పారిశ్రామిక వ్యర్థాలు, పరిసరాల్లోని ప్లాస్టిక్ నీటిలో కలిసిపోవడం వల్ల జీవుల మనుగడకు ప్రమాదకరంగా మారుతోంది. అంతెందుకు మనం పీల్చే గాలి, తాగే నీటిలో అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నాయి. ఇవి శరీరంలోకి చేరి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ యూనివర్సిటీ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. గంటలోనే నీటిలోని 95 శాతం మైక్రోప్లాస్టిక్స్, నానోప్లాస్టిక్స్‌ను తొలగించే మ్యాగ్నెటిక్ మెటీరియల్‌ను రూపొందించారు.
ప్లాస్టిక్ బాటిళ్లలోని మంచి నీటిని తాగడం ద్వారా కూడా ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి చేరుతున్నాయి. సహజ వనరులు కలుషితం కావడం వల్ల ప్లాస్టిక్ రేణువులు నీటిలో కలుస్తున్నాయి. నదుల్లోని నీటిని ఫిల్టర్ చేసి వినియోగిస్తున్నప్పటికీ.. సాధారణ ఫిల్టర్లు అత్యంత సూక్ష్మంగా ఉండే మైక్రో, నానో ప్లాస్టిక్‌లను వడకట్టలేక పోతున్నాయి. దీంతో నీటి ద్వారా ప్లాస్టిక్ రేణువులు మన శరీరంలోకి చేరి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి.
తొలి మెట్టు..
నీటిలోకి చేరుతున్న ప్లాస్టిక్ రేణువులు సమస్త జీవజాలంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నీటి నుంచి మైక్రో, నానో ప్లాస్టిక్‌లను తొలగించే మ్యాగ్నెటిక్ మెటీరియల్‌ను ఆర్ఎంఐటీ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు. తిరిగి వాడగలిగే ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఒక గంటలోపే నీటిలోని 95 శాతం ప్లాస్టిక్ రేణువులను తొలగిస్తుందని వారు చెబుతున్నారు.
ఈ సరికొత్త నీటి శుద్ధి టెక్నాలజీ 30 నానో మీటర్ల పరిమాణం వరకు ఉన్న అతి చిన్న ప్లాస్టిక్ రేణువులను సైతం ఫిల్టర్ చేయగలుగుతుంది. అంతేకాకుండా హానికరమైన పాదరసం, క్రోమియం, రాగి లాంటి భార లోహాలు, ఔషధాల అవశేషాలు, పారిశ్రామిక రంగులను సైతం నీటి నుంచి తొలగిస్తుంది. ఆర్ఎంఐటీ యూనివర్సిటీ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మొహమ్మద్ హారీస్, సహ పరిశోధకులు ప్రొఫెసర్ నిక్కీ ఏష్టియాఘి, అసోసియేట్ ప్రొఫెసర్ నాసిర్ మహమూద్ కలిసి చేపట్టిన ఈ పరిశోధన వివరాలను ‘కెమికల్ ఇంజినీరింగ్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.
ల్యాబోరేటరీ పరీక్షల్లో మంచి నీటితోపాటు ఉప్పు నీటిలోనూ.. పాలీ ఇథిలీన్, పాలీప్రొపైలీన్, పాలీస్టర్ సహా 95 శాతం సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను ఈ మ్యాగ్నటిక్ పౌడర్ తొలగించింది. తొలి 15 నిమిషాల్లోనే 80 శాతం కాలుష్య కారకాలను ఈ పొడి పట్టుకుంది. ఇది కమర్షియల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసే సమయానికి సమానం.

ప్లాస్టిక్ రేణువులతోపాటు పాదరసం, క్రోమియం, రాగి లాంటి భార లోహాలు, ఐబూప్రొఫెన్, దుస్తుల రంగులను కూడా ఇది 95 శాతానికిపైగా తొలగించింది. ప్రకృతిలో చాలా నెమ్మదిగా విచ్ఛిన్నమయ్యే విషపూరిత రసాయనాలైన PFASలను కూడా ఇది పట్టుకుంటుందని తొలి దశ పరీక్షల్లో తేలింది. అయితే ఈ పక్రియ ప్రారంభ దశలోనే ఉందని పరిశోధకులు తెలిపారు.
నానో ప్లాస్టిక్‌లను భారీ స్థాయిలో తొలగించేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రభావవంతమైన పరిష్కారం లేదని ప్రొఫెసర్ ఏష్టియాఘి తెలిపారు. అతి సూక్ష్మంగా ఉండే ఈ రేణువులను సాధారణ ఫిల్టర్లు వడకట్టలేవు. దీంతో వాటిని తొలగించడం క్లిష్టమైన వ్యవహారంగా మారిందని ఆమె చెప్పారు.
గతంలో ఉపయోగించిన వాటర్ క్లీనింగ్ పౌడర్లు నీటిలోని కాలుష్య కారకాలను పీల్చుకున్న తర్వాత.. ఆ పొడిని నీటి నుంచి వేరు చేయడం కష్టంగా ఉండేది. దీనికి పరిష్కారం కనుగొనడం కోసం కెనడాకు చెందిన వన్ ఐ ఇండస్ట్రీస్‌తో ఆర్ఎంఐటీ భాగస్వామ్యం కుదుర్చుకొని.. కాలుష్య కారకాలను పీల్చుకునే పొడిని ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్‌తో జత చేసింది. నీటిని శుద్ధి చేసిన తర్వాత అయస్కాంతాలు నీటి నుంచి ఈ పొడిని సులభంగా బయటకు లాగేస్తుండటంతో.. దీన్ని తిరిగి ఉపయోగించే అవకాశం లభించింది.
ఈ విధానంలో చౌకగా లభించే ముడి వస్తువులను ఉపయోగిస్తారు. దీనివల్ల మైక్రో ప్లాస్టిక్స్ తొలగించడానికి ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ మ్యాగ్నెటిక్ పౌడర్‌ను క్లీన్ చేసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. కాబట్టి నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.







కామెంట్‌లు (0)