘ఏ మనిషీ పుట్టుకతో మహాత్ముడు కాదు. పుట్టుకతో నేరస్తుడూ కాదు. అతను పెరిగిన వాతావరణం, ఆకలి, అవమానం, అవకాశం, అధికారం.. ఇవన్నీ కలిసి అతన్ని తయారుచేస్తాయి.’ అంటాడు.

అందుకే జైళ్లలో ఉన్న నేరస్తుల జీవిత చరిత్రలు చదివేవాడు. గొప్ప వ్యక్తుల జీవితాలూ చదివేవాడు. అతనికి విచిత్రమైన కలలు ఉండేవి. ఎప్పటికైనా ప్రపంచంలోని గొప్ప పుస్తకాలన్నీ ఒకేచోట ఉంచి, తనకంటూ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలి!, పియానో నేర్చుకోవాలి. వయోలిన్ వాయించాలి. గ్రీకు తత్వవేత్తలను మూలభాషలో చదవాలి. ఒకరోజు హిమాలయాల్లో ఒంటరిగా నెలరోజులు గడపాలి. ఇలా.. అంతలో శివరాం పేపరును మడిచి, టేబుల్ మీద పెట్టాడు. ‘రాఘవా.. ఇవాళ సుప్రీం కోర్టులో ఒక ముఖ్యమైన తీర్పు ఉంది.’

‘దేని గురించి?’

‘ముగ్గురిని హత్య చేసిన ఖైదీ. కింది కోర్టు ఉరిశిక్ష వేసింది. దాన్ని యావజ్జీవంగా మార్చాలా వద్దా అన్నది ఇవాళ తేలుతుంది.’ రాఘవ పేపరు తీసుకున్నాడు. అప్పుడే కేఫ్‌లోకి నరేంద్రవర్మ వచ్చాడు. అతను శివరాంకు స్నేహితుడు. పెద్ద వ్యాపారవేత్త. రాఘవకు కూడా కొద్దిపాటి పరిచయం ఉంది.

‘ఏమిటి అంత సీరియస్‌గా?’ అంటూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. శివరాం విషయం చెప్పాడు.

వర్మ నవ్వాడు. ‘ఇందులో చర్చేముంది? నా దృష్టిలో యావజ్జీవం కంటే ఉరే మంచిది.’ అన్నాడు.

రాఘవ తలెత్తి చూశాడు‘ఎందుకు?’ అన్నట్లు.

‘ఒక్కసారి ఆలోచించు. సంవత్సరాల తరబడి నాలుగు గోడల మధ్య బతకాలి. ప్రతి ఉదయం అదే గోడ. ప్రతి రాత్రీ అదే తలుపు. స్వేచ్ఛ లేదు. కుటుంబం లేదు. జీవితం లేదు. అలాంటి నరకం కంటే ఒక్క నిమిషంలో చనిపోవడం మంచిది.’

రాఘవ చిరునవ్వు నవ్వాడు.

‘నువ్వు మరణాన్ని చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు వర్మా.’

‘కాకపోతే అంత ఒంటరితనం భరించడం తేలికంటావా ?’

‘ప్రాణం ఉన్నంతకాలం అవకాశం ఉంటుంది.’

‘ఏ అవకాశం?’

‘మనిషి మారడానికి.’

వర్మ నవ్వేశాడు.

‘నాలుగు గోడల మధ్యనా?’

‘గోడలు శరీరాన్ని ఆపగలవు వర్మా. ఆలోచనను కాదు.’

‘పుస్తకాలలో బాగుంటాయి ఈ మాటలు.’ రాఘవ ముఖం గంభీరమైంది.

‘ఒక మనిషికి పుస్తకాలు ఇవ్వు. సంగీతం ఇవ్వు. ఆలోచించడానికి సమయం ఇవ్వు. అతను నాలుగు గోడల మధ్య ఉన్నా ప్రపంచాన్ని చూడగలడు.’ బలంగా అన్నాడు రాఘవ.

వర్మ కాఫీ కప్పును టేబుల్ మీద గట్టిగా పెడుతూ..‘ఐదేళ్లు ఉండు చూద్దాం. ఒక్క మనిషిని చూడకుండా. ఒక్కరితో మాట్లాడకుండా. ఐదేళ్లు పూర్తయ్యేలోపు తలుపు బద్దలు కొట్టి బయటకు వస్తావు. లేకపోతే పిచ్చివాడివవుతావు.’ అన్నాడు.

