ఆకాశం చిల్లులు పడిందేమో అన్నట్లుగా జోరున కురుస్తున్న వర్షం. కోనసీమలోని ఆ పాత పెంకుటిల్లు తడి మట్టి వాసనను గతకాలపు జ్ఞాపకాలను పులుముకుని నిశ్శబ్దంగా ఉంది. తండ్రి కూర్చునే మడత కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు అజయ్. తన తండ్రి చనిపోయి పదిహేను రోజులు అవుతుంది. ఆ ఇంటి మట్టి గోడలకు తండ్రి సూర్యప్రకాశరావు శ్వాస ఇంకా అంటుకునే ఉందేమో అన్న భ్రమ కలుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు అజయ్. నాన్న మరణవార్త విని వచ్చాడు. నాన్న జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నాడు. అమ్మ శోకాన్ని తీర్చలేకపోతున్నాడు. ఆలోచిస్తూ ఉంటే అతని దృష్టి గదిలో మూలన ఉన్న ఇనుప పెట్టె మీద పడింది. దగ్గరకెళ్ళి దాని తాళం తీస్తున్నప్పుడు కలిగిన కీచుమనే శబ్దం అజయ్ గుండెలో ఒక తెలియని గుబులును రేపింది. పెట్టె మూత తెరుచుకోగానే దశాబ్దాల కాలం నాటి నిశ్శబ్దం ఒక్కసారిగా గాలిలోకి పరిమళంలా విరజిమ్మింది. పైన కొన్ని పాత రేషన్ కార్డులు, పసుపు రంగులోకి మారిన కరెంటు బిల్లులు, నాన్న జాగ్రత్తగా దాచుకున్న అజయ్ చిన్ననాటి స్కూలు ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయి. వాటన్నింటి మధ్యన నల్లటి బైండింగ్‌తో, అంచులు అరిగిపోయిన ఒక పాత డైరీ దర్శనమిచ్చింది.
అది సూర్యప్రకాశరావు అంతరంగ ప్రపంచానికి మూసి ఉన్న తలుపు. అజయ్ వణుకుతున్న చేతులతో దానిని తెరిచాడు. మొదటి పేజీలో అది అజయ్ పదో తరగతి ఫలితాలు వచ్చిన రోజు. అజయ్ కళ్ళు పెద్దవి చేశాడు. ‘ఈ రోజు అజయ్ గాడు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. వాడు కోరుకున్న హీరో రాయల్ సైకిల్ కొనివ్వాలి. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే కుదరదన్నారు. వాడి కళ్లల్లో ఆనందం చూడాలంటే నా పాత అట్లాస్ సైకిల్ అమ్మేయక తప్పదు. అది అమ్మితే నేను ఆఫీసుకి రోజూ ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. పర్వాలేదు.. తండ్రి నడిస్తేనే కదా కొడుకు పరిగెత్తేది? నా కాళ్ల నొప్పులు వాడి కలల కంటే పెద్దవి కావు...’ అని చదివిన అజయ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ అక్షరాలు కేవలం సిరా చుక్కలు కావు. తన తండ్రి పదిహేనేళ్ల క్రితం చిందించిన రక్తపు చుక్కలని అతనికి అర్థమైంది.
అప్పట్లో నాన్న తన సైకిల్ "దొంగిలించబడింది" అని చెప్పారు. కానీ, అది అబద్ధం అని ఇప్పుడు తెలిసింది. అజయ్ మనసు ముక్కలైంది. ఆ డైరీ పేజీలు తిరగేస్తున్న కొద్దీ అజయ్ గుండె భారం పెరుగుతోంది. పేజీలు తిరగేస్తుంటే నాటి రాతలు అజయ్ ప్రాణాన్ని పిండేశాయి. అది అతను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు.
