తెలంగాణ : ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా ... బిఆర్‌ఎస్ పోరుబాట పట్టింది. దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. నేడు తన 50వ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కెటిఆర్ ... విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచి నల్ల చొక్కాతో నిరసన పాల్గొన్నారు. బిఆర్ఎస్ పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్దకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు, యువత కదం తొక్కుతున్నారు. వారి పోరాటానికి అండగా ఉండేందుకే నిరసన కార్యక్రమం చేపట్టామని కెటిఆర్ అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ... ఢిల్లీలో పార్టీలకు అతీతంగా నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత గళం విప్పుతున్నారని, యువత పోరాటానికి అండగా ఉండేందుకే నిరసన కార్యక్రమం చేపట్టాం అని తెలిపారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బిఆర్‌ఎస్ అని చెప్పారు. కేంద్రంలోని బిజెపి మతం పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాజకీయ అజెండాతో యువత పోరాటాన్ని మలినం చేయొద్దు అని హెచ్చరించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పారని, 12 ఏళ్లు అయింది.. 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా ? అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీకేజీ ఒక్క దాని కోసమే కాదు ఆందోళనలు.. నిరాశ, నిస్పృహలో యువత ఉన్నారని, న్యాయం చేయాలని విద్యార్థులు అడిగితే.. పోలీసులతో కొట్టిస్తున్నారు అని కెటిఆర్ మండిపడ్డారు. బిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, యువత కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు.
యువత పోరాటానికి అండగా బిఆర్ఎస్ పోరుబాట : కెటిఆర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)