ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలోకల్‌ టాలెంట్‌తోనే ‘కొత్త సినిమా’ తీశాం

17 నిమిషాల క్రితం

azar director .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 09:40 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సినిమా అంటే హైదరాబాద్‌.. స్టూడియోలు, భారీ సెట్లు, స్టార్‌ హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలు.. సాధారణంగా తెలుగు సినిమా గురించి మాట్లాడినప్పుడు కనిపించే దృశ్యం ఇదే. అయితే సినిమా తీయాలంటే హైదరాబాద్‌కే వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతిభ ఉంటే పల్లె గల్లీల నుంచైనా వెండితెరపై అడుగుపెట్టొచ్చునని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణా రాష్ట్రం పెద్దపల్లి జిల్లా రామగుండం–గోదావరిఖని ప్రాంతానికి చెందిన యువ దర్శకుడు అజర్‌. సింగరేణి బొగ్గుబావుల నేల నుంచి వచ్చిన ఆయన స్థానిక ప్రతిభను గుర్తించి, వారికి అవకాశం కల్పిస్తూ రూపొందించిన చిత్రమే ‘కొత్త సినిమా’. టైటిల్‌లోనే కొత్తదనం ఉన్న ఈ చిత్రం నిర్మాణంలోనూ అంతకుమించిన ప్రయోగం కనిపిస్తుంది. గోదావరిఖని, రామగుండం పరిసర ప్రాంతాల్లో ఆడిషన్స్‌ నిర్వహించి, దాదాపు వంద మందికి పైగా కొత్త నటీనటులను ఎంపిక చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక ప్రాంతానికి చెందిన ప్రతిభకు సినిమా వేదికగా మారడం ఈ చిత్రంలోని ప్రధాన ప్రత్యేకత.


‘మన ఊర్లోనే ఉంటూ.. మన ఊరి వాళ్లతోనే సినిమా తీయొచ్చు’ అనే ఆలోచన అజర్‌ ప్రయాణానికి పునాది. కొత్తవాళ్లకు అవకాశాలు రావడం లేదని బాధపడకుండా, అవకాశాల కోసం ఎదురుచూడకుండా తానే ఒక వేదికను సృష్టించుకున్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారితో పాటు సినిమా నిర్మాణంలోని వివిధ సాంకేతిక విభాగాలపై ఆసక్తి ఉన్న యువతను కూడా ప్రోత్సహించారు. “పట్నంలోనే ఉంటదా కళామతల్లి.. జర వెతికి చూడు ఉంటుంది గల్లీ గల్లీ” అనే భావనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ‘కొత్త సినిమా’. సినిమా అనేది ఒక నగరానికే పరిమితమైన కళ కాదని, ప్రతి ప్రాంతంలోనూ కథలు ఉంటాయని, ప్రతి మనిషిలోనూ ఒక ప్రతిభ దాగి ఉంటుందని అజర్‌ నమ్ముతారు.

బొగ్గుబాయి నుంచి సినిమా ప్రపంచానికి

అజర్‌ ప్రయాణంలో మరో ప్రత్యేకత ఉంది. సింగరేణి ప్రాంతానికి చెందిన టెక్నీషియన్‌గా పనిచేస్తూనే సినీ రంగంపై ఉన్న ఆసక్తితో తన ప్రయాణాన్ని కొనసాగించారు. వందల మీటర్ల లోతులో బొగ్గును వెలికితీసే నేల నుంచి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మేము కింద స్థాయి నుంచి వచ్చామని చాలామంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి.. భూమి లోతుల్లోంచి, బొగ్గుబాయి నుంచి వచ్చాం. చీకటిలో బొగ్గును వెలికితీసే ప్రాంతం నుంచి వెలుగు పంచేందుకు వచ్చాం అని అజర్‌ చెప్పే మాటల్లో ఆయన నేపథ్యం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తాయి. సింగరేణి కార్మిక కుటుంబాల జీవనాన్ని దగ్గరగా చూసిన అనుభవం ఆయన ఆలోచనలకు బలమైంది. తన ప్రాంతంలోని సామాన్య ప్రజల జీవితాలు, వారి కలలు, వారి ప్రతిభకు సినిమాలో చోటు కల్పించాలనే పట్టుదలతో ముందుకు సాగారు.

