- సరికొత్త చరిత్ర సృష్టించిన ఎలన్‌మస్క్ సంస్థ
టెక్సస్ : అంతరిక్ష ప్రయోగాల్లో ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ మరో రికార్డు సృష్టించింది. అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకున్న భారీ స్టార్‌షిప్ వ్యోమనౌకను లాంచ్ ప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన భారీ మెకానికల్ చేతులతో విజయవంతంగా ఒడిసిపట్టింది. 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత శనివారం ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే శుక్రవారం ప్రయోగం తర్వాత తొలి దశ బూస్టర్ సరిగా పనిచేయకపోవడంతో సముద్ర జలాల్లో కూలి పేలిపోయింది. దీంతో 'డబుల్ క్యాచ్' చేయాలన్న సంస్థ లక్ష్యం నెరవేరలేదు. అయినప్పటికీ, స్టార్‌షిప్ సురక్షితంగా లాంచ్ ప్యాడ్‌ను చేరుకోవడంతో భవిష్యత్తులో చంద్రుడు, అంగారక యాత్రలకు మార్గం సుగమమైంది. ఈ ప్రయోగం విజయవంతం పట్ల అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్ష పరిశోధనలో ఈ ప్రయోగాన్ని స్పేస్‌ఎక్స్ చారిత్రక విజయంగా అభివర్ణించింది. కక్ష్యలోకి వెళ్లి తిరిగి వచ్చిన ఆర్బిటల్ రాకెట్‌పై దశను ప్రయోగ స్థలంలో నియంత్రితంగా పట్టుకోవడం ఇదే తొలిసారి. 'మెకాజిల్లా'గా పిలిచే ఈ వ్యవస్థ స్టార్‌షిప్ భూమికి చేరుకున్న సమయంలో దాన్ని నిటారుగా పట్టుకుంది. రాకెట్లను పూర్తిగా పునర్వినియోగించుకునే దిశగా ఇది కీలక ముందడుగు. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ సిబ్బందిని సిఇఒ ఎలన్ మస్క్ అభినందించారు. ‘స్పేస్‌ఎక్స్‌లోని అద్భుతమైన బృందానికి అభినందనలు’ అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నాసా నిర్వాహకుడు జారెడ్ ఐజాక్‌మాన్ కూడా స్పేస్‌ఎక్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత దాదాపు మాయలా ఉందని, అంతరిక్ష అన్వేషణపై మరింత మందికి నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. చంద్రుడికి చేరువయ్యేందుకు ఇది మరో అడుగు అని అభివర్ణించారు.
15వ ప్రయోగంలో 26 ఉపగ్రహాల మోహరింపు
స్పేస్‌ఎక్స్ వివరాల ప్రకారం.. స్టార్‌షిప్ తన 15వ ప్రయాణం కోసం శుక్రవారం టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి బయలుదేరింది. ప్రయోగ వ్యవస్థలో సూపర్ హెవీ బూస్టర్, స్టార్‌షిప్ అనే రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. సూపర్ హెవీ బూస్టర్‌లోని 33 రాప్టర్ ఇంజిన్ల సాయంతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం 'హాట్ స్టేజింగ్' ప్రక్రియ ద్వారా స్టార్‌షిప్ బూస్టర్ నుంచి విడిపోయి, తన ఆరు రాప్టర్ ఇంజిన్లతో కక్ష్యలోకి ప్రయాణించింది. ఈ మిషన్‌లో భాగంగా 26 స్టార్‌లింక్ వి3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోహరించింది. ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అన్ని ఉపగ్రహాలతో సంబంధాలు ఏర్పడినట్లు స్పేస్‌ఎక్స్ తెలిపింది. అవి స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో చేరేందుకు తమ కక్ష్యలను పెంచుకోవడం ప్రారంభించాయి. స్టార్‌షిప్ విడిపోయిన తర్వాత సూపర్ హెవీ బూస్టర్ తిరిగి భూమికి చేరేందుకు దిశ మార్చుకుంది. బూస్ట్‌బ్యాక్ బర్న్ కోసం 33 రాప్టర్ ఇంజిన్లలో 32 ఇంజిన్లను మళ్లీ మండించింది. అయితే ఇంధనం తక్కువగా ఉండటంతో ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి ముందే ముగిసిందని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది. దీనికి గల మూల కారణాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత బూస్టర్‌లోని మార్గనిర్దేశక, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థ ఆటోమేటిక్‌గా అబార్ట్ ప్రక్రియను ప్రారంభించింది. దీంతో అది తీరానికి దూరంగా ఉన్న ల్యాండింగ్ ప్రాంతం వైపు మళ్లింది. గల్ఫ్ జలాల మీదుగా ల్యాండింగ్ బర్న్‌ను పూర్తి చేసినప్పటికీ, ఫ్లైట్ టెర్మినేషన్ సిస్టమ్ యాక్టివేట్ కావడంతో సముద్రంలో కూలిపోయింది. ఫలితంగా బూస్టర్‌ను తిరిగి పట్టుకోవాలన్న సంస్థ లక్ష్యం నెరవేరలేదు.
