శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు నుంచి "సంజీవని హెల్త్ ప్రాజెక్ట్" ప్రారంభిస్తాం : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

"Sanjeevani Health Project" to be launched from August: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 03:53 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

రంపచోడవరం (అల్లూరి) : ఆగస్టు నుంచి "సంజీవని హెల్త్ ప్రాజెక్ట్" ప్రారంభిస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం అల్లూరి జిల్లా రంపచోడవరంలో సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు పర్యటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు కలిసి ముఖ్యమంత్రికి, మంత్రికి స్వాగతం పలికారు. రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ముఖాముఖిగా మాట్లాడారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఫోటోఫ్రేమ్ వద్ద విద్యార్ధులు, వారి తల్లితండ్రులతో ఫోటోలు దిగారు. అనంతరం తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి విద్యార్థుల చదువు పురోగతి, ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును స్వయంగా సిఎం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ .... తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల పెంపకంలో సమాన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మెగా పీటీఎం సమావేశాలకు తండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని, రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "తల్లికి వందనం" పథకం ద్వారా ప్రతి అర్హ విద్యార్థికి రూ.15,000 అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు రూ.10,120 కోట్లను 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 5.11 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.664 కోట్ల లబ్ధి కల్పించినట్లు చెప్పారు. గత రెండేళ్లలో 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలలు టీసీలు ఇవ్వకుండా అడ్డుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. గిరిజన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్‌ను మరింత విస్తరిస్తామని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లు, నో-బ్యాగ్ డే, పోషకాహారం, నెట్-జీరో పాఠశాలల వంటి సంస్కరణలను వివరించారు. ఆగస్టు నుంచి "సంజీవని హెల్త్ ప్రాజెక్ట్" ప్రారంభిస్తామని ప్రకటించారు. టీచర్ల బదిలీలను పూర్తిగా కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల 5,971 మంది ఉపాధ్యాయులను నియమించామని, మొత్తం 16 వేల టీచర్ పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేశామని చెప్పారు. డీఎస్సీ నియామకాలపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. సంక్షేమం–అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, విశాఖలో డేటా సెంటర్లు, ఏఐ ప్రాజెక్టులు రానున్నాయని పేర్కొన్నారు. "చదువే నిజమైన ఆస్తి" అని విద్యార్థులకు సందేశమిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగవుతుందని అన్నారు. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఏడు మండలాల ప్రజల సహకారాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం చారిత్రక నిర్ణయమని అన్నారు. పోలవరం జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్య, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల కోసం తీసుకొచ్చిన జీఓ నెం.3 సుప్రీంకోర్టు తీర్పుతో అమలుకాలేకపోయినా, గిరిజనుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన యువతను ప్రపంచస్థాయి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సంపద సృష్టి, ఆదాయ వృద్ధి, ఆర్థిక అసమానతల తగ్గింపుపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వాట్సాప్ ఆధారిత సేవలతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని వెల్లడించారు. టెక్నాలజీ ద్వారా అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా సహించబోమని స్పష్టం చేశారు. హింసాత్మక రాజకీయాలను ఖండిస్తూ, మంచి రాజకీయాలను ప్రజలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి టెక్నాలజీ అందించి ఏజెన్సీ ప్రాంత ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమన్నారు. పోలవరం జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల బాధ్యత అని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్