‘అజయ్ కి ఫీజు కట్టడానికి ఇంకా యాభై వేలు తక్కువయ్యాయి. డాక్టర్ గారు మాత్రం ''గుండె ఆపరేషన్ వెంటనే చేయించుకోకపోతే ప్రమాదం. మందులు అస్సలు మానవద్దు``అని గట్టిగా హెచ్చరించారు. ఆలోచించాను.. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయినా పర్వాలేదు కానీ, వాడి చదువు మధ్యలో ఆగిపోకూడదు. ఈ నెల నుంచి మందులు ఆపేస్తున్నాను. ఆ డబ్బుతో వాడి ఫీజు కడతాను. నా ఊపిరి కంటే వాడి డిగ్రీ పట్టా నాకు ఎక్కువ ప్రాణవాయువునిస్తుంది.’ అని రాసుకున్న వాక్యాలు అజయ్ చదివి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
తండ్రి తన ముందు చిరునవ్వుతో తిరుగుతూ, లోపల గుండె నొప్పితో ఎంత విలవిల్లాడి ఉంటారో? ఊహించుకుంటే అతనికి ఊపిరి ఆగిపోయినంత పని అయింది. కొన్ని పేజీలు తిప్పాడు. చదవలేకపోతున్నాడు. బయట వర్షం హోరు తగ్గుతోంది._కానీ, అజయ్ కళ్లల్లో వర్షం ఆగడం లేదు. అప్పుడు తండ్రి పాలిపోయిన ముఖంతో ఉండేవారు, ఆయాసపడుతూ నడిచేవారు. ‘ఏమైంది నాన్న?’ అని అడిగితే, ‘వయసు పైబడుతోంది కదరా... ఆ మాత్రం అలసట ఉంటుందిలే’ అని నవ్వేసేవారు. ఆ నవ్వు వెనుక ఎంతటి మరణవేదనను ఆయన భరించారో ఇన్నాళ్లకు డైరీ సాక్షిగా బయటపడింది.
‘అజయ్ ల్యాప్ టాప్ కావాలని అడిగాడు. డబ్బులు లేవని చెప్పలేను. పార్వతి తన మెడలో ఉన్న గొలుసు తీసి నా చేతిలో పెట్టింది. అది వద్దని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నా దగ్గర వాడి చదువుకు కావాల్సినంత సంపాదన లేదు. నా భార్య నగలను అమ్ముతున్నందుకు మనసు విలవిల్లాడినా, అజయ్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని ఇంటికి వచ్చే రోజు ఆ నగలే కాదు.. ఉద్యోగంలో చేరాక _అంతకు మించిన వెలుగు మా ఇంట్లో ఉంటుందని నన్ను నేను ఓదార్చుకున్నాను.’
అజయ్ ఆ వాక్యాలను చదువుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు తనకు కొత్త ల్యాప్‌టాప్ కావాలని మారం చేసినప్పుడు.. నాన్న మారుమాట్లాడకుండా కొనిచ్చారు. అదంతా అమ్మ మెడలోని గొలుసును తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ము అని అప్పుడు అజయ్‌కి తెలియదు. ఆ ఇంట్లో అమ్మ మెడ ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు. కానీ ఆ నాలుగేళ్లు అమ్మ కేవలం నల్లపూసల తాడుతోనే సరిపెట్టుకున్న దృశ్యం ఇప్పుడు అజయ్ కళ్లముందు కదలాడింది.
తండ్రి చనిపోవడానికి వారం రోజుల ముందు రాసిన ఆఖరి వాక్యాలు అజయ్ ని నిలువునా కదిలించాయి. అక్షరాలు _వణికినట్టు రాసాడు - ‘అజయ్.. నీకు ఆస్తులేమీ ఇవ్వలేకపోతున్నాను. నిన్ను ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దడమే నేను సంపాదించిన ఏకైక సంపద. నన్ను క్షమించు.’ అజయ్ ఆ డైరీని గుండెలకు హత్తుకుని బోరున విలపించాడు. తండ్రి అంటే కేవలం భౌతిక సంపదను లెక్కలు చూసే యంత్రం కాదు. తన ఆయుష్షును కరిగించి, పిల్లల భవిష్యత్తుకు వెలుగునిచ్చే కొవ్వొత్తి అని అతనికి బోధపడింది. వెలుపల వర్షం వెలిసింది. ఆకాశంలో మబ్బులు విడిపోయి ఎండా వస్తోంది. అజయ్ గదిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లాడు. అజయ్ చేతిలో డైరీ చూసి ఆమె కళ్లల్లో కూడా కన్నీళ్లు కనిపించాయి. డైరీ గట్టిగా పట్టుకుని ఏడ్చాడు అజయ్.