‘ఐదేళ్లు ఎందుకు? పదేళ్లు ఉంటాను.’ రాఘవ వెంటనే అన్నాడు.

‘రాఘవా!’ అని శివరాం ఉలిక్కిపడ్డాడు.

కానీ వర్మలో వ్యాపారవేత్త అహం మేల్కొంది.

‘పదేళ్లా?’

‘అవును.’

‘పదేళ్లు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండగలవా?’ ఉక్రోషంగా అడిగాడు.

‘ఉంటాను.’ నమ్మకంగా అన్నాడు రాఘవ.

వర్మ క్షణం ఆలోచించాడు.

‘ఉంటే... ఏడాదికి పది లక్షలు. పదేళ్లకు కోటి రూపాయలు.’ ఇస్తాను..! గర్వంగా అన్నాడు వర్మ.

టేబుల్ దగ్గర నిశ్శబ్దం.

శివరాం ఇద్దరినీ చూశాడు.

‘మీరు మాట్లాడుతున్నది ఆట కాదు. జీవితంలో పదేళ్లు.’

‘అందుకే చేస్తున్నాను.’ రాఘవ అన్నాడు.

వర్మ చేయి ముందుకు చాచాడు.‘ఒప్పందమా?’. రాఘవ అతని చేతిని అందుకున్నాడు. ‘ఒప్పందం.’ అంటూ.


శివరాం ప్రసాద్ సమక్షంలో ఒప్పందం తయారైంది. వర్మ ఇంటి వెనుక భాగంలో ఉన్న విశాలమైన అవుట్‌హౌస్‌లో రాఘవ పదేళ్లు ఉండాలి.

అతను బయటకు రాకూడదు. ఎవరినీ ప్రత్యక్షంగా కలవకూడదు. టెలిఫోన్, రేడియో, టెలివిజన్ ఉండకూడదు. కానీ అతను కోరిన పుస్తకాలు, ఆహారం, సంగీత వాయిద్యాలు, రాత సామగ్రి అన్నీ వర్మ సమకూర్చాలి. పదేళ్లు పూర్తయిన క్షణానికి రాఘవ అక్కడే ఉంటే వర్మ కోటి రూపాయలు ఇవ్వాలి. ఒక్క నిమిషం ముందుగా బయటకు వచ్చినా.. పందెంలో ఓడిపోయినట్టే. సంతకాలు పూర్తయ్యాయి. శివరాం పెన్ను మూసేస్తూ అన్నాడు. ‘ఈ కాగితం మీద రెండు సంతకాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఇద్దరూ పెట్టింది సంతకాలు కాదు. మీ జీవితాల్లో పదేళ్లు.’ ఎవరూ సమాధానం చెప్పలేదు.


మొదటి కొన్ని నెలలు రాఘవకు నరకంగానే అనిపించాయి. మనిషి ముఖం చూడాలని అనిపించేది.ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించేది. అర్థరాత్రి లేచి తలుపు దగ్గరకు వచ్చేవాడు. తలుపు తెరిస్తే పందెం ముగుస్తుంది.. ఆ అవుట్ హౌస్ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది మరి. ఎన్నోసార్లు చేతిని తలుపు గడియ మీద పెట్టాడు.. కానీ తెరవలేదు. పుస్తకాలు అడిగాడు. మొదట నవలలు. టాల్‌స్టాయ్, దోస్తయెవ్‌స్కీ, చెకోవ్, హ్యూగో, డికెన్స్.. ఒక జీవితంలో ఉండాల్సినంతమంది మనుషులను పుస్తకాలలో కలిశాడు. కొన్ని నెలలకు వయోలిన్ తెప్పించుకున్నాడు. రాత్రివేళ అవుట్‌హౌస్ నుంచి వినిపించే అపస్వరాలను వర్మ నవ్వుకుంటూ వినేవాడు. ‘రాఘవకు పిచ్చెక్కుతోంది,’ అనుకునేవాడు. కానీ ఆ అపస్వరాలు క్రమంగా సంగీతంగా మారాయి.


కాల చక్రంలో రెండేళ్లు వెనక్కి వెళ్లి పోయాయి..

రాఘవ చరిత్ర చదివాడు.. రాజులు ఎలా సామ్రాజ్యాలు నిర్మించారో చదివాడు...ఆ సామ్రాజ్యాల కోసం ఎంతమంది చనిపోయారో చదివాడు.. యుద్ధాలు చదివాడు.. మతాలు చదివాడు.. విప్లవాలు చదివాడు. ఒకరోజు వర్మకు చిన్న చీటీ వచ్చింది. ‘ఇంకా చరిత్ర పుస్తకాలు పంపించు. ముఖ్యంగా ఓడిపోయినవారి చరిత్ర.’

