హైదరాబాద్ : కన్నడ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రతా లోపాల కారణంగా ప్రమాదం జరగడంతో, యూనివర్సిటీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. శనివారం రాత్రి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో 'టాక్సిక్' చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో కొందరు యువకులు స్టేజీని సరిగా చూసేందుకు ఫ్లడ్‌లైట్లు, భారీ సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసిన ఇనుప పోల్స్‌పైకి ఎక్కారు. బరువు ఎక్కువ కావడంతో ఓ సౌండ్ బాక్స్ పోల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగి, ఇద్దరు యువకులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు యశ్ వేదికపై ప్రసంగిస్తున్నారు. ఘటనను గమనించిన వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ఆపి, "అక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారా ? ఏం జరిగిందో చూడండి " అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. లైటింగ్ స్టాండ్లు, మైక్ పోల్స్‌పై ఉన్నవారు వెంటనే కిందకు దిగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక భద్రతా ప్రమాణాలు, జన నియంత్రణ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో పాటు చిత్ర యూనిట్‌పై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
'టాక్సిక్' ఈవెంట్‌లో అపశ్రుతి - మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)