‘చూశావా అజయ్! మీ నాన్న అంటే కేవలం ప్రతీ దానికి లెక్కల ఖర్చుల మాస్టారు అనుకున్నావు. ఆయన నీ కోసం తన ఆరోగ్యాన్ని, ఆఖరికి ఆయుష్షును కూడా ఎలా ఫణంగా పెట్టారో చూశావా?’ అంది. అజయ్ తన తండ్రి ఫోటో వైపు చూశాడు. ఆ ఫోటోలోని సూర్యప్రకాశరావు కళ్లల్లో ఒక విధమైన తృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో అజయ్ భార్య సుమ, ఇద్దరు పిల్లలు చింటూ, నిత్యలు గదిలోకి వచ్చారు. కన్నీళ్లతో ఉన్న అజయ్‌ని చూసి సుమ కంగారుగా దగ్గరకు వచ్చింది.
అజయ్ ఆ డైరీని సుమకు చూపిస్తూ నాన్న త్యాగాన్ని వివరించాడు. అది విన్న సుమ కళ్లు కూడా చెమర్చాయి.
‘మనం నాన్నకు ఏమిచ్చాం సుమా? ఆయన మన కోసం ప్రాణాలే ఫణంగా పెడితే, మనం కేవలం ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని గర్వపడ్డాం’ అన్నాడు అజయ్ ఆవేదనగా. ఆలోచనలో పడ్డాడు అజయ్. ఒక నిర్ణయానికి వచ్చాడు. తన తండ్రి త్యాగానికి అర్థం చేకూరాలంటే కేవలం తను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా డబ్బు సంపాదించడం సరిపోదు. తన ఇద్దరు పిల్లల చేతులు పట్టుకుని నాన్న ఫోటో ముందు నిలబడ్డాడు.
‘నాన్నలారా! మీ తాతయ్య మనకి కోట్లు ఇవ్వలేదు. కానీ ఒక గొప్ప వారసత్వాన్ని ఇచ్చారు. ఈ రోజు నుంచి మన సంపాదనలో ఒక భాగం ఈ ఊరిలో చదువుకోవాలనే తపన ఉండి, డబ్బు లేని పేద విద్యార్థుల కోసం వినియోగిద్దాం. ‘‘సూర్యప్రకాశరావు విద్యా నిధి’’ ద్వారా వందలాది మంది పేద బిడ్డలను చదివించి, నాన్న ఆశయాన్ని మనం బతికిద్దాం. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి,’’ అన్నాడు అజయ్ దృఢంగా. సుమ, అజయ్ భుజంపై చేయి వేసి మద్దతుగా నిలిచింది. పిల్లలు ఇద్దరూ తాతయ్య ఫొటోకు నమస్కరించారు. తండ్రి మడత కుర్చీలో ఇప్పుడు ఒక కొత్త బాధ్యత కూర్చున్నట్టు అనిపించింది. ఆకాశంలో వెలిసిన ఇంద్రధనుస్సులా సూర్యప్రకాశరావు గారి త్యాగం ఇప్పుడు ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో రంగులు నింపడానికి సిద్ధమైంది. నిశ్శబ్దంగా కురిసిన వాన భూమిని తడిపినట్లు.. నాన్న నిశ్శబ్ద త్యాగం ఒక గొప్ప సామాజిక మార్పుకు పునాది వేసింది.
కత్తిమండ ప్రతాప్ కుమార్
9000343095







కామెంట్‌లు (0)