22.5 గంటల తర్వాత తిరిగి స్టార్‌బేస్‌కు..
మరోవైపు స్టార్‌షిప్ 20 గంటలకు పైగా కక్ష్యలో గడిపిన తర్వాత భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. డీ-ఆర్బిట్ బర్న్ కోసం ఒక రాప్టర్ సముద్ర మట్టపు ఇంజిన్‌ను మళ్లీ మండించింది. దీంతో వ్యోమనౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించి టెక్సాస్ వైపు ప్రయాణించింది. గల్ఫ్ మీదుగా ప్రయాణించి తాను బయలుదేరిన స్టార్‌బేస్‌ను సమీపించింది. మేఘాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ల్యాండింగ్ కోసం వ్యోమనౌక తన దిశను మార్చుకుంది. నెమ్మదిగా కిందికి దిగేందుకు మూడు రాప్టర్ ఇంజిన్లను మండించారు. అనంతరం లాంచ్ టవర్ వద్ద సిద్ధంగా ఉన్న మెకాజిల్లా యాంత్రిక చేతులు స్టార్‌షిప్‌ను విజయవంతంగా పట్టుకున్నాయి. ప్రయోగ స్థలం నుంచి బయలుదేరిన సుమారు 22.5 గంటల తర్వాత అది తిరిగి అదే కేంద్రానికి చేరుకుంది.
రాకెట్ల పునర్వినియోగానికి కీలక మైలురాయి..
సాధారణంగా అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్‌లోని పై దశలు తమ లక్ష్యాలను పూర్తి చేసిన తర్వాత వాటిని తిరిగి ఉపయోగించరు. అయితే స్పేస్‌ఎక్స్ రెండు దశలను తిరిగి తీసుకొచ్చి, పునరుద్ధరించి మరోసారి ప్రయోగాల్లో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తొలి దశ బూస్టర్లను తిరిగి పొందడంలో సంస్థ పురోగతి సాధించింది. తాజా ప్రయోగంలో స్టార్‌షిప్‌ను కూడా ప్రయోగ టవర్ వద్ద పట్టుకోవడం ద్వారా పై దశను తిరిగి పొందే దిశగా మరో కీలక విజయం సాధించింది. రాకెట్లను పూర్తిగా పునర్వినియోగించుకోగలిగితే అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రయోగం తర్వాత ఖరీదైన పరికరాలను పారవేయాల్సిన అవసరం తగ్గుతుంది. వాటిని తిరిగి సిద్ధం చేసి మరోసారి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చంద్రుడు, అంగారకుడిపైకి భవిష్యత్తులో చేపట్టే యాత్రలకు ఈ సాంకేతికత ఎంతో కీలకమని స్పేస్‌ఎక్స్ పేర్కొంది.









కామెంట్‌లు (0)