వర్మ ఆశ్చర్యపోయాడు. ‘ఓడిపోయినవారి చరిత్రా?’ అనుకున్నాడు.

ఐదో సంవత్సరం రాఘవ తత్వశాస్త్రంలోకి వెళ్లిపోయాడు. బుద్ధుడు, సోక్రటీస్, మార్కస్ ఆరేలియస్, ఉపనిషత్తులు, భగవద్గీత, నీషే, కామూ, ప్రపంచం మనిషిని ఎలా చూసిందో చదివాడు, మనిషి ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడో చదివాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగత లైబ్రరీ నిర్మించాలని కలలు కన్న రాఘవకు ఒక విచిత్రమైన విషయం అర్థమవుతోంది. పుస్తకాలను సొంతం చేసుకోవడం కంటే, వాటిలోని జ్ఞానం మనల్ని సొంతం చేసుకోవడం గొప్పదని.


తన బందిఖానా జీవితానికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు రాఘవ చాలా తక్కువ పుస్తకాలు అడుగుతున్నాడు. కొన్ని రోజులు ఒక్క పుస్తకం కూడా అడగలేదు. కిటికీ దగ్గర కూర్చుని చెట్టును చూస్తూ గంటలు గడిపేవాడు. ఒకప్పుడు ప్రపంచాన్ని తెలుసుకోవాలని తపించిన మనిషి ఇప్పుడు తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో బయట ప్రపంచంలో నరేంద్రవర్మ జీవితం మారుతోంది. అతను చేసిన రెండు భారీ పెట్టుబడులు నష్టపోయాయి. ఒక కంపెనీ మూతపడింది. బ్యాంకు అప్పులు పెరిగాయి. ఆస్తులు అమ్మాల్సి వచ్చింది. ఒకప్పుడు కోటి రూపాయలు అతనికి పెద్ద విషయం కాదు.

ఇప్పుడు అదే కోటి అతని జీవితాన్ని కూల్చగల మొత్తం.


పందెం ముగియడానికి ఇంకా మూడు రోజులు. నరేంద్రవర్మ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. టేబుల్ మీద పాత ఒప్పంద కాగితాలు కనిపించాయి. అందులో రాఘవ సంతకం, తన సంతకం. కోటి రూపాయలు. వరమ్మ చేతులు వణికాయి.

‘వాడు గెలిస్తే.. నా పని ముగిసిపోతుంది.’ మొదటిసారి ఒక భయంకరమైన ఆలోచన అతని మనసులోకి వచ్చింది.

రాఘవ లేకపోతే? వర్మ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు.

‘ఏమిటి నేను ఆలోచిస్తున్నది?’

కానీ డబ్బు భయం మళ్లీ మాట్లాడింది. పది సంవత్సరాల క్రితం కేఫ్‌లో ఒక నేరస్తుడి ఉరిశిక్ష గురించి మాట్లాడిన మనిషి.. ఇప్పుడు తానే ఒక హత్య గురించి ఆలోచిస్తున్నాడు.


చివరి రాత్రి పందెం పూర్తవడానికి ఇంకా అరగంట ఉంది. వర్మ నిశ్శబ్దంగా అవుట్‌హౌస్‌లోకి ప్రవేశించాడు. తాళం అతని దగ్గరే ఉంది. లోపల దీపం వెలుగుతోంది.

రాఘవ కనిపించలేదు. బాత్రూమ్‌లో నీటి శబ్దం వినిపిస్తోంది. వర్మ టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక కాగితం ఉంది. పైన.. ‘నరేంద్రవర్మకు..’అని రాసి ఉంది. వర్మ చదవడం మొదలుపెట్టాడు.


