కాలం మారుతున్నా, తరాలు మారుతున్నా పండగ రోజు కొన్ని వంటకాలకు మాత్రం స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇంటిల్లిపాదినీ ఒక్కచోట చేర్చే ఆత్మీయత, వంటింటి నుంచి వెదజల్లే నెయ్యి పరిమళం, అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ రుచులు.. పండగ వాతావరణానికి ఇవన్నీ మరింత కమ్మని రుచిని జోడిస్తాయి. అలాంటి మనసుకు హత్తుకునే పాతకాలపు రుచుల్లో ఉండ్రాళ్లు, బొబ్బట్లు, పాలతాలికలు ముందుంటాయి. ఈ వంటకాలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
బొబ్బట్లు
కావాల్సినవి : శనగపప్పు - కప్పు, తురిమిన బెల్లం - కప్పు, యాలకుల పొడి - స్పూను, పచ్చి కొబ్బరి తురుము - 2 స్పూన్లు, నెయ్యి - స్పూను, గోధుమ పిండి - కప్పు, బొంబాయి రవ్వ - స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - చిటికెడు, నెయ్యి - 4 స్పూన్లు .
తయారీ : ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, పసుపు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చాలా మెత్తగా, చేతికి అంటుకునేలా జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, పిండి నూనెలో నానేలా బాగా ఒత్తి, మూతపెట్టి కనీసం 1 నుండి 2 గంటల పాటు నాననివ్వాలి. (పిండి ఎంత బాగా నానితే బొబ్బట్టు అంత మెత్తగా వస్తుంది).
శనగపప్పును శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో 3-4 విజిళ్లు వచ్చే వరకూ మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, పప్పును మెత్తగా రుబ్బుకోవాలి లేదా మిక్సీ పట్టుకోవాలి. ఒక బాండీలో తురిమిన బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి కరగనివ్వాలి. బెల్లం కరిగాక వడకట్టి, మళ్లీ పొయ్యి మీద పెట్టి పాకం రానివ్వాలి. ఈ బెల్లం పాకంలో రుబ్బిన శనగపప్పు మిశ్రమం, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, స్పూను నెయ్యి వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడి బాండీకి అంటుకోకుండా ముద్దలా అయ్యేంత వరకూ సన్నని మంటపై ఉడికించి దించాలి. చల్లారాక చిన్న చిన్న పూర్ణం ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. నానిన పిండి నుండి పూర్ణం ఉండ కంటే సగం పరిమాణంలో పిండి ముద్దను తీసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవరుపై కొద్దిగా నెయ్యి రాసి, పిండి ముద్దను పరిచి, మధ్యలో పూర్ణం ఉండను ఉంచి అన్ని వైపులా పిండితో కప్పి వేయాలి. పెనాన్ని బాగా వేడి చేసి, ఒత్తిన బొబ్బట్టును జాగ్రత్తగా పెనం మీద వేయాలి. రెండు వైపులా మంచి నెయ్యి రాస్తూ, దోరగా కాలే వరకూ కాల్చి తీస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మటి నేతి బొబ్బట్లు రెడీ.!
పాలతాలికలు
కావాల్సినవి : తడి బియ్యప్పిండి - కప్పు, పాలు - లీటరు, తురిమిన బెల్లం- కప్పు, నీళ్లు - కప్పు, యాలకుల పొడి - స్పూను, సగ్గుబియ్యం - 3 స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు - గుప్పెడు, జీడిపప్పు, కిస్‌మిస్ - 2 స్పూన్లు, నెయ్యి - రెండు స్పూన్లు.
తయారీ : ఒక పాత్రలో కప్పు నీళ్లు, అర స్పూన్ నెయ్యి, చిన్న చిటికెడు ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంట తగ్గించి, బియ్యప్పిండిలో నుండి 2 స్పూన్ల పిండిని పక్కన ఉంచుకుని, మిగిలిన పిండిని వేసి బాగా కలిపి మూతపెట్టాలి. నిమిషం తర్వాత దించి కాస్త చల్లారనిచ్చి, చేతికి నెయ్యి రాసుకుంటూ ముద్దలా ఒత్తుకోవాలి. తయారుచేసుకున్న పిండి ముద్ద నుండి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చేతుల మధ్య ఉంచి పలచని పొడవాటి తాలకులుగా (లేదా మురుకుల గొట్టంలో పెద్ద రంధ్రాల బిళ్ల వేసి) ఒత్తుకోవాలి. వాటిపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లితే ఒకదానికొకటి అంటుకోవు. ఒక వెడల్పాటి పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగాక అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం సగం ఉడికాక, తయారుచేసి పెట్టుకున్న తాలకలను వేయాలి. తాలకులు వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు. 2-3 నిమిషాల తర్వాత సన్నని మంటపై మెల్లగా తిప్పుతూ తాలకలను ఉడికించాలి.
తాలకులు ఉడికే లోపు, మరొక పాత్రలో తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు వేసి కరిగే వరకూ వేడిచేసి, వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన ఉంచుకున్న 2 స్పూన్ల బియ్యప్పిండిలో కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి లీక్విడ్‌లా కలిపి, ఉడుకుతున్న తాలకల పాలల్లో వేయాలి. దీనివల్ల పాలు చిక్కదనంగా ఉంటాయి. తాలకులు, సగ్గుబియ్యం మెత్తగా ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసి స్టవ్ ఆపేయాలి. పాలు కొద్దిగా చల్లారిన తర్వాత (వేడి మీద బెల్లం నీళ్లు పోస్తే పాలు విరిగిపోతాయి) వడకట్టిన బెల్లం నీళ్లను వేసి బాగా కలుపుకోవాలి. ఒక చిన్న బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్, పచ్చి కొబ్బరి ముక్కలను దోరగా వేయించి, ఈ పాలతాలకలలో కలుపుకుంటే కమ్మటి నోరూరే పాలతాలకులు రెడీ.

ఉండ్రాళ్లు
కావాల్సినవి: బియ్యపు రవ్వ - కప్పు, పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు - 2 కప్పులు, జీలకర్ర- స్పూను, నెయ్యి - స్పూను,ఉప్పు - తగినంత.
తయారీ : బాండీలో నెయ్యి వేసి, వేడెక్కాక జీలకర్ర, నానబెట్టిన పెసరపప్పు వేసి నిమిషం పాటు వేయించాలి. అందులో 2 కప్పుల నీళ్లు, సరిపడా ఉప్పు వేసి, బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంట తగ్గించి, బియ్యపు రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మూత పెట్టి రవ్వ దగ్గరపడి, మెత్తగా ఉడికే వరకూ చిన్న మంటపై ఉంచాలి. మిశ్రమం ఉడికిన తర్వాత దించి, కాస్త చల్లారనివ్వాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, గోలీల కంటే కాస్త పెద్ద పరిమాణంలో గుండ్రటి ఉండ్రాళ్లుగా చుట్టుకోవాలి. ఈ ఉండ్రాళ్లను ఇడ్లీ పాత్ర ప్లేట్‌లో ఉంచి 8-10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే కమ్మటి ఉండ్రాళ్లు రెడీ.







కామెంట్‌లు (0)