కథే హీరో.. ప్రతిభే బలం

పెద్ద హీరోలు లేకపోయినా కథలో బలం ఉంటే ప్రేక్షకులను మెప్పించొచ్చునని అజర్‌ నమ్మారు. అదే నమ్మకంతో కొత్త నటీనటులతో ‘కొత్త సినిమా’ను రూపొందించారు. సురేశ్‌, రాకేష్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంతో పాటు ఎడిటింగ్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. మహమ్మద్‌ వాసిమ్‌ అక్రమ్‌, సాగి సుధీర్‌రావు, యడండ్ల సతీష్‌యాదవ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఒకే వ్యక్తి కథ నుంచి ఎడిటింగ్‌ వరకు పలు బాధ్యతలు చేపట్టడం వెనుక తన ఆలోచనను నూర్తిస్థాయిలో తెరపైకి తీసుకురావాలనే పట్టుదల ఉందని అజర్‌ చెబుతున్నారు.

మూడేళ్ల కష్టం

‘కొత్త సినిమా’ ఒక్కరోజులో పుట్టిన ఆలోచన కాదు. దాదాపు మూడేళ్లుగా చిత్రబృందం ఈ సినిమా కోసం కష్టపడింది. కొత్తవాళ్లతో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు తొలుత చాలామంది నమ్మలేదని అజర్‌ చెబుతున్నారు. ‘కొత్తవాళ్లం కదా.. ఎవరూ నమ్మలేదు. అయినా మా ఊర్లోనే ఆడిషన్స్‌ నిర్వహించి, టాలెంట్‌ ఉన్నవారిని ఎంపిక చేసుకున్నాం. సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం’ అని ఆయన అంటున్నారు. ఆర్థికంగా, సాంకేతికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా, వెనక్కి తగ్గకుండా చిత్రబృందాన్ని ముందుకు నడిపించారు.

కల కోసం తండ్రి త్యాగం

అజర్‌ సినీ ప్రయాణంలో ఆయన తండ్రి హుస్సేన్‌ పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. సింగరేణి ఉద్యోగిగా నాలుగు దశాబ్దాలపాటు కష్టపడి సంపాదించిన డబ్బును తన కుమారుడి కల కోసం ఖర్చు చేయడం ఈ ప్రయాణంలో కీలకమైన మలుపు. తన కలను నమ్మిన తండ్రి పీఎఫ్‌ డబ్బులను కూడా సినిమా నిర్మాణానికి ఉపయోగించారని ప్రచార కార్యక్రమాల్లో అజర్‌ భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ‘మా నాన్న హుస్సేన్‌గారు రియల్‌ హీరో. తన కొడుకు కలను నమ్మి డబ్బు ఖర్చు పెట్టి రిస్క్‌ చేశారు’ అని అన్నారు. తెరపై కనిపించేది సినిమా అయినా, దాని వెనుక కుటుంబం, స్నేహితులు, స్థానిక యువత, ఎన్నో ఆశలు, మరెన్నో త్యాగాలు ఉన్నాయని ఈ ప్రయాణం చెబుతోంది.

‘వై ఇన్‌ హైదరాబాద్‌.. వై నాట్‌ ఇన్‌ అవర్‌ ప్లేస్‌’

సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ‘వై ఇన్‌ హైదరాబాద్‌.. వై నాట్‌ ఇన్‌ అవర్‌ ప్లేస్‌’ అనే కాన్సెప్ట్‌ను తీసుకురావడం అజర్‌ ఆలోచనలోని ప్రత్యేకతను చాటింది. ‘హైదరాబాద్‌లోనే ఎందుకు? మా ఊర్లో ఎందుకు కాదు?’ అనే ప్రశ్నకు ఈ కార్యక్రమం ఒక సమాధానంగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్‌ కంటెంట్‌, పోస్టర్లను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆవిష్కరించారు. ‘మేము కూడా సినిమా తీసినంరో’ పాట లాంచ్‌ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని, చిత్రబృందాన్ని అభినందించారు. గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీ కేంద్రంగా ‘అజర్‌ సినీ అరేనా’ పేరుతో సొంత ప్రొడక్ష‍న్‌, క్రియేటివ్‌ హౌస్‌ను కూడా నడుపుతూ సినీ రంగానికి కొత్తతరాన్ని పరిచయం చేస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ‘కొత్త సినిమా’ త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

-యడవల్లి శ్రీనివాసరావు​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్