‘వర్మా,

పదేళ్ల క్రితం నువ్వు నాకు కోటి రూపాయలు ఇస్తానన్నప్పుడు, ఆ డబ్బుతో నేను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగత గ్రంథాలయం నిర్మించాలని అనుకున్నాను. సంగీత మందిరం నిర్మించాలని అనుకున్నాను. ప్రపంచమంతా తిరగాలని అనుకున్నాను. కానీ ఈ పదేళ్లలో ఒక విచిత్రం జరిగింది. నేను ప్రపంచాన్ని చూడలేదు. కానీ ప్రపంచమంతా నా గదిలోకి వచ్చింది. పుస్తకాల ద్వారా రాజులతో మాట్లాడాను. ఖైదీలతో ఏడ్చాను. యుద్ధాల్లో చనిపోయినవారిని చూశాను. ప్రేమించినవారిని చూశాను. మోసం చేసినవారిని చూశాను. దేవుణ్ణి వెతికినవారినీ చూశాను. దేవుడు లేడని వాదించినవారినీ చూశాను. చివరకు ఒక విషయం అర్థమైంది. మనిషి జీవితంలో చాలా భాగం ‘నాది’ అనే ఒక్క పదం చుట్టూ తిరుగుతోంది. నా డబ్బు, నా ఇల్లు, నా పేరు, నా విజయం, నా కుటుంబం, నా జీవితం, ఈ “నా” అనే పదాన్ని కాపాడుకోవడానికి మనిషి తన జీవితాన్నే కోల్పోతున్నాడు. పదేళ్ల క్రితం నువ్వు నన్ను ఈ గదిలో బంధించావని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది.

నేను ఈ గదిలో బందీగా ఉన్నాను..! నువ్వు నీ సంపదలో బందీగా ఉన్నావు!. నా గదికి తాళం నీ దగ్గర ఉంది. నీ గదికి తాళం ఎక్కడుందో నాకు తెలియదు.

నువ్వు నాకు ఇవ్వాల్సిన కోటి రూపాయలు నాకు అవసరం లేదు. ఈ ఒప్పందం పూర్తవడానికి పది నిమిషాల ముందు నేను ఈ గది నుంచి బయటకు వెళ్లిపోతాను.

అంటే చట్టపరంగా నేను ఓడిపోయినట్టే. నీ కోటి రూపాయలు నీవే.

కానీ వర్మా.. నేను ఈ పదేళ్లలో తెలుసుకున్న గొప్ప సత్యం ఒక్కటే. మనిషికి ఎంత ఉందన్నది సంపద కాదు. ఎంత లేకపోయినా ప్రశాంతంగా ఉండగలడన్నదే సంపద.’

- రాఘవ.


వర్మ చేతిలో కాగితం వణికిపోయింది. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. తన జేబులోకి చేయి పెట్టాడు. రాఘవను చంపడానికి తెచ్చుకున్న చిన్న కత్తి చేతికి తగిలింది.

దాన్ని బయటకు తీసి చూశాడు. కొన్ని క్షణాల పాటు స్థంభించిపోయాడు. తర్వాత కత్తిని నేలమీద వదిలేశాడు. లోపల నుంచి బాత్రూమ్ తలుపు తెరుచుకుంది.

రాఘవ బయటకు వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. పదేళ్ల క్రితం చూసిన రాఘవ ఇతను కాదు. జుట్టులో తెలుపు వచ్చింది. ముఖం చిక్కిపోయింది.

కానీ కళ్లలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. రాఘవ నేలమీద ఉన్న కత్తిని చూశాడు. తర్వాత వర్మను చూశాడు. ఏమీ అడగలేదు. ఆ మౌనమే వర్మను మరింత కుంగదీసింది.

‘రాఘవా...’ అతని గొంతు వణికింది.

‘నన్ను క్షమించు.’

రాఘవ ప్రశాంతంగా అడిగాడు.

‘దేనికి?’

వర్మకు మాట రాలేదు. కొద్దిసేపటి తర్వాత అన్నాడు. ‘నిన్ను చంపాలని వచ్చాను.’ రాఘవ ముఖంలో ఆశ్చర్యం లేదు. వర్మ కన్నీళ్లు తుడుచుకున్నాడు.

‘కోటి రూపాయలు ఇవ్వలేనేమో అన్న భయం... నన్ను హంతకుడిగా..’ రాఘవ అతని దగ్గరకు వచ్చాడు.

‘పదేళ్ల క్రితం కేఫ్‌లో నేను ఏమన్నానో గుర్తుందా వర్మా?’

వర్మ తలెత్తాడు. ‘ఏ మనిషీ పుట్టుకతో నేరస్తుడు కాడని.’

వర్మ కళ్లలోకి చూస్తూ రాఘవ అన్నాడు. ‘ఈ రాత్రి నువ్వే దానికి సాక్ష్యం.’

వర్మ తలదించుకున్నాడు. ‘అంటే నేను నేరస్తుడినేనా?’

‘కాదు..’ రాఘవ నేలమీద ఉన్న కత్తిని చూపించాడు.

‘నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ స్వభావం కాదు. నీ భయం. నీ పరిస్థితి. నీ డబ్బు మీదున్న మమకారం.’

‘కానీ నేను నిన్ను చంపాలని అనుకున్నాను.’ అన్నాడు వర్మ.

‘ఆలోచనకూ చర్యకూ మధ్య ఒక చిన్న ప్రదేశం ఉంటుంది వర్మా. అక్కడే మనిషి ఇంకా మనిషిగా మిగిలే అవకాశం ఉంటుంది.’

వర్మ మౌనంగా ఏడుస్తున్నాడు. గోడ గడియారం శబ్దం వినిపిస్తోంది. పందెం పూర్తవడానికి ఇంకా పన్నెండు నిమిషాలు.

రాఘవ తన చిన్న సంచి తీసుకున్నాడు. వర్మ ఆశ్చర్యంగా చూశాడు.

‘ఎక్కడికి?’

‘బయటకు.’

‘ఇంకా పన్నెండు నిమిషాలే ఉన్నాయి రాఘవా! పదేళ్లు ఉన్నావు. మరో పన్నెండు నిమిషాలు ఉండలేవా?’

రాఘవ నవ్వాడు.‘అందుకే వెళ్తున్నాను.’

‘ఎందుకు?’

‘పదేళ్లు ఇక్కడ ఉండటం కంటే... ఈ పన్నెండు నిమిషాల ముందు వెళ్లిపోవడమే నా పందెం.’

వర్మకు అర్థం కాలేదు. రాఘవ తలుపు దగ్గరకు నడిచాడు.

‘పదేళ్ల క్రితం నేను కోటి రూపాయల కోసం ఈ గదిలోకి వచ్చాను. ఇప్పుడు అదే కోటి రూపాయల కోసం మరో పన్నెండు నిమిషాలు ఇక్కడ ఉంటే...’

ఒక్క క్షణం ఆగాడు.

‘ఈ పదేళ్లలో నేను చదివిన పుస్తకాలన్నీ ఓడిపోయినట్టే.’ వర్మ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. రాఘవ తలుపు తెరిచాడు. బయట తెల్లవారుతోంది.

పదేళ్ల తర్వాత మొదటిసారి బయట గాలి అతని ముఖాన్ని తాకింది. రాఘవ కళ్లు మూసుకున్నాడు. లోతుగా శ్వాస తీసుకున్నాడు. వర్మ వెనుక నుంచి అడిగాడు.

‘ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు?’

రాఘవ వెనక్కి తిరగలేదు.

‘తెలియదు.’

‘ఏం చేస్తావు?’

ఈసారి రాఘవ వెనక్కి తిరిగి చిరునవ్వు నవ్వాడు. ‘ఇంతకాలం పుస్తకాలలో మనుషులను చదివాను వర్మా...’

కొద్దిగా ఆగాడు. ‘ఇక మనుషుల మధ్యకు వెళ్లి మనిషిని చదువుతాను.’ రాఘవ బయటకు నడిచాడు.

వర్మ ఒంటరిగా నిలబడిపోయాడు. టేబుల్ మీద ఒప్పందం ఉంది. నేలమీద కత్తి ఉంది. చేతిలో రాఘవ ఉత్తరం ఉంది. గడియారం పన్నెండు దాటింది. పందెం ప్రకారం.. నరేంద్రవర్మ గెలిచాడు. కోటి రూపాయలు అతనివే. కానీ అతనికి మొదటిసారి తన విజయం ఓటమిలా అనిపించింది. అతను నెమ్మదిగా కుర్చీలో కూర్చున్నాడు. రాఘవ చివరి మాటలు ఇంకా గదిలో వినిపిస్తున్నట్టే ఉన్నాయి. ‘నేను ఈ గదిలో బందీగా ఉన్నాను. నువ్వు నీ సంపదలో బందీగా ఉన్నావు.’’

వర్మ కిటికీ దగ్గరకు వెళ్లాడు. దూరంగా రాఘవ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని చేతిలో కోటి రూపాయలు లేవు. ఆస్తి లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు.

అయినా అతని నడకలో స్వేచ్ఛ ఉంది. వర్మ తన విశాలమైన ఇంటివైపు చూశాడు. ఆస్తులు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వ్యాపారాలు ఉన్నాయి. కానీ మొదటిసారి తన చుట్టూ కనిపించని గోడలు ఉన్నట్టనిపించింది. వర్మ చేతిలోని ఒప్పందాన్ని చింపేశాడు. కిటికీలోంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ చాలాసేపు అలాగే నిలబడిపోయాడు.


కూచి రామాంజనేయులు

95818 53636

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్